Suryaa.co.in

Andhra Pradesh

జగన్..షర్మిల ఇద్దరూ ఒకటే

-విపక్షాల ఓట్లు చీల్చి మళ్లీ అన్నను గెలిపిద్దామనా?
-హోదాపై షర్మిలకు ఏం తెలుసు?
-విభజన జరిగినప్పుడు మీ అన్న జగన్ ఎంపీ
-లోక్‌సభలో ఉండి ముఖం చాటేసింది మర్చిపోయావా?
-జగన్‌ను అరెస్టు చేసినప్పుడు రోడ్డెందుకు ఎక్కావమ్మా?
-ఢిల్లీలో ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ 

రాష్ట్ర విభజన చేసిన సమయంలో ఎంపీగా ఆరోజు జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ లో ఉన్నారని మరచిపోవద్దు, ఆరోజు ఆయనకు దన్నుగా షర్మిల అన్న విసిరిన బాణం గా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన జరిగే సమయంలో సోనియా గాంధీకి భయపడి.. దొంగచాటుగా ప్లకార్డ్ కనపడి కనపడకుండా పట్టుకున్న నాటి టీవీ లైవ్ ఇప్పటికీ ప్రజలకు గుర్తుంది, అప్పుడే జగన్మోహన్ రెడ్డి ని షర్మిల నిలదీసినట్లయితే ప్రజలు విశ్వసించేవారు.

కాంగ్రెస్ మొదటి సంతకం ప్రత్యేక హోదా అని, నేడు మళ్లీ ప్రజలను ఆ పార్టీ నాయకులు మోసం చేస్తున్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక తరగతి హోదా వంటి అంశాలపైన ప్రజలకు వాస్తవాలు తెలవాలి, కాంగ్రెస్ మోసం బహిర్గతం అవ్వాలి. ఈరోజు అన్నను ప్రశ్నిస్తున్నట్లు కనబడుతున్న షర్మిల , జగన్ మోహన్ రెడ్డి అవినీతి కేసులో అరెస్ట్ అయినప్పుడు నడి రోడ్డుపై నిరశన తెలియచేయకుండా , అరెస్ట్ ను స్వాగతిస్తే ఈరోజు ప్రజలు నమ్మేవారు.

2019 ముందు ఏపీలో, 2023 వరకు తెలంగాణాలో సోనియా మరియు కాంగ్రెస్ తన తండ్రి మరణానికి కుట్ర చేశారనే షర్మిల ఆరోపించింది నిజమా, అబద్దమా?. ఇప్పుడు 2024 వచ్చేసరికి ఏపీలో షర్మిల చంద్రముఖి లాగా మారి, సోనియా మరియు కాంగ్రెస్ ఏసు ప్రభువు అంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు, కూతురు కాంగ్రెస్ ప్రతినిధులే. తల్లి, పిల్ల కాంగ్రెస్ లకు, దేశంలో రామాలయ నిర్మాణం కన్న అన్యమత వ్యాప్తి అంటేనే ప్రీతి.

షర్మిల ఏపీలోకి వచ్చి రాగానే మణిపూర్ లో జరిగిన హత్యలు అంటూ, అక్కడ తెగల మధ్య దీర్ఘకాలికంగా జరుగుతున్న అంశాలను, రాజకీయ లబ్ది కోసం మాట్లాడారు, కానీ మన పురంలో జరగుతున్న అకృత్యాలు, అరాచకాల పైన షర్మిల నాలుగున్నర సంవత్సరాలుగా పన్నెత్తి మాట్లాడ లేదు .

గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనలో అశువులు బాసిన దళితుల మరియు వెనుకబడిన వర్గాల పైన, అమరావతి ఉద్యమంలో మహిళల పైన జరిగిన అరాచకాలు, అకృత్యాల పైన ఏనాడు షర్మిల మాట్లాడ లేదు, ఎవరైనా ప్రశ్నిస్తే ఏపీతో నాకేం పని అని అన్నారు. అధికారం కోసం, అవకాశాల కోసం షర్మిల కి రాత్రికి రాత్రే ప్రాంతాలు, ప్రాధాన్యతలు మారిపోతాయి. అన్న చెల్లెళ్లు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి పెద్ద ప్రణాళికే వేశారు.

రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక తరగతి హోదా , ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది వాస్తవం. కానీ బీజేపీ డిమాండ్ కన్నా ముందే కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేక తరగతి హోదా స్థానంలో మార్పులు చేర్పులు కోసం చర్యలు తీసుకున్న వాస్తవాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి.

కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తులో ప్రత్యేక తరగతి హోదా ఉపసంహరణ తధ్యం అని ముందే తెలుసు. కేవలం రాష్ట్ర విభజన ద్వారా రాజకీయ లబ్ది పొందాలనే ఉద్దేశ్యంతోనే చిదంబర రహస్యాన్ని దాచి, రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో కాంగ్రెస్ పార్టీ వారు ప్రత్యేక తరగతి హోదా ప్రకటన చేయించారు.

రఘురామ రాజన్ కమిటీ రాష్ట్రాల వెనుకబాటు తనం పైన మరియు ప్రత్యేక తరగతి హోదా ద్వారా వచ్చిన మేలు ఏమిటి అనే విషయం పైన అధ్యయనం కోసం ఏ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వేశారు ? ఏ ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఆ అధ్యయన నివేదికను ఇచ్చారు, దాని సారాంశం ఏమిటి ?

రఘురామ రాజన్ కమిటీ సారాంశం మేరకు నాటి ఆర్థిక మంత్రి చిదంబరం గారు 14వ ఆర్ధిక సంఘంకు విధివిధానాల కూర్పు ఇచ్చారా, లేదా? 14వ ఆర్ధిక సంఘం నివేదిక ప్రకారం ప్రత్యేక తరగతి హోదా రాష్ట్రాలకు మరియు ఇతర రాష్ట్రాలకు మధ్య బేధం లేకుండా, కేంద్ర పన్నుల వాటా బదిలీ చేసిన అనంతరం ఏఏ రాష్ర్టాలకు రెవిన్యూ లోటు వస్తుందో ఆ రెవిన్యూ లోటు భర్తీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనే నిబంధన రాష్ట్రాల మధ్య అంతరాన్ని చెరిపి వేసింది.

రఘురామ రాజన్ కమిటీ నిర్ణయాలు మరియు 14వ ఆర్ధిక సంఘం నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మౌలిక స్వరూపం మారడం కూడా ప్రత్యేక తరగతి హోదా మరుగున పడడానికి కారణం అయ్యింది. ఈ సాంకేతిక అంశాలన్నీ నాడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ కు స్పష్టంగా తెలుసు కాబట్టే విభజన చట్టంలో ” ప్రత్యేక తరగతి హోదా ” ను ప్రస్తావించ లేదు.

నాటి బీజేపీ నాయకుల ఒత్తిడి వల్ల నాటి ప్రధాన మంత్రి, కనీసం 20 ఫిబ్రవరి 2014న రాజ్యసభలో చేసిన 5 ప్రకటనలలో ” ప్రత్యేక తరగతి హోదా ” ఒకటి, అయితే ఆ ప్రకటనను ఒక్కసారి చదివి అర్ధం చేసుకుంటే వాస్తవాలు అర్ధం అవుతాయి.

First, for purposes of Central assistance, Special Category Status will be extended to the successor state of Andhra Pradesh comprising 13 districts, including the four districts of Rayalaseema and the three districts of north coastal Andhra for a period of five years. This will put the state’s finances on a firmer footing.

