న‌కిలీ ద‌ర్శ‌న టికెట్ల‌తో భ‌క్తుల‌ను మోసం చేసిన వారిపై కేసు

– డ్రైవ‌ర్లు మోసం చేస్తే వాహ‌నాలు, డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం : సివిఎస్వో

న‌కిలీ ద‌ర్శ‌న టికెట్ల‌తో భ‌క్తుల‌ను మోసం చేసిన ఆటోడ్రైవ‌ర్‌తోపాటు మ‌రొక‌రిపై తిరుమల విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదు మేర‌కు తిరుమల టు టౌన్‌ పోలీసులు కేసు న‌మోదు చేశారు.తిరుమ‌ల రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం కాంప్లెక్స్‌లోని స్కానింగ్ సెంటర్‌లో విజిలెన్స్ వింగ్ అధికారులు ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించ‌గా అనుమానాస్పదంగా ఉన్నపాండిచ్చేరికి చెందిన సి.సుబ్రమణియ‌న్, అత‌ని స్నేహితులను క‌లిపి ముగ్గురిని విచారించారు. తిరుప‌తిలో ఆటో డ్రైవర్ మౌన్ కుమార్, సౌంద‌ర్ క‌లిసి ద‌ర్శ‌న టికెట్లు ఇప్పిస్తామ‌ని చెప్పారని, ఇందుకోసం ఫోన్ పేలో రూ. 4 వేలు, మ‌రో రూ.4 వేలు న‌గ‌దు ఇచ్చామ‌ని భ‌క్తులు తెలిపారు. ఈ టికెట్ల‌తో ద‌ర్శ‌నానికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా న‌కిలీ టికెట్లుగా తేల‌డంతో మోస‌పోయామ‌ని గుర్తించామ‌న్నారు.బాధితుల ఫిర్యాదు మేర‌కు విజిలెన్స్ వింగ్ అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు తిరుమ‌ల టు టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో క్రైమ్ నంబరు. 13/ 2022 U/S 420 & 468 r/w 34 IPC కేసు న‌మోదు చేశారు.

మోసం చేస్తే వాహ‌నాలు, డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం : సివిఎస్వో
శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల‌ను ఆటో, ట్యాక్సీ డ్రైవ‌ర్లు న‌కిలీ ద‌ర్శ‌న టికెట్ల‌తో మోసం చేస్తే వారి వాహనాలను, డ్రైవింగ్ లైసెన్స్‌లను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తామని టిటిడి సివిఎస్వో గోపినాథ్ జెట్టి హెచ్చ‌రించారు. భ‌క్తులు ద‌ర్శ‌న టికెట్ల కోసం ఇలాంటి వారిని న‌మ్మి మోస‌పోకుండా, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరారు.

Leave a Reply