– వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
కొండపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ సక్రమంగా అందేలా చూడాలని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఖిల్లాలో రెండవ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొన్న సత్యకుమార్, జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతి గురించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
రాష్ట్ర రాజధాని ప్రాంతం జిల్లాలో భాగమైనందున వివిధ పరిశ్రమలు విస్తారంగా వచ్చే అవకాశం ఉంది. వాటికి అవసరమైన స్థలం, అనుమతులు వంటి వాటిపై ప్రణాళికలను అధికారులు సిద్ధం చేసుకోవాలి. పర్యాటకం, వ్యవసాయం, విద్య, వైద్యంతోపాటు, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చేలా ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ చారిత్రక, వారసత్వాన్ని ప్రతిబింబించే కొండపల్లి కోటను, కొయ్యబొమ్మలను పరిశీలించారు. కోటను పర్యాటక పరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.