కియా నాలెడ్జ్ ఎక్స్ లెన్స్ సెంటర్ ను ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

-ఆర్థిక మంత్రి సమక్షంలో కియా పరిశ్రమతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
-రూ.2 కోట్లతో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఏర్పాటైన ‘ఎక్స్ లెన్స్ సెంటర్’
-ఏపీఎస్ఎస్ డీసీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉచిత ‘సమ్మర్ ఇంటర్నషిప్ కోర్స్’ పోస్టర్ ఆవిష్కరణ
-ఐటీఐ, పాలిటెక్నిక్, నైపుణ్యాలకు ఏపీని చిరునామాగా తీర్చిదిద్దుతాం
-నైపుణ్యంతోనే ‘సీమ’ వెనకబాటును అధిగమించడం సాధ్యం

డోన్,మే,29; ఆర్థిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి “కియా నాలెడ్జ్ ఎక్స్ లెన్స్ సెంటర్” ను లాంఛనంగా ప్రారంభించారు.యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా డోన్ పట్టణంలోని ఐటీఐ కళాశాలలో రూ.2 కోట్లతో ‘ఎక్స్ లెన్స్ సెంటర్’ను ఏర్పాటు చేసినట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఏర్పాటైన ఈ సెంటర్ లో 10 కోర్సులలో వందలాది మంది యువతకు శిక్షణనందించే వీలుగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.

జ్యోతి ప్రజ్వలన అనంతరం కియా నాలెడ్జ్ ఎక్స్ లెన్స్ సెంటర్ భవనంలోని పైలాన్ ను సోమవారం ఆవిష్కరించారు. కొత్త భవనంలో ఏర్పాటు చేసిన ఆటోమొబైల్, మెకానికల్, వెల్డింగ్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, సివిల్ , సీఎన్ సీ , డైకిన్ ల్యాబ్ లను రిబ్బన్ కట్ చేసి ఆర్థిక మంత్రి సమక్షంలో అతిథులు శ్రీకారం చుట్టారు.ఏడాది గడువుతో 2 కోర్సులు, రెండేళ్ల వ్యవధితో 8 కోర్సుల్లో శిక్షణకు అనువుగా ఎక్స్ లెన్స్ సెంటర్ ని అందుబాటులోకి తెచ్చామన్నారు.ఇప్పటికే కియా నాలెడ్జ్ ఎక్స్ లెన్స్ సెంటర్ లో 484 మంది యువతీయువకులకు శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.

నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్ సీవీటీ) అనుబంధ కోర్సులకు ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు.ఎలక్ట్రిషియన్, వైర్ మెన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీఎం సివిల్, మెకానికల్ మోటార్ వెహికిల్, మెకానిక్ డీజిల్, వెల్డర్ రంగాల్లో యువతకు ఉపాధి, శిక్షణనందించేలా ఎక్స్ లెన్స్ సెంటర్ పని చేస్తుందన్నారు. ఆర్థిక, నైపుణ్య శిక్షణ శాఖ మంత్రి సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్, ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య, కియా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్ డాంగ్ లీ వేదికపై పత్రాలను పరస్పరం మార్చుకున్నారు.

యువతకు శిక్షణ నందించే దిశగా కియా పరిశ్రమతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. శిక్షణ తీసుకునే 300 మంది యువతకి హాస్టల్ వసతికి సంబంధించి రూ.5.5 కోట్లతో భవన నిర్మాణం చేపడుతున్నామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఐటీఐ, పాలిటెక్నిక్, నైపుణ్యాలకు ఏపీని చిరునామాగా మార్చే ప్రణాళికతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.

‘స్కిల్ గ్యాప్’ను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు, ప్రణాళికతో ముందుకు వెళుతోందన్నారు. డోన్ నియోజకవర్గంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్, ఐడీటీఆర్ (ఇంటిగ్రేటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ రీసెర్చ్ సంస్థ), ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్, మహిళలకు ప్రత్యేకంగా కళాశాల, హార్టికల్చర్ యూనిట్,బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కం కాలేజ్ (బాలురకు), పాలిటెక్నిక్ కాలేజ్, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వంటి ఎన్నో మౌలిక సదుపాయాల ఏర్పాటుతో అభివృద్ధికి సాక్ష్యంగా డోన్ నిలిచిందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.

నైపుణ్య విద్య వల్లే వెనకబాటును అధిగమించడం సాధ్యమన్నారు.రాయలసీమ వెనకబడిన ప్రాంతం..అందుకే సీమ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.నైపుణ్యం లేని విద్యనభ్యసించే వారు ఏటికేడు ఎక్కువగా ఉండడం వలనే నిరుద్యోగం పెరుగుతుందన్నారు. ఆలోచనకు, ఆచరణకు మధ్య అంతరం లేకుండా చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ధ్యేయమన్నారు.షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్ ఉన్న ఏకైక ప్రాంతం డోన్ నియోజకవర్గమని మంత్రి తెలిపారు.కియా నాలెడ్జ్ ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి బుగ్గన కృతజ్ఞతాభినందనలు తెలిపారు.

ఆర్థిక మంత్రి ప్రత్యేక చొరవతో డోన్ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఎక్కడా లేని అభివృద్ధికి నోచుకుంటోందని రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు తెలిపారు. ఎప్పుడూ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తరతరాలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలను మంత్రి బుగ్గన ఏర్పాటు చేశారన్నారు. డోన్ నియోజకవర్గం మంత్రి బుగ్గన వంటి చదువుకున్న వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకుని అదృష్టం చేసుకుందని డోన్ ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గతంలో డోన్ లో ఎమ్మెల్యేగా ఉన్న నాయకులంతా వ్యక్తిగత స్వార్థంతో నాకేం వస్తుందని పని చేశారని, కానీ, మంత్రి బుగ్గన ప్రజలకేం చేయగలననే తపనతో ఎన్నో ప్రకటించని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు.

సూక్ష్మమైన విషయాలను సైతం లోతుగా పరిశీలించి, పరిశోధించే వ్యక్తిగా ఆర్థిక మంత్రి బుగ్గన ప్రత్యేకంగా నిలుస్తున్నారని నంద్యాల జిల్లా కలెక్టర్ మనజిర్ జిలానీ తెలిపారు. ఇలాంటి యువతకు ఉపయోగపడే మరిన్న ఎక్స్ లెన్స్ సెంటర్లు జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ఉపాధి, శిక్షణ దిశగా మంత్రి బుగ్గన ఆలోచనలు దార్శనికంగా ఉంటాయని ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య పేర్కొన్నారు. దార్శినిక ఆలోచనలున్న నైపుణ్య శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నాయకత్వంలో మరిన్ని నైపుణ్య, శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్ కుమార్ అన్నారు. యువతకు అవసరమయ్యే అప్రెంటిషిప్, ఇంటర్న్ షిప్ కార్యక్రమాలు మరిన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, డోన్ ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, డోన్ మున్సిపల్ ఛైర్మన్ రాజేష్,నంద్యాల జిల్లా కలెక్టర్ మనజిర్ జిలానీ సమూన్,ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్ కుమార్, ఏపీ సీడ్యాప్ సీఈవో శ్రీనివాసులు, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ నవ్య, డోన్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బద్రీనాథ్, ఎంఆర్ఓ విద్యాసాగర్ కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ తై జిన్ పార్క్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్ డాంగ్ లీ, లీగల్ కార్పొరేట్ ఎఫైర్స్ హెడ్ యోంగీ మ, ప్రిన్సిపల్ అడ్వైజర్ సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply