Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు వక్ఫ్ ఆస్తుల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు

– ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్

వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చంద్రబాబు ఒక స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. రాష్ట్రంలోని ముస్లింల రక్షణ, వారి అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. రాజకీయాలకు అతీతంగా, అధికారంలో ఉన్నా లేకపోయినా.. ముస్లింల మనో భావాలు దెబ్బతీయకుండా వారి అభ్యున్నతికి, రక్షణకు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. వారి ఆచారాలు, సిద్ధాంతాలకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. ముస్లింల మనోభావాలకు పెద్దపీట వేసేలా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కృషి చేస్తోంది.

స్వతంత్ర భారత దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకానీ, ప్రస్తుతం రాష్ట్రంలో కానీ ముస్లింల అభివృద్ధి కోసం బాటలు వేసిన నాయకుడు చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లు లోని అభ్యంతరాలను నిర్మొహమాటంగా జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటికి సిఫార్సు చేయాల్సిన బాధ్యతను నేడు తెలుగుదేశం పార్టీ తన భుజస్కందాలపై వేసుకుంది. ఈ విషయంలో టీడీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ముస్లిం సమాజం ఆలోచించాలి. దేశంలోని ఏ ప్రభుత్వం ఏపార్టీ తీసుకోని విధంగా టీడీపీ ఈ ప్రతిపాదనలను పెట్టింది.

గతంలో జగన్ ముస్లింల పక్షపాతి అని గొప్పలు చెప్పుకున్నారు. కానీ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ఎందుకు ప్రతిపాదనలు చేయలేదు?. సాక్ష్యాత్తు ఒక పార్టీకి అధినేతగా ఉన్న జగన్ నేడు రాష్ట్రంలో ముస్లింల మనోభావాలను గౌరవించాలని ఎందుకు ఆలోచించలేదు. తన ఆలోచనలు, తన విధానాన్ని ఎందుకు బహిర్గతం చేయడంలేదో జగన్ రెడ్డి చెప్పాలి. ముస్లింల మనోభావాలను గౌరవిస్తూ వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో తెలుగు దేశం మూడు సవరణలను పెట్టింది. సవరణలో పెట్టడమేకాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ బిల్లుకు సంబంధించిన అంశాల్లో ముస్లింలు భయపడుతున్న ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో నియమించే ప్రక్రియకు సవరణలు చేసిన పార్టీ టీడీపీ.

వక్ఫ్ బిల్ సవరణలో ముఖ్యంగా కలెక్టర్ స్థాయి కన్నా ఉన్నత స్థాయి అధికారిని నియమించి చట్ట ప్రకారం వక్ఫ్ బిల్లుకు సంబంధించిన అంశాలను పరిష్కరించే కార్యక్రమాన్ని టీడీపీ ఎంపీలు బహిరంగంగా పార్లమెంట్ లో లేవనెత్తారు. మూడో ముఖ్యమైన అంశాలను లీగల్ యాస్పెక్ట్ లో ఎప్పుడైనా వక్ఫ్ కి సంబంధించిన ఆస్తులను పరిరక్షించడానికి ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి వక్ఫ్ ఆస్తులను పరిరక్షించే కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చేసింది. బిల్లులో టీడీపీ ప్రతిపాదించిన మూడు సవరణలు జేపీసీ ఆమోదించడంలో సీఎం చంద్రబాబు ముఖ్య బాధ్యత తీసుకున్నారు.

గత ప్రభుత్వంలో వక్ఫ్ ఆస్తులు ఎక్కడ చూసినా అన్యాక్రాంతం అయ్యాయి. ఎక్కడా కూడా వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు వైసీపీ ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేయలేదు. లీగల్ టీంని ఏర్పాటు చేయలేదు. అనేక ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయి. వక్ఫ్ ఆస్తుల్ని కంటికి రెప్పలా కాపాడుకునే కార్యక్రమాన్ని నేడు సీఎం చంద్రబాబు చేస్తే… ఉన్న కంటినే పొడిచే కార్యక్రమం ఈ జగన్ పాలనలో జరిగింది. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ నాయకుడు ఆలోచించనంత లోతుగా చంద్రబాబు ఆలోచించేవారు. ఈ ఆలోచనతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద హజ్ హౌస్ ను హైదరబాద్ లో నిర్మించారు.

