ధరల నియంత్రణలో కేంద్రం పూర్తిగా విఫలం

– సామాన్యుడి బతుకు గురించి కేంద్రానికి పట్టదా?
– పెట్రోలు, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి
– వంట గ్యాస్ ధరలు తగ్గించాలి
– జీఎస్టీ నుంచి టీటీడీ, దేవాలయాలను మినహాయించాలి
– లోక్ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్, ఎంపీలు వంగా గీత, జి. మాధవి, గురుమూర్తి

నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మండిపడ్డారు. ధరలు పెంపునకు కొవిడ్, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ఇతర కారణాలు చూపుతున్న కేంద్రం.. మరి, అంతకు మించి కష్టాలు ఎదుర్కొంటున్న సామాన్యుడు ఎలా బతకాలి అని మానవత్వంతో ఎందుకు ఆలోచించడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఒకవైపు పప్పు, ఉప్పులు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు అన్నీ సామాన్యుడికి అందనంతగా పెరిగిపోయినా.. మరోవైపు జీఎస్టీ పేరుతో మోయలేని ట్యాక్స్ లు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ధరలు నియంత్రించి, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సూచించారు.

లోక్ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. కరోనా, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ద్రవ్యోల్బణంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ధరల పెరుగుదల నియంత్రించే విషయంలో ఎక్కడ లోపాలు జరిగాయి? నిత్యావసర వస్తువుల ధరల ఆకాశాన్ని అంటుతుండటంతో సామాన్యుడు ఆర్థికంగా చితికిపోయాడు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంది. కంజ్యూమర్‌ ప్రైజ్ ఇండెక్స్‌ తీసుకుంటే మూడు శాతానికి అదుపు చేయగలిగాం. ఈ రెండేళ్లలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరగడంతో వాటి భారం అన్ని రంగాలపై పడింది. పామాయిల్‌ నుంచి వంటనూనెల ధరలు రెండింతలు పెరిగాయి. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అయింది. ఈ ఎనిమిదేళ్లలో ధరల నియంత్రణకు ఏరకమైన చర్యలు తీసుకున్నారు..?

దేశంలో దిగుమతులు చూస్తే గ్యాస్‌, క్రూడ్‌ ఆయిల్.. సుమారుగా 170 బిలియన్‌ డాలర్లు, అంటే 30 శాతం. అలానే, లోహాలకు సంబంధించి బంగారం, విలువైన వజ్రాలను 88 బిలియన్‌ డాలర్ల మేర, అంటే 17 శాతం దిగుమతులు చేసుకుంటున్నాం. దీనికి తగ్గట్టు జీడీపీ పెరగాల్సి ఉంటుంది. ఎగుమతులు, దిగుమతులు బ్యాలెన్స్‌గా ఉంటేనే రూపాయి విలువ పడిపోకుండా ఉంటుంది. డాలర్‌తో పోల్చితే మన రూపాయి విలువ 13.5 శాతం డీవ్యాల్యూ అయింది. ఇవన్నీ చూస్తుంటే ఎకానమీ అంతా వెనక్కి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మన ఎకానమీ.. 5ట్రిలియన్‌ డాలర్లు అవ్వాలని చెబుతున్నారు. కరోనా వచ్చిన తొలి ఏడాది మన దేశానికి 19లక్షల కోట్లు ఆదాయం రాలేదు. రెండో ఏడాది 17లక్షల కోట్లు రూపాయల ఆదాయానికి గండి పడింది. ఈ ఏడాది చూసుకుంటే 16 లక్షల కోట్ల ఆదాయం రావాలి. ఈ లోటునంతటినీ భర్తీ చేసుకోవాలంటే.. కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన అడుగులు వేయాలి. వేయకపోతే ఈ ద్రవ్య లోటు 2034 వరకూ భరించాల్సిందే. మరోవైపు జీడీపీ 8.9 శాతం నుంచి 7 శాతానికి పడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ఏరకమైన చర్యలు తీసుకోవాలనే అంశాలపై పార్లమెంట్‌లో మా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డితోపాటు, వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు తగు సూచనలు కూడా ఇచ్చాం.

2030 నాటికి దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ వాడకాలను పూర్తిగా తగ్గిస్తామని, వాటికి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను తీసుకువస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నారు. దాన్ని ఏరకంగా తీసుకువస్తారని మేము ప్రశ్నించడం కూడా జరిగింది. ఓవైపు సోలార్‌ ఎనర్జీని ప్రోత్సహిస్తామని చెబుతూనే.. మరోవైపు దానిపై 18శాతం జీఎస్టీ వేయడం ఏరకంగా సబబు అని అడుగుతున్నాం.

రెన్యువబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి
నదుల అనుసంధానం గురించి దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ ఆలోచన చేసినా అది కార్యరూపం దాల్చలేదు. ఉదాహరణకు చైనా త్రి గోర్జస్ డ్యామ్‌లో ఒకరోజుకు 22,500 మెగావాట్స్‌ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 110 బిలియన్‌ యూనిట్స్‌ విద్యుత్‌ను ఉత్పత్పి చేస్తోంది. అలాంటి సామర్ధ్యం ఉన్న ప్రాజెక్ట్‌లు మన దేశంలో ఏమున్నాయని అడుగుతున్నాం. నదులు అనుసంధానం ద్వారానే హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ను ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆదిశగా కేంద్రం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

గ్యాస్‌ ధరలు చూస్తే.. గృహ వినియోగానికి వాడే గ్యాస్ సిలిండర్‌ ధర ఈ మధ్యకాలంలో 25శాతం పెరిగింది. వాణిజ్య సిలిండర్‌ ధరలు తగ్గించినట్లే.. గృహ వినియోగ సిలిండర్‌ ధరలను కూడా కేంద్రం తగ్గించాలి. పెట్రోల్‌, డీజిల్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి.

పోలవరానికి నిధులివ్వాలి
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని కేంద్రం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ పంటలపై రైతులను ప్రోత్సహించాలి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కొన్ని రకాల పంట ఉత్పత్తులను భారతదేశంలోనే పండించేలా రైతులను ప్రోత్సహించి వారికి అన్నివిధాలా అండగా ఉండేలా ఎందుకు ఆలోచన చేయడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్ట్‌ ను తీసుకుంటే.. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 960 మెగావాట్స్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. కేంద్రం పోలవరం ప్రాజెక్టు కు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని ఇస్తేనే ప్రాజెక్ట్‌ పూర్తి అవుతుంది. అప్పుడు ఏపీ కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్‌ను శరవేగంగా పూర్తయ్యేలా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం త్వరగా మంజూరు చేయాలి. మరోవైపు బొగ్గు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. థర్మల్‌ పవర్‌కు బొగ్గు వాడతున్నాం. దానికి ప్రత్యామ్నాయంగా రెన్యువబుల్ ఎనర్జీని ప్రమోట్‌ చేయాల్సిన అవసరం ఉంది.

టీటీడీ, దేవాలయాలను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలి
హిందూయిజానికి తామే ఛాంపియన్స్‌ అని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ… తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)పైన కూడా ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. దేవాలయాలను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు, మా పార్టీ పార్లమెంటరీ సభ్యులు అనేకమార్లు విజ్ఞప్తి చేసినా దానిపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని, టీటీడీపైన వేసే ట్యాక్స్‌ను రద్దు చేయాలని కోరుతున్నాం.

కేంద్ర పన్నుల్లో వాటాగా, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మిగతా రాష్ట్రాలకు జీఎస్టీలో 42 శాతం రావాల్సి ఉంది, ఇప్పుడవి 31 శాతానికి పడిపోయాయి. ఏపీకి 46వేల కోట్లు రూపాయిలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. కాగ్‌ నివేదిక ప్రకారం ఏపీ రెవెన్యూ లోటు 18వేల కోట్లు బకాయిలను ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేయాలి.

