ప్రజా ఉద్యమాలకు భయపడి సీఎం జగన్ పారిపోతున్నారు…!

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య వ్యాఖ్య

నాలుగున్నరేళ్ళు ప్రజా రాజధాని అమరావతిలో కూర్చున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా ఉద్యమాలకు భయపడి విశాఖ లోని రుషికొండకు పారిపోతున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈమేరకు సిఎం ఆదేశాలతో అమరావతిలోని అన్ని శాఖల కార్యాలయాలను తరలించేందుకు జీవోలు కూడా ఇచ్చారన్నారు. ఇక పారిపోవటం ఒక్కటే తక్షణ కర్తవ్యంగా ప్రభుత్వం భావిస్తోందన్నారు.

ముఖ్యమంత్రి పాదం పెట్టిన తర్వాతే అమరావతి అడవిగా మారిందని, అమరావతి రైతులకు కౌలు డబ్బులు కూడా ఇవ్వలేకపోయారని తెలిపారు. రాష్ట్రానికి అమరావతి మధ్యస్థ ప్రాంతం కావడంతో రాష్ట్రంలోని సకల కులాల బాధితులు, సర్వ వర్గాల పీడితులు విజయవాడ వచ్చి ప్రజా ఆందోళనలు చేస్తున్నారని, అమరావతి రైతులతో పాటు గుత్తేదారులు, భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, రైతులు, నిరుదోగులు, ఉద్యోగులు ఆఖరికి పారిశుద్ధ్య పనివారలు కూడా రోజువారి ఆందోళనలు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రజల ఆందోళనలకు ఆందోళన చెంది, గజగజ వణికి, అమరావతిలో ఊపిరి ఆడక తాడేపల్లి ప్యాలెస్ ను వదలి కొత్త గా రూ.433 కోట్ల రుషికొండ రాజ సౌధంకు పోతున్నారని అభివర్ణించారు. వైకాపా పాలనలో మధ్యాంధ్ర ప్రాంతమైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలు దాడులు, దౌర్జన్యాలతోనూ, అరెస్టులు, అక్రమ నిర్బంధాలతో అట్టుడికిందని, ఇదే తరహా పరిపాలనను ఉత్తరాంధ్రకు అందించేందుకు ముఖ్యమంత్రి తహతహ లాడుతున్నారని పేర్కొన్నారు. అమరావతి పై హైకోర్టు ధర్మాసనం తీర్పు, సుప్రీం కోర్టులో విచారణలను ధిక్కరించి తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందంగా ఉత్తరాంధ్ర కు పారిపోతున్నారని తెలిపారు . న్యాయ స్థానాల తీర్పు లను గౌరవించలేని పాలకుల అప్రజాస్వామిక నీతిని మూడు ప్రాంతాల ప్రజలు తెలుసు కోవాలని బాలకోటయ్య కోరారు.

Leave a Reply