జగన్‌పై మరో నారీ తిరుగుబాటు

– ఈ సీఎం మనేకేమీ చేయడం లేదు
-పెద్దిరెడ్డి మాట వింటున్నారు
– రెడ్లు వేస్తేనే నేను గెలవలేదు
– ఎస్సీ నియోజకవర్గాల్లో రెడ్ల పెత్తనమేంటి?
– వీడియోలో కన్నీరు పెట్టుకున్న సింగనమల ఎమ్మెల్యే పద్మావతి
– ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇన్చార్జ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఫైరైన సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
( మార్తి సుబ్రహ్మణ్యం)

వైసీపీ అధినేత-సీఎం జగన్‌కు కాలం కలసివస్తునట్లు లేదు. నెల క్రితం వరకూ ఆయన వెన్నంటే ఉన్న అదృష్టలక్ష్మి మాయమై పోవడంతో.. జగన్‌ కష్టాల్లో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేలు వరస వెంట వరస తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. మీకు టికెట్‌ లేదంటూ చావు కబురు చల్లగా చెబుతున్న వారిపై, శివంగుల్లా విరుచుకుపడుతున్నారు. ‘తప్పులన్నీ మీరు చేసి మాకు టికెట్లు లేదంటారేంటి? అసలు మీ పార ఈ్ట టికెట్టే నాకొద్దు’ అని ఖరాఖండీగా చెప్పి, తాడేపల్లికి తలాక్‌ ఇస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇది జగన్‌ శిబిరాన్ని కలవరపరుస్తోంది.

ఇప్పుడు జగనంటే భయం లేదు. ఆయన ఫోన్‌ చేసినా తీసే లెక్కలేని- ధిక్కార పరిస్థితి. తాజాగా అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే, దళిత నేత జొన్నలగడ్డ పద్మావతి కూడా జగన్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మీకు టికెట్‌ లేదని చెప్పిన తాడేపల్లిపై విరుచుకుపడ్డారు.

తన ఆవేదనను ఆమె నియోజకవర్గ ప్రజలతో పంచుకున్నారు. కన్నీటి పర్యంతమవుతూ పద్మావతి మాట్లాడిన వీడియో పరిశీలిస్తే.. దళిత నియోజకవర్గాల్లో రెడ్ల పెత్తనం ఏమిటన్నది స్పష్టమవుతుంది. తన నియోజకవర్గానికి సీఎం జగన్‌ ఎలాంటి కేటాయింపులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్తపట్ల మంత్రి పెద్దిరెడ్డి వివక్ష చూపారు. నియోజకవర్గ సమస్యలను ఎన్నిసార్లు చెప్పినా పెద్దిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. నేను రెడ్లు ఓట్లు వేస్తేనే గెలవలేదు. అంతా ఓట్లు వేస్తేనే గెలిచా. మాట తప్పను మడప తిప్పనని జగన్‌ అంటుంటారు. కానీ నా నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానన్న జగన్‌ మాట తప్పారు’’ అని విరుచుకుపడ్డారు. చివరాఖరలో ‘నేను నియోజకవర్గానికి ఏమీ చేయనందుకు క్షమించండి’అని ప్రార్ధించడం అందరినీ కలచివేసింది.

ఇంతకూ పద్మావతి ఏమన్నారంటే… ‘ మాట తప్పను మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి…. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టు నడుచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ కేటాయించట్లేదంటూ ముఖ్యమంత్రి చెప్పారు. నా నియోజకవర్గ అభివృద్ధికి…. కేటాయింపులకు కూడా ఈ ముఖ్యమంత్రి ఏమాత్రం సహకరించలేదు. తన పట్ల తన భర్త పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివక్ష చూపారు. ఎన్నికల్లో టికెట్ కేటాయించాలంటూ ముఖ్యమంత్రిని అభ్యర్థించాం… కానీ అటువైపు నుంచి ఏ మాత్రం స్పందన లేదు. ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఏమీ చేయలేకపోయాను….. సింగనమల నియోజకవర్గం ప్రజలకు సారీ ‘

తాజాగా దళితఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వ్యాఖ్యలు పరిశీలిస్తే.. ఎమ్మెల్యేలకు అపాయింటుమెంట్లు ఇవ్వని పార్టీ అధినేత జగన్‌ నిర్లక్ష్యం, ఎంత భారీ మూల్యం చెల్లించుకోబోతోందో స్పష్టమవుతుంది. ఇప్పటికే దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైసీపీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరగా.. తాజాగా జగన్‌ను ధిక్కరించిన మరో నారీగా, పద్మావతి ఆ జాబితాలో చేరారు.

దళిత ఎమ్మెల్యే పద్మావతి వ్యాఖ్యలు పరిశీలిస్తే.. రాష్ట్రంలోని 31 ఎస్సీ-ఎస్టీ నియోజకవర్గాల్లో పేరుకు ఆయా వర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ, పెత్తనమంతా రె డ్లే చేస్తున్నారన్న విషయం బయటపడింది. నిజానికి ఇది బహిరంగ రహస్యమే అయినా.. కొంచెం ఆలస్యమైనప్పటికీ ఎమ్మెల్యే పద్మావతి, దానిని బయట ప్రపంచానికి చాటారు. ఈ పరిణామం దళితులను వైసీపీకి.. మరింత దూరం చేసేదేనని వైసీపీ సీనియర్లు అంగీకరిస్తున్నారు.

Leave a Reply