– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య
ప్రజా రాజధాని అమరావతి ఉద్యమ ఉక్కుపోతను తట్టుకోలేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని పేరు చెప్పి రుషికొండపై శీతల వాతావరణం కోసం పారిపోతున్నట్లు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దసరాకి వెళ్ళిపోతాను అని చెప్పిన ముఖ్యమంత్రి, హిందూ పండుగ శుభ ముహూర్తం నచ్చక, డిసెంబర్ నెలకు మార్చుకున్నట్లు ఉందని ఆరోపించారు.
అమరావతిలో చంద్రబాబు కట్టిన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ఉద్యోగుల భవనాలు, సీడ్ యాక్సెస్ రోడ్డు, పెంచిన చెట్లు, ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాల గుర్తుల మధ్య ఉండలేకపోతున్నారని చెప్పారు. 20 అడుగుల ఎత్తులో గోడలు కట్టుకున్నా , రూ.4 కోట్లతో రోడ్లు వేసుకున్నా ,1000 మంది పోలీసులను కాపలా పెట్టుకున్నా, ఇంటి చుట్టూ ఉన్న పేదల ఇళ్ళను ఖాళీ చేయించినా ఆయనకు ప్రశాంతత లేదన్నారు.
అందుకనే కొండ మీదికి వెళ్లి కూర్చుంటే ఏ ఇబ్బంది ఉండదని భావిస్తున్నారేమో అన్నారు. తాను కొండపైకి రాగానే విశాఖపట్నం ఎడ్యుకేషన్ హబ్ , ఐటీ హబ్ గా అభివృద్ధి చెందుతుందని అంటున్నారని, నాలుగేళ్లుగా అమరావతిలో ఉంటే విజయవాడ, గుంటూరు జంట నగరాలకు ఏ హబ్ రాలేదన్నారు. సీఎం కదలికలకు ప్రజలకు ఊపిరి ఆడకుండా పోయిందన్నారు.
హైకోర్టు తీర్పు ఉండగా, సుప్రీంకోర్టులో అమరావతిపై ఎలాంటి స్టే కూడా రాకుండా రుషికొండకు ఎలా పారిపోతారని ప్రశ్నించారు. న్యాయం అందరికీ సమానం, న్యాయ స్థానాల తీర్పు లను గౌరవిస్తాం అంటున్న మంత్రులు సీఎం నిర్ణయం కోర్టు ధిక్కారణ కాదా? అని నిగ్గదీశారు. సుప్రీంకోర్టు సుమోటుగా స్వీకరించి సిఎం నిర్ణయాన్ని అడ్డు కోవాలని బాలకోటయ్య కోరారు.