Suryaa.co.in

Andhra Pradesh

వెయ్యి ఎకరాల గర్భామ్ మాంగనీస్ మైన్‌ను దోపిడీ చేస్తున్న బొత్స కుటుంబం

– వాటాలు, లెక్కలు తేల్చుకోవడానికేనా జగన్ రెడ్డి జిల్లాలో అడుగుపెట్టింది
– 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్ రెడ్డి లెక్క సెటిల్ చేయబోతున్నారు
– ఐదేళ్లు పాటు ప్రతీ విజయనగరంలో సాగించిన అవినీతి లెక్కలు తన మాఫియా ముఠాతో పైనల్ చేసుకోవడానికే జగన్ రెడ్డి బస్సు యాత్ర చేస్తున్నాడు
– ఉత్తరాంధ్ర వనరులన్నీ దోచుకుని ఏ ముఖం పెట్టుకుని ఉత్తరాంధ్రకు వచ్చావ్ జగన్ రెడ్డి?
– విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబం అవినీతి తిమింగలంలా తయారైంది
– బొత్స సత్తిబాబు, చిన్నశీను, అప్పల నరసయ్య, అప్పల నాయుడు లు దోచిన లెక్కలు తేల్చి తన వాటా వసూలుకే జగన్ రెడ్డి విజయనగరం వచ్చాడు
– వైజాగ్ స్టీల్‌కు క్యాప్టివ్ మైన్ గా ఉన్న గర్భామ్ మాంగనీస్ మైన్‌ను సత్తిబాబు కుటుంబం కబ్జా చేసింది
– 2022 అక్టోబర్‌లో గర్భామ్ మంగనీస్ మైన్ లీజును విశాఖ ఉక్కు పరిశ్రమకు ఎందుకు రెన్యువల్ చేయలేదు?
– పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సత్తిబాబులు విశాఖ స్టీల్ కు మాంగనీస్ మైన్ లీజును పొడిగించకుండా తొక్కిపెట్టారు
– మైన్ గడువు ముగియడంతో వైజాగ్ స్టీల్ బహిరంగ మార్కెట్‌లో మాంగనీస్ టన్ను రూ.14-15 వేలు పెట్టి కొనాల్సి వస్తోంది
– విశాఖ స్టీల్ వారు మాంగనీస్ మైన్ లీజు రెన్యువల్ చేయాలని 12 లేఖలు రాసినా జగన్ రెడ్డి పట్టించుకోలేదు
– వైజాగ్ స్టీల్ కు చంపావతి నదిపై ఉన్న సరిపల్లి సాండ్ రీచ్ లీజు గడువును సైతం జగన్ సర్కార్ పొడిగించలేదు
– సరిపల్లి సాండ్ రీచ్ బొత్స బంధిపోటు ముఠా కబ్జాలో ఉంది
– విశాఖ స్టీల్‌కు చెందాల్సిన మాంగనీస్, ఇసుకను బొత్స కుటుంబం దోచుకుని కోట్లు దండుకుంటోంది
– విజయనగరం జిల్లాను దోచుకుని తాడేపల్లి ప్యాలెస్‌కు పెద్ద ఎత్తున కప్పం కడుతున్నందుకే బొత్స కుటుంబంలో అందరికీ సీట్లు దక్కాయి
– విశాఖ స్టీల్ ప్లాంట్ మైన్‌లను కబ్జా చేసి విశాఖ ఎంపీగా ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు.. ఝాన్సీ గారు?
-టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

మంగళగిరి: రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి లెక్క ప్రజలు సెటిల్ చేయబోతున్నారని, ఐదేళ్లు పాటు ప్రతీ జిల్లాలో జగన్ రెడ్డి సాగించిన అవినీతి లెక్కలు తన మాఫియా ముఠాతో పైనల్ చేసుకోవడానికే బస్సు యాత్ర చేపట్టాడని, ఉత్తరాంధ్ర వనరులన్నీ దోచుకుని ఏ ముఖం పెట్టుకుని ఉత్తరాంధ్రకు వచ్చావ్ అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.

విజయనగరంలో జగన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్రపై మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పట్టాభి విలేఖరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఉత్తరాంధ్రకు ఏం చేశాడనే దానిపై ప్రజల్లో అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. దోపిడీ, దౌర్జన్యాలు తప్ప ఉత్తరాంధ్రకు జగన్ చేసింది ఏముంది. వైకాపా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి చాలా స్పష్టంగా అర్ధమైంది. అందుకే చివరిసారిగా రాష్ట్రంలో ఒక రౌండ్ వేసి తన అవినీతి లెక్కలు సరిచేసుకోవడానికి బయలుదేరాడు.

