Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ వి గుంటనక్క వేషాలు

-ఇండీ కూటమి అవినీతిపరులుకు చిరునామా
-‘విభజన భారత్‌’ కోసం కాంగ్రెస్‌ కుట్రలు
-కాంగ్రెస్ గెలిచేది లేదు.. రాహుల్ బాబా ప్రధాని అయ్యేది లేదు
-బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్

హైదరాబాద్: కాంగ్రెస్ వి గుంటనక్క వేషాలు.. ఆ పార్టీ నాయకులవి ఎప్పుడూ కుట్రల రాజకీయాలే. ఎన్‌డిఎ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, ఇండీ కూటమి అధికారంలోకి వస్తుందంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. అధికార పైత్యం ఎంత పట్టుకుందో ఇట్టే అర్థమవుతోంది.

దేశంలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తోకపార్టీలతో పొత్తుపెట్టుకుని ముక్కీమూలిగి వందసీట్లు మాత్రమే సాధించింది. ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలుపన్నడం చూస్తుంటే, కాంగ్రెస్ వి నీచ రాజకీయాలని మరోసారి రుజువైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల పేరుతో గారడీలు చేసి 400 పైగా హామీలతో 420 వేషాలకు తెరదీసింది.

వందరోజుల్లో హామీల అమలు చేస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక ప్రజలను మరోసారి మోసం చేసింది. ఆరు నెలల్లోనూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎప్పుడు అధ:పాతాళంలోకి పడిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ప్రజలకు ఒరగబెట్టింది లేదు కాని.. ఎన్డీయే ప్రభుత్వాన్ని కూలదోసి దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పడం సిగ్గుచేటు.

వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంటే.. ‘విభజన భారత్‌’ కోసం కాంగ్రెస్‌ కుట్రలు చేస్తోంది. కాంగ్రెస్‌ ‌పార్టీ కథ కంచికి చేరిందని మొన్నటి లోక్ సభ ఎన్నికల ద్వారా మరోసారి రుజువైంది. వరసగా 2014, 2019 ఎన్నికల్లో రెండు అంకెల సంఖ్యకే పార్టీ బలం పరిమితమయింది. ఒకసారి సోనియా గాంధీ నాయకత్వంలో, మరోమారు రాహుల్‌ ‌గాంధీ సారథ్యంలో శతాధిక సంవత్సరాల పార్టీ చచ్చుబడిపోయింది. ఇప్పుడు మూడవసారి మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో అదే పునరావృతమైంది.

బాధ్యతలు లేని అధికారాన్ని చెలాయించేం దుకు అలవాటు పడిన రాహుల్‌ ‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ ‌బతికి బట్ట కట్టడం కాదు కదా, ఐసీయూ నుంచి బయటకు రావడం కూడా జరిగే పని కాదు.

గడిచిన 23 సంవత్సరాలలో ఒక్క సెలవు కూడా తీసుకోకుండా దేశం కోసం పనిచేసిన వారు నరేంద్ర మోదీ .ఓటమి దెబ్బలు తిని బ్యాంకాక్ కు నెలల తరబడి పారిపోయి కాడి ఎత్తేయడం రాహుల్ గాంధీకి అలవాటు.

ఇండీ కూటమి అవినీతిపరులుకు చిరునామా. కుటుంబ పాలకుల అడ్డా. మెజారిటీ ప్రజల మనోభావాలను నిరంతరం కించపరిచే ప్రజాస్వామ్య ద్వేషుల కూటమి. వీరికి కూడా రాహుల్‌ ‌మీద నమ్మకం లేదు. మోదీ స్థానంలో రాహుల్‌ను నిలబెట్టే దింపుడు కల్లం ఆశలు చెల్లవని గుర్తుంచుకోవాలి.

2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసినా బుద్ధిరాని ఇండీ కూటమి బీజేపీ, ఎన్డీఏ సంఖ్యా బలాన్ని తగ్గించేందుకు, తద్వారా తమ ఉనికిని కాపాడు కునేందుకు కుట్రలు మొదలుపెట్టడం నీచ రాజకీయానికి పరాకాష్టే. ఊదు కాలదు.. పీరు లేవదు.. దేశంలో భవిష్యత్తులోనూ కాంగ్రెస్ గెలిచేది లేదు.. రాహుల్ బాబా ప్రధాని అయ్యేది లేదు.

LEAVE A RESPONSE