ఐటీ దాడుల్లో పట్టుబడుతున్న ధనం ఏపీ మంత్రులదవటం సిగ్గుచేటు

Spread the love

– మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు

ఐటీ దాడుల్లో పట్టుబడుతున్న ధనం ఏపీ మంత్రులదవటం సిగ్గుచేటని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు .. దేశంలో ఎక్కడ ఐటీ దాడులు జరుగుతున్నా పట్టుబడుతున్న డబ్బు కు మూలాలు ఆంధ్రప్రదేశ్ మంత్రులని, ఏపీ మంత్రుల భాగస్వామ్యం ఉందని తేటతెల్లమవుతోంది. హైదరాబాద్ లో ఐటీ దాడుల్లో పట్టుబడ్డ వంద కోట్లు ఏపీలోని గుడివాడకు సంబంధించిన పౌర సరఫరా శాఖ మంత్రి కొడాలి నానీదని అందరూ చెబుతున్నారు.

పౌరులు ఆందోళనతో ఉంటే పౌర శాఖ మంత్రి ఆనందంగా ఉన్నారు. వారి బతుకులు మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. బినామీ పేర్లతో వందల కోట్లు సంపాదించుకున్నారు. ఎక్కడ చూసినా ఏపీ

మంత్రుల అక్రమ సంపాదన భాగోతాలే. ఇటీవల ఓ మంత్రి చెన్నైలో పట్టుబడితే.. ఇప్పుడేమో కొడాలి నానీ హైదరాబాద్ లో పట్టుబడ్డారు. వీరంతా ఏపీలోని వనరులను నిర్వీర్యం చేస్తున్నారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా ద్వారా అక్రమ సంపాదనకు ఒడిగడుతున్నారు.

రాష్ట్రంలోని డబ్బు ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. ఏపీ ప్రజల బతుకులు వెలవెలబోతున్నాయి. వారికి పనులు లేవు, వ్యాపారాలు లేవు, వ్యవసాయం కుంటుపడింది. ప్రజల జీవితాలే స్తంభించాయి . రైతులు పండించిన ధాన్యంకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడంలేదు. వారు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడంలేదు. రైతుల బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదు.

పౌర సరఫరా శాఖ మంత్రి ఆ విషయాలేమీ మాట్లాడరు. జవాబుదారీగా సమాధానం చెప్పరు. కొడాలి నానీ బూతుల మంత్రి అనే పేరును సార్థకం చేసుకున్నారు. ఎంతసేపు అవతలవారిని బెదిరించాలనే ధోరణి తప్ప వేరే లేదు. ఎదుటివాడి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారు. షామీర్ పేటలో యేడాది క్రితం 110 ఎకరాల్లో ఒక రియల్ ఎస్టేట్ కు సంబంధించిన కంపెనీ పెట్టారు. మన మంత్రి అందులో పెట్టుబడులు పెట్టినట్లుగా రుజువైంది.

ఏపీలో ప్రజలకు జీవనాధారం లేదు, ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి భద్రత కరువైంది. మంత్రులేమో కళకళలాడుతూ విందులు, వినోదాలలో మునిగితేలుతున్నారు. ఇక సంపాదించుకోవడానికి అవకాశం లేదు, ఈ ఒక్కసారే అనే ఆలోచనలో మంత్రులు ఉన్నారు. పోలీసుల వేధింపులు కూడా అధికమయ్యాయి. వన్ టైమ్ సెటిల్ మెంట్ అని ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ప్రభుత్వానికి హితవు పలికారు.

Leave a Reply