ఐదేళ్లలో జగన్ రెడ్డి చేసింది చెప్పుకోవడానికి ఏమి లేదు. జగన్ రెడ్డిని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఐదేళ్ల కాలంలో జగన్ రెడ్డి సాండ్, లిక్కర్, మైన్, భూముల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. నాటు సారా దగ్గర నుంచి ఎర్రచందనం వరకు జగన్ రెడ్డి చేయని కార్యక్రమం లేదు. ఇలా ప్రతీ జిల్లాలలో తన అవినీతిని విస్తరించి ఇష్టానుసారం దోచుకున్నాడు. ఐదేళ్లలో జగన్ రెడ్డి చేసిన భారీ అవినీతి లెక్కలు సెటిల్ చేసుకోవడానికే బస్సు యాత్ర పేరుతో ప్రతీ జిల్లాలో తిష్టవేస్తున్నాడు. అందులో భాగంగానే నేడు విజయనగరం జిల్లాలో ప్రవేశించాడు.

విజయనగరం జిల్లాలో బొత్స సత్తిబాబు అనే భారీ అవినీతి తిమింగలం ఉంది. బొత్స కుటుంబం మొత్తం తమ అవినీతితో ఫ్యామిలి ఫ్యాకేజీ మాదిరి విజయనగరం జిల్లాకు క్షవరం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబం దోచుకున్న అవినీతి లెక్కలు తేల్చాలంటే మిగిలిన జిల్లాలతో పోల్చితే ఎక్కువ సమయమే పడుతుంది. బొత్స సత్తిబాబు, జెడ్పీ చైర్మన్ చిన్నశీను, గజపతినగరంకు చెందిన అప్పల నరసయ్య, నెల్లిమర్లకు చెందిన అప్పల నాయుడు లు దోచిన లెక్కలు తేల్చి తన వాటా వసూలుకే జగన్ రెడ్డి విజయనగరం వచ్చాడు. రాష్ట్రంలో ప్రజలు జగన్ రెడ్డికి ఫైనల్ సెటిల్‌మెంట్ చేస్తుంటే..జగన్ రెడ్డి తన మాఫియా ముఠాతో అవినీతి లెక్కల ఫైనల్ సెటిల్‌మెంట్ చేసుకుంటున్నాడు.

విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబ దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. విజయనగరం జిల్లా, మెరక ముడినం మండలంలోని దాదాపు వెయ్యి ఎకరాల గర్భామ్ మాంగనీస్ మైన్‌ను సత్తిబాబు కుటుంబం కబ్జా చేసింది. వైజాగ్ స్టీల్‌కు క్యాప్టివ్ మైన్ గా ఉన్న అతి విలువైన గర్భామ్ మాంగనీస్ మైన్ ను జగన్ రెడ్డి కనుసన్నల్లోనే సత్తిబాబు కుటుంబం కబ్జా చేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమకు గర్భామ్ మంగనీస్ మైన్ లీజు 2022 అక్టోబర్‌ వరకు ఉంది. స్టీల్ ఉత్పత్తిలో మాంగనీస్ చాలా కీలకంగా పనిచేస్తుంది.

మాంగనీస్ లేనిదే స్టీల్ ఉత్పత్తి కాదు. అటువంటి ఎంతో విలువైన మాంగనీస్ మైన్ ను సత్తిబాబు కుటుంబం 2022 అక్టోబర్ నుంచి కబ్జా చేసి ఇష్టానురీతిలో దోచుకుంటోంది. ఈ మాంగనీస్ దోపిడీ లెక్కలు తేల్చడానికే జగన్ రెడ్డి విజయనగరం వెళ్లారు. 2022 అక్టోబర్ లో మాంగనీస్ మైన్ లీజు గడువు ముగుస్తోందని, రెన్యువల్ చేయండని వైజాగ్ స్టీల్ యాజమాన్యం 12 లేఖలు రాసిన జగన్ రెడ్డి పట్టించుకోలేదు. లీజు గడువు ముగియక ముందే 2022 లో ఏప్రిల్ 04న, ఆగష్టు 09న, సెప్టెంబర్ 20న మూడు లేఖలు రాశారు.

2023 మార్చిలో, మే 10న, జూలై 10న, ఆగష్టు, సెప్టెంబర్, డిసెంబర్ లో, 2024 ఫిబ్రవరిలో సైతం..ఇలా 12 లేఖలు రాశారు. మాంగనీస్ మైన్ గడువు ముగియడంతో వైజాగ్ స్టీల్ బహిరంగ మార్కెట్‌లో మాంగనీస్ టన్ను రూ.14-15 వేలు పెట్టి కొనాల్సి వస్తోందని లేఖల్లో పేర్కొన్నారు. అయినా, పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సత్తిబాబులు విశాఖ స్టీల్ కు మాంగనీస్ మైన్ లీజును పొడిగించకుండా తొక్కిపెట్టారు. దోచుకోవాలనే ఉద్దేశంతోనే జగన్ రెడ్డి దీనిపై స్పందించ లేదు. లీజు కాలపరిమితి ముగుస్తున్నా ఎందుకు రెన్యువల్ చేయలేదు? ఇది మీ దోపిడీ కోసం కాదా? మాంగనీస్ లో ఎంత మిగిలింది? ఎన్ని టన్నులు తవ్వారు, వైజాగ్ స్టీల్ ప్లాంటును మోసం చేసి దానికి సున్నం ఎలా కొట్టారు..అనే లెక్కలు తేల్చుకోవడానికే జగన్ రెడ్డి విజయనగరం వెళ్లారు.

