Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వం నడపడం పెద్ద టాస్కే

-కానీ నడిపించగలిగే నాయకుడు ఉండడమే మన అదృష్టం
-జగన్మోహన్ రెడ్డి పోవడమే ఈ రాష్ట్రానికి పెద్ద పరిష్కారం
-బంగారం లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు
-అమరావతిని పునర్ నిర్మించాలి… పోలవరాన్ని స్టార్ట్ చేయాలి
-క్షణం తీరిక తీసుకునే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు
-ఆదితి గజపతిరాజు, విష్ణుకుమార్ రాజు, ధర్మరాజు, నేను అసెంబ్లీలో అడుగు పెడతాం
-నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు

బంగారం లాంటి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కుక్కలు చింపిన విస్తరి చేశాడని, రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని నడపడం అన్నది నల్లేరు మీద నడక కాదని… ముళ్ళబాటపై ప్రయాణమేనని నరసాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు అన్నారు. కానీ క్లిష్ట పరిస్థితుల్లోనూ సమర్ధవంతంగా ప్రభుత్వాన్ని నడిపించగలిగే నాయకుడు ఉండడమే మన అదృష్టమని తెలిపారు . కచ్చితంగా రాబోయే రోజులన్నీ మంచి రోజులేనని ధైర్యంగా చెప్పగలనని పేర్కొన్నారు .

విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, కూటమి అసెంబ్లీ అభ్యర్థులు ఆదితి గజపతిరాజు, విష్ణుకుమార్ రాజు, ధర్మరాజులతో కలిసి రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఈ ముఖ్యమంత్రి పోవడమే రాష్ట్రానికి పెద్ద పరిష్కారం అన్నారు. రాష్ట్రంలో పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయన్న ఆయన ఏకకాలంలో అమరావతిని పునర్ నిర్మించాలని, పోలవరం పనులను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలన్నారు.

గత ఐదేళ్లలో పోలవరం పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి అన్నది వాయువేగంతో జరగాలని, క్షణం తీరిక తీసుకొని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు కాదని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ఆయన టీం తోనే వాయువేగంతో అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించారని గుర్తు చేసిన రఘురామ కృష్ణంరాజు, అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయం తోనే ఆయన వాటిని అమలు చేయనున్నారని తెలిపారు.

పెద్ద మెజారిటీతో కూటమి విజయం ఖాయం
రాష్ట్రంలో పెద్ద మెజారిటీతో కూటమి విజయం సాధించడం ఖాయమని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కూటమికి 125 స్థానాలకు తక్కువ కాకుండా వస్తాయన్న ఆయన, పోలింగ్ సరళిని పరిశీలిస్తే 125 స్థానాలకు పైగానే గెలిచే అవకాశం ఉందన్నారు. కూటమికి 125 స్థానాలకు పైగానే వస్తాయని వైకాపా నేతలే పందాలు కాస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి భస్మాసురుడి వంటి వాడని అతడి నెత్తిపై అతడే చేయి పెట్టుకున్నాడని ఒక ప్రశ్నకు సమాధానంగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి మాయమాటలను విశ్వసించి ప్రజలు ఎంతో భారీ మెజారిటీతో ఆయన్ని గెలిపిస్తే, చేజేతులా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తాడని కానీ అసెంబ్లీకి మాత్రం రాడని చెప్పారు. ఈ మాటలు వింటే ఒక పూట వస్తారేమో కానీ అసెంబ్లీ సమావేశాలలో మాత్రం జగన్మోహన్ రెడ్డి పాల్గొనరని రఘురామకృష్ణం రాజు తేల్చి చెప్పారు . జగన్మోహన్ రెడ్డి ఎన్నో దారుణాలు, అన్యాయాలను చేశారని మండిపడ్డారు.

పైడితల్లి అమ్మవారు, అతిధి గజపతి రాజు విజయనగరానికి రప్పించారు
పైడితల్లి అమ్మవారు, అతిధి గజపతిరాజు నన్ను విజయనగరానికి రప్పించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. గత రెండు సంవత్సరాల క్రితం పైడితల్లి అమ్మవారిని దర్శించుకొమ్మని ఒక సిద్ధాంతి సూచించారని, కానీ నాకు అమెరికాకు వెళ్లడానికి వీసా ఉన్నప్పటికీ… ఒక ఎంపీగా విజయనగరం రావడానికి మాత్రం వీసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైడితల్లి అమ్మవారు మీ కుల దైవమని వెళ్లి దర్శించుకోవాలని సిద్ధాంతి సూచించిన తర్వాత అప్పటినుంచి అమ్మ వారిని దర్శించుకోవాలని ఎదురు చూశానని తెలిపారు .

ఇప్పటికీ అమ్మవారి దయవల్ల కుదిరిందన్నారు. ప్రతి మూడవ మంగళవారం తన పేరిట గోత్రనామాలతో ఎన్నో నెలలుగా అమ్మవారి సన్నిధిలో పూజలు జరుగుతున్నాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. విజయనగరం వచ్చి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ను కలుసుకోవడం మర్చిపోలేని సంఘటన అని పేర్కొన్నారు. విజయనగరం అంటే నాకు ఎంతో ఇష్టమని, గాయకులు ఘంటసాల, సుశీల తో పాటు కళలు, సంగీతమన్న ఇష్టమేనని అన్నారు . విశాఖపట్నంలో ఆరేళ్లపాటు బీఫార్మసీ, ఎం ఫార్మసీ చదివానని కానీ విజయనగరం రాలేకపోయానని తెలిపారు .

