ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై బీజేపీ దాడిని ముమ్మరం చేసింది. ఢిల్లీలోని ఆప్ కార్యాలయం ముందు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆప్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.
మరోవైపు ఢిల్లీ యూనిట్ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పేరు బయటకు వచ్చినందున ఆప్ ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు. ఆప్ నేతలు అవినీతితో ఢిల్లీని చెద పురుగుల్లా తొలిచేస్తున్నారని విమర్శించారు. ఈ స్కామ్ లో వచ్చిన రూ. 100 కోట్లలో కొంత మొత్తాన్ని గత ఏడాది గోవా ఎన్నికల ప్రచారంలో వినియోగించినట్టు గుర్తించామని ఈడీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది.