Suryaa.co.in

Editorial

భోజనంలో బక్క ‘చిక్కీ’ బంద్?

– మధ్యాహ్నభోజనంలో పిల్లలకు చిక్కీలు బంద్?
– కాంట్రాక్టర్లకు బిల్లులివ్వని జగన్ సర్కారు
– 52 కోట్ల బిల్లుల బకాయిలు
– కోడిగుడ్డు, చిక్కీలకు కలిపి 189 కోట్లు పెండింగ్
– ఫిబ్రవరి వరకూ బిల్లులివ్వని జగన్ సర్కారు
– సరఫరా నిలిపివేస్తామని కాంట్రాక్టర్ల హెచ్చరిక
– ఇక పిల్లలకు భోజనంలో చిక్కీ,కోడిగుడ్లు లేనట్లే
( మార్తి సుబ్రహ్మణ్యం)

పాఠశాల పిల్లలకు పోషకాహారం పేరుతో సీఎం జగన్ ప్రచారం ఊదర కొట్టారు. స్కూలు పిల్లలకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు, చిక్కీ ఇస్తున్నామంటూ పేజీలకు పేజీల ప్రకటనలు ఇచ్చారు. పిల్లలకు మేనమామ ఇస్తున్న బహుమతిగా కలరింగ్ ఇచ్చి, ఆ కార్యక్రమానికి తెగ బిల్డప్ ఇచ్చారు. అయితే ఆ చిక్కీ కాంట్రాక్టును కూడా మన రెడ్డిగారికే ఇచ్చారనుకోండి అది వేరే విషయం. ఆ వ్యవహారం కోర్టులో కూడా నడిచింది. తమకు కాంట్రాక్టు దక్కని సంస్థలు కోర్టుకెళ్లాయి. తయారీదారుల నుంచి కాకుండా ఏజెన్సీ నుంచి చిక్కీలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

కాగా ఇప్పుడు స్కూలు పిల్లలకు భోజనంలో కోడిగుడ్డు, చిక్కీలు బందయ్యే ప్రమాదం ఏర్పడింది. కారణం అవి సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు, జగన్ సర్కారు ఇప్పటిదాకా బిల్లులు ఇవ్వకపోవడమేనట. బిల్లులు వచ్చే నెలలో ఇస్తామంటూ ఈ ఫిబ్రవరి దాకా లాగించిన జగన్ సర్కారు.. ఇప్పుడిక ఆ బిల్లులు ఇవ్వలేమని చేతులెత్తేసిందట.
నిజానికి కోడిగుడ్డు, చిక్కీ సరఫరా దారులకు ప్రభుత్వం, ఈ ఫిబ్రవరి వరకూ 189 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. ఒక్క చిక్కీ సరఫరాచేసే కాంట్రాక్టర్లకే 52 కోట్ల రూపాయలివ్వాలట.

దానితో ఇప్పటివరకూ సీఎంఓ చుట్టూ ప్రదక్షణలు చేసి విసిగివేసారిపోయిన కాంట్రాక్టర్లు.. ఇకపై మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు, చిక్కీలు సరఫరా చేసేది లేదని భీష్మించుకున్నారట. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే చిక్కీ, కోడిగుడ్లు సరఫరా చేయలేమని, సర్కారుకు నిర్మొహమాటంగా చెప్పేశారట. ఎన్నికల కోడ్ రావడంతో ఇప్పుడు బిల్లులు చెల్లించలేని పరిస్థితి జగన్ సర్కారుది.

అసలు మామూలు రోజుల్లేనే బిల్లులు ఇవ్వని జగన్ సర్కారు.. ఇప్పుడు ఇంకేమి ఇస్తుందని కాంట్రాక్టర్లు.. చిక్కీ,కోడిగుడ్ల సరఫరాను బంద్ చేయడానికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో అప్పట్లో కోడిగుడ్ల సైజులపై ఉద్యమం చేసిన, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజే ఇక ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలి మరి!

LEAVE A RESPONSE