Suryaa.co.in

Political News

ఎన్నికలకు ముందే బీజేపీ అస్త్రసన్యాసం

తమలపాకుతో తాను ఇట్లాంటే మొద్దు పరకతో నేను ఇట్ల0టి అన్నట్లుంది బీజేపీ నాయకుల పరిస్థితి. నాకు తెలియకుండా స్టాంప్ కుంభకోణంలో కోట్లు మింగినోడిని పార్టీలోకి నీవు తీసుకొస్తే, గ్యాంబ్లింగ్ కాసినో, ఆన్లైన్ బెట్టింగ్, నార్కోటిక్స్ లో ఆరితేరిన వాడిని నేను తీసుకొస్తా . ఎవరు కాదంటారో చూస్తాను అన్నాడంట ఇంకో నాయకుడు. అట్టహాసంగా వందల కార్లతో ర్యాలీ నగరమంతా ఫ్లెక్సీలు డీజేలు, సైలెన్సర్ తీసి ద్విచక్ర వాహనాలు గాలిలో తేలుతూ కాషాయ పార్టీలో చేరడానికి సిద్ధమైతే .. ఇదిగో ఇప్పుడే వస్తా అని దేశ రాష్ట్ర నాయకులు దర్వాజా బంద్ చేసి అతీగతీ లేరంట.

పార్టీలో చేరేటోళ్లు చేసేది ఏమి లేక తెచ్చుకున్న పలావ్ అన్నం తిని , రెండు రోజుల్లో అందరికీ క్లారిటీ వస్తుందని పలాయనం చిత్తగించారు. కిషన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సోయం బాబూరావు, డీకే అరుణ, డి అరవింద్ ఇలా పేరుమోసిన వారందరూ శాసనసభకు పోటీ చేయడం లేదు. డిమాండ్ లేని నాయకులు ఐదు ఆరు చోట్ల పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆరు వేల దరఖాస్తులు వచ్చాయని వాపును చూసి బలమని భ్రమ అనుకుంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలంగాణాలో బిజెపి అడ్రస్ గల్లంతైంది.

మా పార్టీలో దేశాన్ని ముంచినోళ్లు, బ్యాంకులను ముంచినోళ్లు, రేపిస్టులు, ఇడి, ఏసీబీ, సీబీఐ కేసులున్నవారికి ఎర్రతివాచీ పరచి వారి ఆర్థిక స్వాలంబన కోసం కేసులు మాఫీ, బ్యాంకు రుణాలు రైటాఫ్ లాంటివి ఎన్ని ప్రలోభ పెట్టినా చేరికలు లేవు. కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన స్థానంలో కార్పొరేటర్ సీనియర్ నాయకుడు పలాయనం చిత్తగించాడు.

ఇక బిఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి వచ్చిన రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి కి ప్రాధాన్యం లేకుండా పోవడంతో నేడో రేపో పార్టీ మారే అవకాశం ఉంది. బిఆర్ఎస్ బీజేపీ బంధం గురించి ఎక్కువగా చెప్పనవసరం లేదు. కవితకు ఇడి నోటీసులు విషయంలో కర్ణాటకలో కేసీఆర్ మద్దతిచ్చిన దళ్ బీజేపీ పంచన చేరడం. కుల గణన పై నోరు మెదపరు, ప్రజల జీవనాన్ని ఛిద్రం చేసి, నల్ల చట్టాలకు మద్దతు ఇవ్వడానికి రెండు పార్టీలు ముందుంటాయి.

తెలంగాణలో బిజెపి వివాదాల కుంపటిలో చిక్కుకుంది. అంతర్గత పోరు మరియు సంభావ్య నాయకత్వ మార్పుల గురించి కొన్ని నెలలుగా ఊహాగానాలు సాగుతున్నాయి, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మరింత తీవ్రమయ్యాయి. సోషల్ మీడియాలో పలువురు భాజపా నేతలు నిరుత్సాహాన్ని వ్యక్తం చేయడంతో పార్టీ పరిస్థితి నిర్వహణ మీడియా పీడకలగా మారింది. అసంతృప్త నాయకులను పార్టీ నుంచి బయటకు రాకుండా నిరోధించే ప్రయత్నం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కట్టడి చేయలేకపోతున్నాడు.

రాబోయే ఎన్నికల్లో అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి వ్యతిరేకంగా నాయకత్వానికి పోటీ పడుతుండగా బీజేపీ నేతలు మధ్య వాగ్వాదం గత కొన్ని నెలలుగా చెలరేగింది. కాలక్రమేణా, మరికొంతమంది అసమ్మతి నేతలు పార్టీలో తమ పదవులపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, తమను పక్కన పెట్టారని పేర్కొన్నారు. బీజేపీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒకడుగు ముందుకు వేసి కేంద్ర నాయకత్వాన్ని తూర్పారబట్టారు.

ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన వారిలో చాలా మంది నాయకులు ఇప్పుడు పార్టీ బలహీనమైన ప్రజా ప్రతిష్టను పరిగణనలోకి తీసుకుని బిజెపి వెలుపల మంచి రాజకీయ అవకాశాల కోసం వెతుకుతున్నారని రాజకీయ పరిశీలకులు గమనిస్తున్నారు. కర్నాటకలో విజయం సాధించిన తర్వాత, గత వారం నిర్వహించిన విజయీభవ అలాగే ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ముందుంది. బిఆర్ఎస్ నాయకులను చేర్చుకుని గట్టి పోటీ ఇస్తోంది . కాంగ్రెస్‌లో అంతర్గత పోరు సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం, తెలంగాణలో బిఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మారడానికి కాంగ్రెస్ కంటే బిజెపి మెరుగైన స్థానంలో ఉంది.

అయితే, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అంతర్లీన అంశాలు మరింత తీవ్రమయ్యాయి. బయటి వ్యక్తులను కలుపుకోవడంలో వైఫల్యం, అనుభవజ్ఞులైన సభ్యుల మధ్య విచ్ఛిన్నమైన ఐక్యత, కొత్త నాయకుల నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడంలో దూరదృష్టి లేకపోవడం, తెలంగాణలో హిందూత్వ భావజాలం యొక్క పరిమిత ప్రభావం, ప్రస్తుత నాయకత్వం యొక్క స్థానభ్రంశం వంటి అనేక సవాళ్లతో బిజెపి పోరాడుతోంది. ఎన్నికల ప్రచారాలు, బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా సమర్థవంతమైన ఎజెండా లేకపోవడం. తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు ఉందన్న అభిప్రాయాన్ని నాయకులు కొట్టిపారేయలేక పోతున్నారు .

అయితే, పార్టీ శ్రేణుల్లోని కొంతమంది “కొత్తవారు” “అసౌకర్యంగా” భావించారని “మీడియా లీక్‌లకు” బాధ్యులని నాయకులు అంగీకరించారు. పార్టీ అవకాశాలను దెబ్బతీసే ప్రయత్నాలను నిర్ణయాత్మక చర్యతో ఎదుర్కొంటామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. బీఆర్‌ఎస్ క్యాబినెట్‌లోని మాజీ మంత్రి ఈటల రాజేందర్ 2021లో భూకబ్జా కుంభకోణంలో ఇరుక్కుని, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తెలంగాణలోని ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన నాయకుడు రాజేందర్, రాష్ట్రంలోని బీసీలలో బలమైన మద్దతు స్థావరాన్ని నెలకొల్పడానికి పార్టీ ప్రయత్నాలకు అనుగుణంగా బిజెపిలో మంచి ఫిట్‌ని కనుగొన్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే సీటును నిలబెట్టుకున్నారు. దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణలో నాయకత్వ వైఫల్యం పరాభవాలకు కారణం అని సీనియర్ నాయకులు అంటున్నారు. జాతీయ భావం చూపిస్తూ ఉత్తరాదిన బీజేపీ బాగా లాభపడింది. కానీ దక్షిణాదిలో ఆ ఫార్ములాలేవీ పనిచేయవు దక్షిణాదిలో కేవలం కర్నాటకలోనే అంతో ఇంతో ఉనికి ఉంది తెలంగాణలో బలమైన నాయకత్వం లేకపోవడం పార్టీ విస్తరణకు ప్రధాన అడ్డంకిగా మారింది.

కేవలం విద్వేష రాజకీయాలను నమ్ముకున్న వారిని, అలాగే అమిత్ షా వచ్చినప్పుడు స్థానిక నాయకులను కార్యకర్తలను కలవకుండా సెలబ్రిటీలతో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు అలాంటివాటిని పక్కన పెట్టాల్సిందే. బీజేపీ దక్షిణాదిలో మత రాజకీయాలు చేయాలనుకోవడం భ్రమ అనే సంకేతాలు కర్ణాటక ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ గెలవాలంటే ఉత్తరాది వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాల్సిందే.

మరోవైపు బీజేపీ బిఆర్ఎస్ ఒక్కటే అనే భావన ప్రజల్లో బలపడుతుంది. బీజేపీ పై వ్యతిరేకతతో బిఆర్ఎస్ వెళ్లిన వారు, బిఆర్ఎస్ పై వ్యతిరేకతతో బీజేపీ వైపు వెళ్లిన వారికి ఎటు వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్నారు. బిఆర్ఎస్ లో ద్వితీయ శ్రేణి నాయకులు పూర్తి అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే కమ్యూనిస్టులను దూరం చేసుకుని ఉమ్మడి ఖమ్మం నల్గొండ కరీంనగర్ జిల్లాల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

మరోవైపు భారత్ బచావో, నేను సైతం, విద్య పరిరక్షణ కమిటీలు, కౌలు రైతులు, లౌకిక ప్రజా తంత్ర సంస్థలు, ప్రజా సంఘాలు, పౌర సంస్థలు కొన్ని ప్రత్యక్షంగా మరికొన్ని పరోక్షంగా కాంగ్రెస్ ని బలపరుస్తున్నాయి. ఏది ఏమైనా మతోన్మాద అవకాశవాద పార్టీలను ఇంటికి పంపి , లౌకిక ప్రజాతంత్ర శక్తులు బలపడి, దేశంలో సామాజిక సమగ్రత ఏర్పడి మెరుగైన సమాజం కోసం పని చేయాలి.

డా. యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

LEAVE A RESPONSE