– దళితమంత్రి అడ్డూరినుద్దేశించి దున్నపోతంటూ మంత్రి పొన్నం వ్యాఖ్య
– వివేక్ చెవిలో చెప్పిన ఆ మాటలు మైకు ద్వారా వినిపించి సోషల్‌మీడియాలో వైరల్
– పొన్నం తనకు క్షమాపణ చెప్పాలన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్
– సహచర మంత్రి వివేక్ కూడా అవమానించారని ఆవేదన
– పొన్నం వ్యాఖ్యలపై భగ్గుమన్న మాదిగ సంఘాలు
– ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్
– రంగంలోకి దిగిన టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్
– కలసి పనిచేసుకోవాలని మహేష్ హితవు
– ఢిల్లీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న మంత్రి లక్ష్మణ్
– ఇప్పటికే ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు
– పొన్నం ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు
– ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌లో ‘కుల’కలం
( మార్తి సుబ్రహ్మణ్యం)
కాంగ్రెస్‌కు కాంగ్రెస్సే శత్రువు అన్న సామెత మరోసారి నిజమవుతోంది. కీలకమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల సమయంలో కాంగ్రెస్‌కు ఇంటిపోరు తీవ్రమవుతోంది. దళితమంత్రిని ఉద్దేశించి సహచర మంత్రి చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారం రేపుతోంది. ఈ ‘దున్నపోతు దుమారం’ చివరకు ఎక్కడికి దారితీస్తాయన్న ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో మొదలయింది.
మొన్నటికి మొన్న.. బీహారీలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏఐసిసి ఇన్చార్జి కన్హయ్యకుమార్ శివాలెత్తి, ‘‘రేవంత్ తన పార్టీ వాడయినప్పటికీ ఆయనొక బుద్ధిలేని-తెలివిలేని నాయకుడ’’ంటూ విరుచుకుపడ్డారు.
అంతకుముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. బీహారీలపై రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘‘వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని దగ్గరుండి ఓడిస్తా. ఆయనను మోదీ-రాహుల్ ఎలా కాపాడతారో చూస్తా’’నని శపథం చేశారు.
తాజాగా మాదిగ సామాజికవర్గానికి చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్నుద్దేశించి, సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ దున్నపోతంటూ చేసిన వ్యాఖ్య తెలంగాణ కాంగ్రెస్‌లో కులకలం రేపుతోంది.
తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న మాదిగ వర్గం మంత్రి పొన్నం వ్యాఖ్యలపై విరుచుకుపడుతోంది. తెలంగాణలో జనాభాపరంగా, మాదిగ సామాజికవర్గం ప్రభావమే ఎక్కువన్నది తెలిసిందే.
తక్షణం ఆయన మంత్రి లక్ష్మణ్‌కు క్షమాపణ చెప్పాలని కొందరు, పొన్నంను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని ఇంకొందరు మాదిగ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిని ఆత్మగౌరవ సమస్యగా భావిస్తున్న మాదిగ సంఘాలు కాంగ్రెస్ పనిపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వారి ప్రకటలు స్పష్టం చేస్తున్నాయి.
దీనితో సీఎం రేవంత్‌రెడ్డి సూచనల ప్రకారం రంగంలోకి దిగిన టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్.. మంత్రులిద్దరికీ ఫోన్లు చేసి, సంయమనం పాటించాలని, కలసి పనిచేసుకోవాలని కోరారు. అయితే మంత్రి లక్ష్మణ్ మాత్రం దిగివచ్చేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉన్న మీనాక్షీ నటరాజన్‌కు లేఖ రాసిన మంత్రి అడ్లూరి.. నేడో రేపో ఢిల్లీకి వెళ్లి పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
అటు మాదిగ వర్గ నేతలు కూడా దీనిని ప్రతిష్ఠగా తీసుకోవడంతో, .. ఈ్యవహారంలో చివరకు సీఎం రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగినా, కథ సుఖాంతమయ్యేలా కనిపించడం లేదు.
