Suryaa.co.in

Andhra Pradesh

వివేకా హత్య కేసులో సునీత ప్రశ్నలకు జగన్ సమాధానాలు చెప్పగలరా?

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

వివేకా హత్య కేసులో జగన్ రెడ్డి చెల్లెలు సునీతా రెడ్డి అడిగిన ప్రజలకు జగన్ రెడ్డి సమాధానాలు చెప్పగలరా? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జగన్ ను ప్రశ్నించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడిన మాటలు..

2019 మార్చి 14 అర్ధరాత్రి బాబాయి ని హత్య చేసిందెవరో జగన్ కు తెలుసు అని సునీత ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. చెల్లెలు సునీత ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం జగన్ కు ఉందా?. జగన్ కు ఓటెయ్యద్దు, ఘోరంగా ఓడించండి అని సునీత ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఇంతకంటే సిగ్గుమాలిన చర్య మరొకటి ఉంటుందా? గతంలో మేం వివేకా హత్య గురించి అనేక ప్రశ్నలడిగాం.. సమాధానం చెప్పలేదు.. ఇప్పుడు మీ చెల్లెలు సునీత గారికైనా సమాధానాలు చెప్పండి.

బాబాయి హంతకులు మీకు ముందే తెలుసని కుండ బద్దలు కొట్టినట్లు సునీతమ్మ చెప్పింది. గతంలో వివేకా హత్య కేసు సీబీఐ ఎంక్వయిరీ కావాలని గవర్నర్ ను అడిగింది మీరుకాదా? ప్రతిపక్ష నాయకుడిగా హైకోర్టు లో పిటిషన్ వేసి ముఖ్యమంత్రి అయ్యాక పిటిషన్ ఎందుకు వాపసు తీసుకున్నారు? సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి కాకముందు సీబీఐ ఎంక్వైరీ అన్నారు.. ఆ తరువాత మీరే పిటిషన్ వాపసు తీసుకోవడం దేనికి సంకేతం? ఎంక్వైరీ చేస్తున్న అధికారులను, అప్రూవర్ గా మారిన దస్తగిరిని మీరు బెదిరించలేదా?

వారిపై కేసులు బనాయించలేదా? అవినాష్ రెడ్డి పై అనుమానముందని సునీత చెబితే వదిలేయమని, ఆయన బీజేపీలోకి పోతాడని మీరు సునీత గారితో అనలేదా? జగనంటే నేనే.. నేనంటే జగన్ అనే సజ్జల ముఖంలో ఈరోజు జీవకళ పోయి ప్రేతకళ కనిపిస్తోంది..అందుకే ఇదంతా చంద్రబాబు కుట్ర అని తెలిపారు. మీ కేసుల నుండి బయట పడటానికి వివేకానందరెడ్డి కేసును సాగదీస్తున్నారని సునీత నిక్కచ్చిగా చెప్పింది. జగన్ కు నైతిక విలువలు ఉంటే.. ముఖ్యమంత్రిగా కొనసాగే నైతికత గురించి ఆలోచించాలి.

అసలు హంతకులు చట్టానికి చిక్కటం ముఖ్యమంత్రికి ఇష్టంలేదు. జగన్ లోని నైతికత, విశ్వసనీయత అన్నీ ఎక్కడికెళ్లాయని ప్రశ్నిస్తున్నాను. సునీత అడిగిన ప్రశ్నలకు జగన్ వెంటనే సమాధానాలు చెప్పాలి. లేకుంటే వివేకా హంతకులు ఎవరో ఆయనకు తెలిసినట్లే. తన తండ్రి హత్య కేసులో విస్తారమైన కుట్ర దాగి వుందని సునీత చెబుతున్నారు.

సీబీఐ ఈ కోణంలో దర్యాప్తు చేసి, జగన్ పాత్ర కూడా విచారణ చేయాలని సునీత కోరుతున్నారు. మా అన్నకు ఓటెయ్యద్దు.. ప్రజా జీవితంలో జగన్ కు చోటు లేదని రాష్ట్ర ప్రజలకు సునీతమ్మ విజ్ఞప్తి చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.

LEAVE A RESPONSE