– కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారుతున్నారని ఢిల్లీ పార్టీకి ఫిర్యాదు?
– ఆయన పార్టీ మారుతున్నారంటూ ఫిర్యాదు చేసిన బీజేపీ రాష్ట్ర కీలకనేత?
– నాదెండ్ల మనోహర్‌తో భేటీని సాకుగా చూపిన ఆ అగ్రనేత
– అది సాధారణ భేటీనే అంటున్న కన్నా వర్గీయులు
– మిత్రపక్ష పార్టీ నేతతో భేటీకావడం తప్పేంటని కన్నా వర్గీయుల ప్రశ్న
– గతంలోనే సదరు నేత తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కన్నా ఫిర్యాదు?
– అయినా స్పందించని ఢిల్లీ నాయకత్వం
– గిట్టనివారిని బయటకు పంపేందుకు ఆ అగ్ర నేత కుట్ర చేస్తున్నారంటున్న సీనియర్లు
– వైసీపీ అజెండాతో పనిచేస్తున్నారంటున్న సీనియర్లు?
– ఇప్పటికే సుజనా చౌదరిపై ఫిర్యాదు చేసిన ఆ అగ్రనేత
– బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పుపై రగులుతున్న అసమ్మతి
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ బీజేపీకి జనంలో బలం లేకపోయినా.. కుమ్ములాటలకు మాత్రం కొదవలేదు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, కనీసం ఒక జడ్పీ చైర్మన్, చివరకు మున్సిపల్ చైర్మన్ లేకపోయినా.. అగ్రనేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు మాత్రం, బలం ఉన్న పార్టీలకు మించి సాగుతున్న వైచిత్రి.
జిల్లా అధ్యక్షుల మార్పును నిరసిస్తూ ఇప్పటికి వందమంది నేతలు రాజీనామా చేసిన వైనం, పార్టీలో కలకలం సృష్టిస్తున్నా.. ఢిల్లీ పార్టీ మాత్రం స్పందించకపోవడం మరో ఆశ్చర్యం. అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటెత్తు పోకడపై.. జిల్లా నేతలు కన్నెర్ర చేసి లేఖాస్త్రాలు సంధిస్తున్నా, కమల నాయకత్వంలో చలనం లేదు. చివరాఖరకు పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన సంఘటనా మంత్రి సైతం.. చీమకుట్టినట్లు లేకుండా ఉండటం సీనియర్లను విస్మయానికి గురిచేస్తోంది.
ఏపీ బీజేపీలో కుమ్ములాటలు పరాకాష్టకు చేరుకున్నాయి. సీనియర్ నేత, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడయిన కన్నా లక్ష్మీనారాయణను.. పొమ్మనకుండా పొగబెట్టే కుట్రకు, రాష్ట్ర కీలక నేత ఒకరు తెరలేపారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇటీవల జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్.. గుంటూరుకు వెళ్లి, కన్నాను కలవ డం చర్చనీయాంశంగా మారింది.
దానిని సాకుగా చూపిన ఆ బీజేపీ అగ్రనేత.. కన్నా పార్టీ మారుతున్నారంటూ, ఢిల్లీకి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కన్నా జనసేనలో చేరుతున్నారంటూ.. సదరు రాష్ట్ర బీజేపీ కీలక నేత, బీజేపీ నాయకత్వానికి తాజాగా ఫిర్యాదు చేశారట.
దానితోపాటు కన్నా.. అటు టీడీపీతో కూడా టచ్‌లో ఉన్నారని ఆ అగ్రనేత ఢిల్లీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు కన్నా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ, ఆ అగ్రనేత ఢిల్లీ పార్టీకి ఫిర్యాదు చేశారని సమాచారం. అందుకే తనపై విమర్శలు చేస్తున్నారని.. పార్టీ నుంచి వెళ్లేముందు తనపై కావాలనే విమర్శలు చేస్తున్నారని సదరు అగ్రనేత, పార్టీ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌జీకి ఫిర్యాదు చేసినట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ విషయం తెలిసిన కన్నా వర్గం.. సదరు నేత తీరుపై కారాలు మిరియాలూ నూరుతోందట. బీజేపీ మిత్రపక్షమైన జనసేన నేత నాదెండ్ల మనోహర్.. తనంతట తాను కన్నా ఇంటికి వస్తే మాట్లాడటం తప్పా అని, కన్నా వర్గం ప్రశ్నిస్తోంది. అలాగైతే సదరు నాయకుడు.. విశాఖలో ఓ స్వామి సమక్షంలో , వైసీపీ నేత విజయసాయిరెడ్డికితో ఎలా భేటీ అయ్యారని కన్నా వర్గం ప్రశ్నిస్తోంది. ఆ నాయకుడి వియ్యంకుడు, బీఆర్‌ఎస్‌లో చేరడం వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నిస్తోంది. వైసీపీ అజెండాతో పనిచేస్తున్న సదరు బీజేపీ కీలకనేత మరోసారి అధ్యక్షుడిగా కొనసాగితే.. బయట పార్టీల నుంచి వచ్చిన నేతలెవరూ, బీజేపీలో కొనసాగడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిజానికి సదరు అగ్రనేత.. గత మూడేళ్ల నుంచే కన్నా పార్టీ మారుతున్నారంటూ, దుష్ప్రచారం చేస్తున్నారని ఓ సీనియర్ నేత, అసలు విషయం వెల్లడించారు. కన్నా టీడీపీలోకి వెళుతున్నారంటూ.. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం వెనక, సదరు బీజేపీ అగ్రనేత ఉన్నారంటున్నారు. బీజేపీలో సీనియర్లను బయటకు పంపించి, పార్టీని తన వర్గీయులతో నింపేసుకోవడమే సదరు నేత అసలు లక్ష్యమంటున్నారు. తనకు గిట్టని నేతలపై ఈవిధంగా ముద్రలు వేయడం ద్వారా.. వారిని తమంతట తాము పార్టీ నుంచి వెళ్లేలా చేయడమే, సదరు కీలక నేత అసలు వ్యూహమని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తనపై సదరు కీలక నేత కుట్ర చేస్తున్నారంటూ.. కన్నా స్వయంగా పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినా, పార్టీ నాయకత్వం స్పందించలేదంటున్నారు.
తాజాగా కన్నా లక్ష్మీనారాయణ నియమించిన, ఆరుగురు జిల్లా అధ్యక్షుల మార్పుపై అసమ్మతి రాజుకుంది. పల్నాడు, ఒంగోలు జిల్లాల నుంచి ఇప్పటివరకూ వందమంది రాజీనామా చేశారు. అంతకుముందు నలుగురు రాష్ట్ర కమిటీ నేతలు కూడా.. సోము వీర్రాజు నిర్ణయానికి నిరసనగా తమ పదవులకు రాజీనానమా చేసిన వైనం, పార్టీలో సంచలనం సృష్టిస్తోంది. అయినప్పటికీ వాటిని నివారించి.. నేతలతో చర్చించాల్సిన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుకర్‌జీ.. మౌనంగా ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది.