Home » బొత్స రాజీనామా?

బొత్స రాజీనామా?

– మీదంతా విధ్వంస ధోరణి
– మా రాజకీయభవిష్యత్తు కూడా ప్రశ్నార్ధకం
– ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగింది
– సహచరులతో మీ ప్రవర్తనతో భయపడ్డా
– అందుకే మనం ఓడిపోతున్నాం
– లేఖలో విరుచుకుపడ్డ బొత్స
– ఓటమి ముందే గ్రహించారా?
-సోషల్‌మీడియాలో రాజీనామా లేఖ వైరల్
– ఉత్తిదేనంటున్న బొత్స అనుచరులు

విజయవాడ: వైఎస్ జగన్ మంత్రివర్గంలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తన పార్టీకి రాజీనామా చేశారా? ఫలితాలు ఇంకా వెలువడకముందే ఆయన రాజీనామాకు కారణం ఏమిటి? అంటే సత్తిబాబు వైసీపీ ఓటమిని ముందే పసిగట్టారా?.. ఇవీ ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్. దానికి తగినట్లుగానే, ఆయన సంతకంతో వెలువడిన రాజీనామా లేఖ కూడా సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోషల్‌మీడియా వార్తలలో ఏది నిజమో, ఏది అబద్ధమో బాధితులు నోరు విప్పేదాకా నమ్మలేని రోజులివి. విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీకి రాజీనామా చేశారట. ఆ మేరకు ఆయన సంతకంతో వెలువడిన లేఖ ఒకటి, సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. జూన్ 9న జగన్ సీఎంగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, స్వయంగా బొత్స వారం రోజుల క్రితమే సగర్వంగా ప్రకటించారు.

అలాంటి బొత్స హటాత్తుగా పార్టీకి ఎందుకు రాజీనామా చేశారో అర్ధంకాక వైసీపీ వర్గాలు ఆందోళన చెందాయి. జగన్ పక్షాన విపక్షాలపై ఎదురుదాడి చేయడంలో.. ముందువరసలో ఉండే సత్తిబాబు, ఉన్నట్టుండి పార్టీకి రాజీనామా ఎందుకు చేశారో పార్టీ వర్గాలకు అర్ధం కాలేదు. జిల్లాలో ఆయన బంధువులందరికీ సీట్లు కూడా ఇప్పించుకున్న తర్వాత కూడా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్న చర్చ అటు విజయనగరం జిల్లాలోనూ మొదలయిందట.

ఇంతకూ బొత్స రాజీనామ లేఖలో ఏముందటే.. ‘‘దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగారి వారసుడిగా ఆయన బాటలో నడుస్తూ, రాష్ట్రాభివృద్ధి చేస్తారని ఆశించాం. కానీ మా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా మీ అనాలోచిత నిర్ణయాలు, కక్షపూరిత ధోరణి వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. మా ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం జరిగింది. మీరు తీసుకుంటున్న నిర్ణయాలు తప్పని చెబుతున్న మన సహచర ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో మీరు ప్రవర్తించిన తీరు నన్ను భయభ్రాంతులకు గురిచేశాయి. మీ ఐదేళ్ల విధ్వంస పాలన వల్ల ప్రజలు మన పార్టీకి దూరం జరిగారు. అందువల్లే ఘోర ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీవల్ల రాష్ట్ర భవిష్యత్తు మాత్రమే కాకుండా, మా రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్ధకంగా మారింది. అందుకే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా. ఈ సందర్భంగా నాకు మీరు పార్టీలో అందచేసిన సహకారానికి నా ధన్యావాదాలు తెలియచేస్తున్నా.’’

దీనిపై సోషల్‌మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది
బహుశా వైసీపీ ఓడిపోతుందని ముందే పసిగట్టిన బొత్స, పార్టీకి రాజీనామా చేసి ఉంటారని కొందరు.. టీడీపీ అధికారంలోకి వస్తే లేనిపోని ఇబ్బందులు ఎందుకన్న ముందుచూపుతోనే రాజీనామా చేసి ఉంటారని ఇంకొందరు, సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇదంతా ప్రత్యర్ధుల ఫేక్ ప్రచారమేనని, మళ్లీ అధికారంలోకి రాబోతున్న జగన్ ప్రభుత్వంలో నెంబర్‌టూగా ఉండబోతున్న బొత్స, ఎందుకు రాజీనామా చేస్తారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా బొత్స రాజీనామా వార్త, వైసీపీ వర్గాలను కలవర పరిచింది.

Leave a Reply