వేదికపై ఉన్న వారిలో మాల సామాజికవర్గానికి చెందిన మంత్రి వివేక్, బీసీ సామాజికవర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఉండటం.. వారిద్దరూ కలసి తమ వర్గానికి చెందిన మంత్రి అడ్లూరిని అవమానించారని, ముఖ్యంగా పొన్నం తమ మంత్రిని దున్నుపోతుతో పోల్చిన వైనమే.. మాదిగ జాతి రగిలిపోయేందుకు కారణంగా కనిపిస్తోంది.
కాగా కాంగ్రెస్‌లో ‘కుల’కలం రేగడం, అటు బీఆర్ఎస్- ఇటు బీజేపీకి రాజకీయంగా వరంలా పరిణమించింది. మంత్రి పొన్నం వ్యాఖ్యలు సొషల్మీడియాలో వైరల్ అయిన తర్వాత, ఆ రెండు పార్టీల్లోని దళిత నాయకులు రంగంలోకి దిగి.. అడ్లూరికి మద్దతు ప్రకటించడంతోపాటు, ఈ వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం, కాంగ్రెస్‌కు మరో ఇరకాట పరిణామం. ఈ వ్యవహారంలో ఎవరిమీద చర్యలు తీసుకున్నా, మరో వర్గం కాంగ్రెస్‌కు దూరంకాక తప్పని సంకట పరిస్థితి.
కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు జూబ్లిహిల్స్-స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపితే కొంప కొంపకొల్లేరవుతుందన్న ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణలో అధిక సంఖ్యలో ఉన్న మాదిగ సామాజికవర్గం ఇప్పటికే పొన్నం వ్యాఖ్యలతో రగిలిపోతోంది.
దీనికి సంబంధించి పొన్నం క్షమాపణ చెప్పాలంటూ, మాదిగ సంఘాలు నేడో రేపో రోడ్డు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్-బీజేపీ దళిత నేతలు కూడా రంగంలోకి దిగడంతో, వచ్చే ఎన్నికల్లో మాదిగల ఓట్లపై కాంగ్రెస్ ఆశలు వదులుకోక తప్పని పరిస్థితి.
ఇప్పటికే మాదిగ సామాజికవర్గంపై కాంగ్రెస్ చిన్నచూపు చూస్తోందన్న ఆగ్రహంతో ఉన్న ఆ వర్గంలో, తాజాగా మంత్రి అడ్లూరికి జరిగిన అవమానం పుండుమీద కారంలా పరిణమించింది.
అసలేం జరిగిందంటే..
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రెహమత్ నగర్లో ముగ్గురు మంత్రులు.. పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే మీడియా సమావేశానికి మంత్రి లక్ష్మణ్ ఆలస్యం అయ్యారు.
దీంతో పొన్నం అసహనానికి లోనై, పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో గుసగుసలాడారు. మనకు సమయం తెలుసు.జీవితం తెలుసు.కానీ వారికేం తెలుసు ఆ దున్నపోతుగానికి అంటూ మాట్లాడారు.
ఆ సమయంలో మైక్‌లు ఆన్‌లో ఉండటంతో ఆయన మాటలు బయటకు వినిపించాయి. దీంతో పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దళిత సంఘాల మండిపాటు
మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ దున్నపోతు అని వ్యాఖ్యానించారన్న విషయం సోషల్ మీడియా ద్వారా దళిత సంఘాలకు చేరడంతో దళిత సంఘాలన్నీ ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన సంఘాలు మండిపడుతున్నాయి.
దళితులపై చిన్న చూపు -వివక్ష ఇంకా కొనసాగుతూ ఉండడం తమను బాధిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలతో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. సహచర దళిత మంత్రిని దున్నపోతు అని ఎలా అంటారని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. సహచర మంత్రిని గౌరవించని పొన్నంను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
పొన్నం వ్యాఖ్యలు బాధించాయి: మంత్రి అడ్డూరి లక్ష్మణ్
మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై రేపటిలోగా క్షమాపణ చెప్పాలని, లేదంటే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యుడని మంత్రి లక్ష్మణ్ స్పష్టం చేశారు. పొన్నం వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని పేర్కొన్నారు.
పొన్నం ప్రభాకర్ లాగా అహంకారంగా మాట్లాడటం తనకురాదని తెలిపారు. ఈ వివాదాన్ని ఇప్పటికే పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కు లేఖ ద్వారా తెలిపిన లక్ష్మణ్.. ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు లేఖ రాస్తానని, త్వరలోనే రాహుల్, సోనియా గాంధీలను కలిసి వారి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
దళితులంటే అంత చిన్నచూపా అని ప్రశ్నించారు. మైనార్టీ సంక్షేమ కార్యక్రమంలో తాను పాల్గొ నేందుకు వస్తున్న సమయంలోనే మంత్రి వివేక్ తో మాట్లాడుతూ, పొన్నం చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. సహచర దళిత మంత్రిగా వివేక్ పొన్నం వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి, నేను వస్తే తాను వెళ్లిపోతానని అన్న మాటలు బాధకు గురిచేశాయని పేర్కొన్నారు.
మంత్రి వివేక్ కుమారుడు వంశీ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసినప్పుడు తాము ఎంతో సహకరించి గెలిపించామని ఆయన వివేక్ తండ్రి వెంకట స్వామి దగ్గర నుంచి, వంశీ వరకు పార్టీ కోసం వారి గెలుపు కోసం పనిచేశామని చెప్పారు. వివేక్ లాగా తమ వద్ద డబ్బు లేకపోయినా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
మంత్రి పొన్నం ఇప్పటి దాకా కనీసం ఫోన్లో కూడా తనతో మాట్లాడలేడని, పొరపాట్లు ఎవరైనా చేస్తారు కానీ దాన్ని సరిదిద్దుకునే విధంగా వ్యవ హారం ఉండాలని లక్ష్మణ్ అన్నారు. తనపై కామెంట్స్ చేయ లేదంటున్న పొన్నం ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారో చెప్పాలన్నారు.
తనపై వ్యక్తిగతంగా ఏమైనా అంటే బాధ లేదు కానీ, తన జాతిని అన్నట్లుగానే భావిస్తున్నానని చెప్పారు. ఈ ఘటన తనను ఎంతగానో బాధించిందన్నారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తనతో మాట్లాడారని, ఆయనతో జరిగిన సంభాషణే ఫైనల్ అని మంత్రి పొన్నం తెలిపారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనను అహంకారిగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. రహ్మత్ నగర్ సమావేశంలో చోటుచేసుకున్న విషయాలను పీసీసీ అధ్యక్షుడికి వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని స్పష్టం చేశారు. పార్టీ పరంగా మహేశ్ కుమార్ గౌడ్ ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని అన్నారు.
మీనాక్షితో భేటీ కోసమే మధ్యలో వెళ్లానన్న మంత్రి వివేక్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో సమావేశం ఉండటం వల్ల తాను మధ్యలో వెళ్లిపోవలసి వచ్చిందని మంత్రి వివేక్ తెలిపారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తన పక్క సీటులో కూర్చున్న సమయంలో తాను ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోవలసి వచ్చిందో మంత్రి వివేక్ వివరించారు.
మీనాక్షి నటరాజన్‌తో సమావేశం ఉండటం వల్లే తాను అక్కడి నుంచి లేచి వచ్చానని, ఈ విషయాన్ని పక్కన ఉన్న మంత్రులకు కూడా తెలియజేశానని అన్నారు. ఎవర్నీ విమర్శించాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి లక్ష్మణ్ తనపై ఎందుకు విమర్శలు చేశారో అర్థం కావడం లేదని అన్నారు. ఆయన మీద తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.
పొన్నం ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు
మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు దాఖలైంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
సహచర మంత్రి అన్న విజ్ఞత లేకుండా, ప్రజల్లో ఉన్నామనే ఆలోచన లేకుండా మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి లక్ష్మణ్‌ను దూషించడం సరికాదని, దీనిని తాము ఖండిస్తున్నామని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను తక్షణమో సుమోటోగా స్వీకరించి అట్రాసిటీ కేసు నమోదు చేయడంతోపాటు.. కమిషన్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లాలని వారు కోరారు.