వేలకు వేల ఎకరాలు గుప్త దానాలు చేసిన కుటుంబం
రాష్ట్ర చరిత్రలోనే వేలకు వేల ఎకరాలను గుప్త దానం చేసిన చరిత్ర గజపతి రాజుల కుటుంబానిదని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. అంతటి దానాలు చేసిన కుటుంబంపై కూడా జగన్మోహన్ రెడ్డి కక్షతో వ్యవహరించారని, ఎంతోమంది గొప్ప వారిని అవమానించారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఢిల్లీతో సత్సంబంధాలు ఎంతో అవసరమని పేర్కొన్న ఆయన, ఒక క్రైసెస్ ను అవకాశంగా మలుచుకున్నానని తెలిపారు.

ఢిల్లీ పెద్దలకు సత్ సంబంధాలు ఉన్నప్పటికీ, పార్లమెంటు టికెట్ ఎందుకు రాలేదని ప్రశ్నించవద్దన్న రఘురామకృష్ణంరాజు, దాని వెనుక సవాలక్ష కారణాలు ఉన్నాయని తెలిపారు. గత నాలుగు ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యల వల్ల ఢిల్లీ కే పరిమితమైన నేను, సొంత నానమ్మ చనిపోతే రాలేకపోయానని, ఆమె సంవత్సరీకానికి కూడా హాజరు కాలేదని గుర్తు చేశారు. పోలీసుల ద్వారా నన్ను చంపించాలని జగన్మోహన్ రెడ్డి చూశారని, ఆ కేసుల నుంచి సుప్రీం కోర్టు ద్వారా నాకు బెయిల్ వచ్చి సరిగ్గా నేటికి మూడేళ్లని తెలిపారు.

ఈ విషయాన్ని మా న్యాయవాది గుర్తు చేశారని పేర్కొన్నారు. 2021 మే 14వ తేదీకి ముందు జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావాలని కోరుకున్నానని, నాపై అన్యాయంగా కేసులు నమోదు చేసి, పోలీసుల ద్వారా హతమార్చాలని చూశాక జగన్మోహన్ రెడ్డిని మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మే 14 వ తేదీ నా జన్మదినోత్సవం రోజు నన్ను చంపేస్తారని అనుకున్నాను. ఒక పెద్ద తాడు తీశారని దాన్ని నా మెడకు బిగిస్తారని భావించాను.

కానీ నా కాళ్లు కట్టేసి ముసుగు ధరించిన పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. అప్పుడే నేను మంగమ్మ శపథం వంటి శపథం చేశాను. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నా శపథాన్ని నెరవేర్చారు. జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాదని తెలిసి మార్చాలని నేను ఒక్కడినే కాదు ఎంతోమంది కోరుకున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు .

విశాఖకు రాజధాని రాకపోవడం పెద్ద రిలీఫ్
విశాఖపట్నానికి రాజధాని రాకపోవడం ఈ ప్రాంత ప్రజలకు పెద్ద రిలీఫ్ అని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉండిందన్నారు. విశాఖకు రాజధాని అవసరం లేదన్న ఆయన ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఊపిరి తీసుకుంటున్నారన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించాలని నిర్ణయించుకున్నందుకు అక్కడి ప్రజలు, విశాఖపట్నం రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినందుకు ఇక్కడి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పారన్నారు.

ఈ రెండు ప్రాంతాలలో వైకాపాకు శృంగభంగం తప్పదని, రాయలసీమ ప్రాంతంలో కొన్ని సీట్లు వస్తాయన్నారు. గొర్రె కసాయి వాడినే నమ్ముతుందన్నట్లుగా అక్కడి ప్రజలు వ్యవహరించారన్నారు . రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని, ఈనెల 14వ తేదీన వైకాపా మరణించిందన్న రఘురామ కృష్ణంరాజు, జూన్ 4వ తేదీన ఆ పార్టీకి పెద్దకర్మ నిర్వహించడం జరుగుతుందనడం లో ఎటువంటి సందేహం లేదన్నారు.

మితభాషి అశోక్ గజపతిరాజు
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మిత భాషి అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎన్ని వేధింపులకు గురిచేసిన ఇతరులకు చెప్పుకునే వారు కాదన్నారు. ఒకసారి నేను ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి ఆగడాలను న్యాయస్థానం దృష్టి తీసుకువెళ్దామని చెప్పిన ఆయన ఓపికతో వ్యవహరించారన్నారు. విజయనగర ప్రజలను, మాన్సాన్ ట్రస్టును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ప్రత్యేకించి విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా ఎన్నో తప్పుడు పనులకు పాల్పడ్డారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

భగవంతుడు ఉన్నారని మంచి వాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇంకా 13 రోజులు తరువాత, ఈ ప్రభుత్వం ఇంటికి పోక తప్పదు అన్నారు. అతిధి గజపతిరాజు, విష్ణుకుమార్ రాజు, ఉంగుటూరు జనసేన అభ్యర్థి ధర్మరాజు, నేను అసెంబ్లీలో అడుగు పెడతామని రఘురామ కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు

LEAVE A RESPONSE