అలానే, టీడీపీ ఎన్టీయే నుంచి బయటకు వచ్చాక, విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులను, గత నాలుగేళ్లుగా విడుదల చేయలేదు. వాటన్నింటిని ఒకేసారి ఇస్తే క్యాపిటల్‌ ఎక్స్‌పెండించర్‌గా ఉపయోగించుకుంటాం. ఒడిశాకు ఇచ్చినట్లే ఏపీలో ఉన్న ఏడు వెనుకబడిన జిల్లాలకు కూడా కేబీకే ప్యాకేజీ ప్రకారం నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో డిమాండ్‌ చేస్తున్నా.. అందులో బీజేపీ పాలిత రాష్ట్రాలే ఎక్కువ ఉండటంతో ఆయా రాష్ట్రాలు అంగీకరించడం లేదు. మెజార్టీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉండటంతో వారి నిర్ణయమే అమలు అవుతోంది. అలానే లాంగ్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచాల్సిన అవసరం ఉంది.ధరల నియంత్రణపై కేంద్రం దగ్గర పరిష్కారం లేదు

ఎంపీ వంగా గీత మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
ధరల పెరుగుదల అంశంపై రెండురోజులుగా అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభలోనూ చర్చ జరిగింది. ప్రజల యొక్క సమస్యలు, మా వాదనలను ఉభయ సభల్లో ప్రస్తావించాం. ధరల పెరుగుదలపై సమాధానం దొరికింది కానీ, పరిష్కారం దొరకలేదు. ఉభయ సభల్లో ఎందుకు ధరలు పెరగాయనేదానిపై రీజన్స్‌ చెప్పారు కానీ, పేద ప్రజలకు ఎలాంటి ఊరట ఇస్తున్నారనేది చెప్పలేదు.

కరోనా విపత్తు, ఆర్థిక పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్‌ వార్‌, డాలర్‌ విలువ పెరిగి రూపాయి విలువ తగ్గడం గురించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తన వాదన వినిపించింది. ఈ బాధలు ఒక్క ప్రభుత్వానికే కాదు, సామాన్య ప్రజలకు కూడా ఇవే బాధలు ఉన్నాయి. ప్రశ్నలకు సమాధానాలు వస్తున్నాయి. కానీ పరిస్థితులను చక్కదిద్దేలా మానవతా దృక్పధంతో, సహృదయంతో ఆలోచించాల్సిన బాధ్యత ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి కి ఉంది.గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజలు రెండు రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి ధరలు పెరుగుదల, రెండోది.. బ్లాక్‌ మార్కెటింగ్‌ విధానాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ఓవైపు, మరోవైపు బ్రాండెడ్ ప్యాకేజీ ఫుడ్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం దారుణం. ఇప్పటికైనా పేద ప్రజలు గురించి ఆలోచించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా, రాష్ట్రంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వెళుతున్నప్పుడు.. మెజార్టీ ప్రజలు ధరల పెరుగుదల గురించి అడుగుతున్నారు. ధరలు తగ్గించాలని ప్రధానమంత్రి ని అడగండి అంటూ ముఖ్యంగా మహిళలు కోరుతున్నారు. పేదవాడి పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ధరల నియంత్రణ చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉంది.

సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ ద్వారా నేరుగా, లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేద ప్రజలను ఆదుకుంటున్నారు. కొవిడ్ నేపథ్యంలో తల్లిదండ్రులు చనిపోతే, ఆ పిల్లలు రోడ్డున పడకుండా రూ. 10 లక్షలు సహాయంగా ఇచ్చాం. కొవిడ్ లో దాదాపు 5, 800 ఎంఎస్ఎంఈలు కుదేలయ్యాయని కేంద్ర మంత్రే స్వయంగా చెప్పారు.

ఉజ్వల పథకం కింద 2 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు బాగానే ఉందికానీ, అదే సమయంలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 500 నుంచి రూ.1000కు పెరిగింది. మరి, ఉజ్వల భవిష్యత్తు ఎలా ఉంటుంది..? నిత్యావసర వస్తువులు ధరలు ఒకవైపు పెరిగితే.. మరోవైపు జీఎస్టీ పేరుతో ఇబ్బడిముబ్బడిగా ట్యాక్స్ లు వేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. పేదవాడి పట్ల మానవతాదృక్పథంతో ఇప్పటికైనా కేంద్రం ఆలోచించి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి.

Leave a Reply