ఈ ప్రకటన కూడా పూర్తి అస్పష్టతో, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, వాస్తవానికి నాడు మోడీ హడావుడిగా కాకుండా రాష్ట్ర విభజనను సహేతుకంగా 2014 తరువాత వచ్చే ప్రభుత్వం చేస్తుందన్నారు. కానీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మాట వినలేదు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తరగతి హోదా విషయంలో మనసులో ఒక రకంగా, తాత్కాలిక రాజకీయ లబ్ది కోసం మరో విధంగా వ్యవహరించింది.

2014 అనంతరం ప్రత్యేక తరగతి హోదా ముందు చెప్పిన మార్పుల వల్ల, కొత్తగా ఏ రాష్ట్రనికి ఇవ్వడానికి లేకపోవడం, ఇచ్చిన దాని వల్ల ప్రయోజనం లేదని రఘురామ రాజన్ కమిటీ నిర్ణయాలు మరియు 14వ ఆర్ధిక సంఘం నివేదిక ప్రకారం తేటతెల్లం కావడం నిజం.

ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా, 8 సెప్టెంబర్ 2016 న ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక తరగతి హోదా బదులు, ప్రత్యేక ఆర్ధిక సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది, దానికి నాటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. వైసీపీ వేసిన ఎత్తుగడల పర్యవసానం వల్ల , అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేడు రాష్ట్రం ప్రస్తుత పరిస్థితికి చేరింది.

2014 అనంతరం సంస్కరణలు వల్ల స్వయంగా జగన్మోహన్ రెడ్డి లేదా చంద్రబాబు నాయిడు ప్రధాన మంత్రి అయినా, దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేరు. అవకాశం ఉంటే 2014 ముందే ఒరిస్సా, బీహార్ రాష్ట్రాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తరగతి హుదా ఇచ్చేది, అధికారంలోకి వచ్చి అవకాశం లేదు కాబట్టి మరల మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక తరగతి హుదా ఇస్తామని మరోసారి అబద్దాలు చెబుతుంది.

రఘురామ రాజన్ కమిటీ నిర్ణయాలు మరియు 14వ ఆర్ధిక సంఘం నివేదిక ప్రకారం సంస్కరణలు అమలు చేశాక , ఎలా ప్రత్యేక తరగతి హోదా ఉండదని ప్రకటన చేసిన నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరోసారి వంచన చేస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన నష్టాలను పూరించుకునే , ప్రతి ప్రత్యమ్నాయ అంశం పైన దృష్టి పెట్టాలి, ప్రత్యేక తరగతి హోదా అనే అంశం పైన రాజకీయ పార్టీల అనాలోచిత రెచ్చగొట్టే విధానాలకన్నా, దేశంలోని వివిధ ఐఏఎస్ కోసం శిక్షణ ఇచ్చే సంస్థలు ఈ అంశం పైన ఏమి విశ్లేషించారో చర్చించాలి.

20 పైగా ఎంపీ లను గెలిపిస్తే ప్రత్యేక తరగతి హోదా తెస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, దాన్ని సాధించకపోవడానికి కారణం, అవకాశంలేని హామీ ఇవ్వడమే తప్ప వేరొకటి కాదు. ఇలాంటి హామీ సాధ్యం కాదని తెలిసినా పదే పదే అదే హామీ ఇవ్వడం మంచిది కాదు. రాష్ట్ర అభివృద్ధికి పరిశ్రమలు అవసరం, పరిశ్రమలు రావడానికి మౌలిక సదుపాయాలు మరియు పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం అవసరం.

రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇతర పక్షాలు వీటిపైనా దృష్టి పెట్టకుండా, కేవలం అవకాశంలేని ప్రత్యేక తరగతి హోదా చుట్టూ, నిత్యం కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టిపోస్తూ ప్రజల దృష్టిని మరల్చాలని పదే పదే చూస్తే, అది రాష్ట్రానికి నష్టం చేస్తుంది. మేము వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మా బ్లూ ప్రింట్ ప్రజల ముందు ఉంచుతాం.

LEAVE A RESPONSE