గతంలో ఎవ్వరూ, ఎన్నడూ ఇంత దుర్మార్గంగా వ్యవహరించ లేదు. స్టీల్ ఉత్పత్తిలో చాలా కీలకంగా ఉపయోగపడే సిలికా కోసం చంపావతి నదిపై ఉన్న సరిపల్లి సాండ్ రీచ్ ను కూడా వైజాగ్ స్టీల్ కు గత ప్రభుత్వాలు లీజు మంజూరు చేశాయి. ఈ శాండ్ రీచ్ గడువు సైతం ఏప్రిల్, 2023తో ముగుస్తోంది.. గడువు పునరుద్ధరించాలని వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అక్టోబర్ 2022 లోనే జగన్ సర్కార్ కు లేఖలు రాశారు.

ఇటీవల ఫిబ్రవరి 9 న రాసిన లేఖతో పాటు దాదాపు 4 లేఖలు రాసారు. అయినా జగన్ రెడ్డి ప్రభుత్వం రెన్యువల్ చేయకుండా సరిపల్లి శాండ్ రీచ్ లోని ఇసుకను దిగమింగుతున్నారు. విజయనగరం జిల్లాలోని శాండ్ రీచ్ లను కబ్జా చేయడమే కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేటాయించిన శాండ్ రీచ్ ను కూడా వీరి అవినీతితో దోచుకుంటున్నారు. సరిపల్లి శాండ్ రీచ్ అవినీతి లెక్కలు సెటిల్ చేయడానికే జగన్ రెడ్డి విజయనగరం వెళ్లారా?

జగన్ రెడ్డి, ఆయన ముఠా చేస్తున్న దోపిడీ గురించి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అసలే కష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు మాంగనీస్, ఇసుక లేకుండా చేస్తారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను చంపేసి మీ బందిపోటు ముఠా సభ్యుడు సత్తిబాబుకు దోచిపెట్టడానికి ఇంత ఘోరానికి ఒడిగడుతారా? స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్ బొలిశెట్టి రంగనాధ్ రాసిన లేఖలు చించి చెత్తబుట్టలో వేస్తారా? దీనికి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వారు రాసిన లేఖలపై జగన్ రెడ్డి స్పందించాలి. ఏదో ఒక రకంగా వైజాగ్ స్టీల్ ప్లాంటును చంపేసి స్టీల్ ప్లాంట్ భూములను కబ్జా చేయాలనేదే జగన్ రెడ్డి పథకం. ఉత్తరాంధ్రలో ఏ పరిశ్రమ ఉండరాదని అక్కడ నుంచి లులూ లాంటి అనేక పరిశ్రమలను తరిమేశారు.

రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాలి. ఐదేళ్లలో జగన్ రెడ్డి ఉత్తరాంధ్రకు చేసింది ఏమీ లేదు. ఉత్తరాంధ్రలో బొత్స కుంటుంబం ఒక బంధిపోటు ముఠాలా తయారైంది. విశాఖపట్నం ఎంపీగా బొత్స కుటుంబం నుంచి పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ గారికి ఎందుకు ఓట్లేయాలి?. విశాఖ స్టీల్‌కు చెందాల్సిన మాంగనీస్, ఇసుక లను బొత్స కుటుంబం దోచుకుని కోట్లు దండుకున్నందుకు ఓట్లు వేయాలా?. విజయనగరం జిల్లాను దోచుకుని తాడేపల్లి ప్యాలెస్‌కు పెద్ద ఎత్తున కప్పం కడుతున్నందుకు వేయాలా?

ఉత్తరాంధ్రను ఇష్టానుసారం దోచుకుని జగన్ రెడ్డికి కప్పం చెల్లిస్తున్నందుకే బొత్స కుటుంబంలో అందరికీ సీట్లు దక్కాయి. సత్తిబాబు, ఆయన సతీమణి, తమ్ముడికి, మేనల్లుడికి..ఇలా ఫ్యామిలీ ఫ్యాకేజీ మాదిరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి టికెట్లు ఇచ్చాడు జగన్ రెడ్డి. బొత్స కుటుంబ సభ్యులకు ఓట్లేసి గెలిపిస్తే ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్తులను దోచిన బొత్స కుటుంబం రాబోయే రోజుల్లో ప్రైవేటు ఆస్తులను కూడా దోచేస్తారు. బొత్స కుటంబ సభ్యులను ఎన్నికల్లో గెలిపిస్తే విజయనగరం ప్రజల ఆస్తులను తాడేపల్లి ప్యాలెస్ దోపిడీదారుడి పేరు మీద బదలాయించేస్తారు.

కాబట్టి ప్రజలు ఈ వాస్తవాలను అర్ధం చేసుకోవాలి. ఉత్తరాంధ్రలో వనరులన్నింటినీ జగన్ రెడ్డి ముఠా దోపిడీ చేసి, పెట్టుబడులను తరిమేసి గంజాయికి, డ్రగ్స్ కు ఒక అడ్డగా మార్చేశారు. తిరిగి ఉత్తరాంధ్ర బాగుపడాలన్నా, ఇక్కడికి పరిశ్రమలు రావాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కాలన్నా నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి.

LEAVE A RESPONSE