సామాజిక న్యాయంపై చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు

-ఆయన ఏనాడూ బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేయలేదు
-బ్యాంక్‌ రుణాలు ఎగ్గొట్టిన వారికి రాజ్యసభ టికెట్లు ఇచ్చారు
-పార్టీ నేతలు జారిపోతారని చంద్రబాబుకు భయం పట్టుకుంది
అందుకే ముందస్తు ఎన్నికలంటూ పాట పాడుతున్నారు
-చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నమ్మబోరు
-రాష్ట్రంలో అన్ని వర్గాల వారు సీఎం వెంటే ఉన్నారు
-ప్రెస్‌మీట్‌లో వెల్లడించిన వైయస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ

గుంటూరు: ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడారంటే..:
బాబుకు నైతిక హక్కు లేదు:
రాజకీయంగానూ, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల్లోనూ ఈ మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పూర్తి సామాజిక న్యాయం జరిగింది. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 9 మంది ఎంపీలు ఉంటే, వారిలో నలుగురు బీసీలు ఉన్నారు.
అదే తెలుగుదేశం పార్టీ హయాంలో అలా బీసీలకు ఏనాడైనా న్యాయం జరిగిందా? చంద్రబాబుతో కలిసి నడిచిన యనమల రామకృష్ణుడుకు రాజ్యసభ సభ్యుడు కావాలన్నది కోరిక. కానీ దాన్ని నెరవేర్చలేదు. మరి రాజ్యసభ టికెట్లు చంద్రబాబు ఎవరికి ఇచ్చారంటే, బ్యాంకుల నుంచి వందల కోట్లు అప్పులు తెచ్చి, వాటిని ఎగ్గొట్టి అందులో కొంత ఇచ్చిన వారికే ఇచ్చారు. అంతే తప్ప, పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసిన ఏ ఒక్కరికి కూడా చంద్రబాబు ఆ అవకాశం ఇవ్వలేదు.
అదే సీఎంవైయస్‌ జగన్‌, వారిని గుర్తించి రాజ్యసభ టికెట్లు ఇచ్చారు. అందుకే రాజ్యసభ అభ్యర్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు.

అదీ చంద్రబాబు నైజం:
కేసుల్లో ఉన్న వారికి రాజ్యసభ టికెట్లు ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు. మరి నేను ఒకటే అడుగుతున్నాను. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి, రాత్రికి రాత్రి విజయవాడకు పారిపోయి వచ్చిన చంద్రబాబు, తన మీదకు ఏ కేసు వచ్చినా, కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఆ విధంగా ఎప్పటికప్పుడు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ వచ్చాడు.
అదే సీఎం వైయస్‌ జగన్‌ ఏ పరిస్థితిని అయినా ఎదుర్కొన్నారు. ఆనాడు కూడా కాంగ్రెస్‌ అధిష్టానాన్ని వ్యతిరేకించి, సొంతంగా పార్టీ పెట్టి పోరాడారు. ప్రజాదరణ పొంది అధికారంలోకి వచ్చారు. అదే చంద్రబాబుగారు ఏనాడూ కేసుల నుంచి బయట పడడానికే చూశాడు. అందుకోసం ఎవరెవరివో కాళ్లు కూడా పట్టుకున్నాడు.

బాబూ నీ చిరునామా ఎక్కడ?:
వైయస్సార్‌సీపీ బీసీ ఉద్యమ నేత ఆర్‌.కృష్ణయ్యకు రాజ్యసభ టికెట్‌ ఇస్తే దాన్ని కూడా చంద్రబాబు తప్పు పడుతున్నాడు. గతంలో కూడా పక్క రాష్ట్రం వారికి టికెట్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఆర్‌.కృష్ణయ్యది వేరే రాష్ట్రం కాదనే చెప్పాలి. మొన్నటి వరకు మనం కూడా అక్కడే ఉన్నాం.
ఇప్పుడు చంద్రబాబును ఒకటే అడుగుతున్నాను. ఆయన ఎక్కడ ఉంటున్నారు. పేరుకే ఆయన ఇక్కడ ఉంటున్నా, ఆయన స్థిరనివాసం, పోస్టల్‌ చిరునామా హైదరాబాదే. ఆర్‌.కృష్ణయ్య కూడా హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. ఆయన పక్క రాష్ట్రం వ్యక్తి అయితే నీవు కూడా అంతే కదా.

బాబుది సంకుచిత మనస్తత్వం:
బీసీలకు సముచిత స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో, ఉద్యమ నేపథ్యం ఉన్న ఆర్‌.కృష్ణయ్యకు రాజ్యసభ టికెట్‌ ఇస్తే, దాన్ని కూడా చంద్రబాబు వక్రపూరిత ఉద్దేశం, స్వార్థపూరిత రాజకీయంతో ఆలోచించి విమర్శిస్తూ, తన సంకుచిత మనస్తత్వాన్ని చూపుతున్నాడు.

అక్కడా స్వార్థ రాజకీయమే:
కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడంతో, అమలాపురంలో చోటు చేసుకున్న దాడులపై కూడా చంద్రబాబు స్వార్థ రాజకీయాలు చేస్తున్నాడు. నిజానికి ఆ ఘటనల వెనక తెలుగుదేశం, జనసేన పార్టీ వారి ప్రమేయం ఉందని తెలుస్తుంటే, చంద్రబాబు మాత్రం వైయస్సార్‌సీపీపై వేలు చూపుతున్నాడు. ఇది ఏ మాత్రం సరికాదు.

అందుకే బస్సు యాత్ర:
చంద్రబాబు ఒక్కటి గుర్తించాలి. సీఎం వైయస్‌ జగన్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్ని రంగాలలో ప్రాతినిథ్యం కల్పిస్తున్నారు. వారికి పూర్తి సామాజిక న్యాయం చేస్తున్నారు. ఆ విషయం మళ్లీ అందరికీ చాటు చెప్పేందుకే సామాజిక న్యాయభేరి.. బస్సు యాత్ర చేపట్టాం.

చంద్రబాబుకు భయం పట్టుకుంది:
చంద్రబాబుకు తన పార్టీ వారు జారిపోతారన్న భయం పట్టుకుంది. అందుకే ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు తన హయాంలో చాలా అప్పులు చేశాడు. తన 5 ఏళ్ల పాలనలో మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. కానీ ఆయన ఆ ఆప్పులతో ఏం చేశాడు? ఏదైనా చేసి చూపారా? ఎంతసేపూ అమరావతి నిర్మాణం అంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశాడు. అందుకే గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు.

సీఎం వైయస్‌ జగన్‌ అధికారం చేపట్టాక, అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. కోవిడ్‌ సంక్షోభంతో ఆదాయం పడిపోయినా, ఎక్కడా ఆయన పథకాలు ఆపలేదు. అందుకే ప్రజలంతా జగన్‌ వెంటే ఉన్నారు.గడప గడపకూ కార్యక్రమంలో ప్రతి ఇంటా ఆదరణ చూపుతున్నారు. ఇంతకు మించిన ఉదాహరణ ఇంకా ఏం కావాలి?

Leave a Reply