2014 లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హాజ్ యాత్రికుల కోసం కడపలో హజ్ హౌస్ ను రూ.13 కోట్లతో నిర్మించి 80 శాతం పనులు పూర్తి చేశారు. విజయవాడలో రూ.23 కోట్లతో హౌజ్ హౌస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ రెండింటిని నాశనం చేశాడు. ఐదేళ్ల పాలనలో హౌజ్ హౌస్ ల నిర్మాణానికి నిధులు కేటాయించకుండా ముస్లింలకు ద్రోహం చేశాడు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సమయంలో ముస్లింలందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలనే ఆలోచనతో 10 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫాను అందజేశాం.

జగన్ రెడ్డి వచ్చాక ఈ పథకాన్ని రద్దు చేశాడు. దేశంలోనే తొలిసారిగా ముస్లిం సంక్షేమం కోసం 1985 లో అన్న ఎన్టీఆర్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ ముస్లింల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి కట్టుబడి ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ముస్లింల సంక్షేమం కోసం పెద్ద పీట వేస్తూ… మౌజన్ ఇమాములకు గౌరవ వేతనం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నదే. జగన్ రెడ్డి జీఓ 43 పేరుతో వక్ఫ్ బోర్డును వివాదాస్పదం చేశాడు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జీఓ 43 ని రద్దు చేసి కొత్త వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసింది. ముఖ్యంగా 32 అపరిష్కత కేసులను ఈ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత పరిష్కరించారు.

దేశంలో కీలకమైన బిల్లుపై చర్చ జరుగుతుంటే వైసీపీకి చెందిన ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా నోరు మెదపలేదు. నిజంగా జగన్ కు ఏ మాత్రం ముస్లింల పట్ల చిత్తశుద్ధి ఉన్నా ఎందుకు మీ పార్లమెంట్ సభ్యులు నిన్న పార్లమెంట్లో ఎందుకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై మాట్లాడలేదు? జగన్ ఎందుకు మీ స్పష్టమైన వైఖరిని ఈ వక్ఫ్ బిల్లు పై ప్రకటించలేదని ప్రశ్నిస్తున్నాను. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో ముస్లింల పక్షపాతిగా సీఎం చంద్రబాబు తన వైఖరిని స్పష్టంగా చెప్పారు.

బడ్జెట్ లో రూ.5 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. వక్ఫ్ బిల్లుపై ముస్లింలకు స్పష్టమైన విధానాన్ని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో 65 వేల ఎకరాలు వక్ఫ్ భూముల్లో 50 శాతం అన్యాక్రాంతం అయ్యాయి. మిగతా 35 వేల ఎకరాలను కాపాడుకోవడానికి దాదాపు రూ.8 కోట్ల బడ్జెట్ లో కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 3,500 ఎకరాల వక్ఫ్ ఆస్తులను డిజిటైజేషన్ చేశారు. అంతేకాకుండా ఎక్కడాలేని విధంగా వక్ఫ్ ఆష్తుల పరిరక్షణకు పటిష్టమైన లీగల్ టీంని ఏర్పాటు చేశారు. వక్ఫ్ ఆస్తులని కాపాడుకునే క్రమంలో చంద్రబాబు ఉన్నారు. 2019 -24 లో వైసీపీ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను దుర్వినియోగం చేసిన దాఖలాలు అనేకం ఉన్నాయి.

ఎక్కడ చూసినా ముస్లింల ఆస్తులను వైసీపి నాయకులు తమ అనుచరులకో, తమ అనుయాయులకో కట్టబెట్టారు. నేడు వక్ఫ్ బోర్డు ని ఏర్పాటు చేసి పటిష్టమైన ప్రణాళికతో ఎక్కడ కూడా ఒక్క గజం స్థలం కూడా ముస్లింలకు సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చంద్రబాబు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు మానాలి. నేడు చంద్రబాబు వైఖరి స్పష్టంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం వారి అభ్యున్నతి కోసం పనిచేస్తుంది. రాజకీయంగా ముస్లింల అభివృద్ధికే అధ్యతిక ప్రాధాన్యత ఇస్తోంది.

LEAVE A RESPONSE