Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ ధర్నాలు చేపట్టడం సిగ్గుమాలిన చర్య

-సోనియా, రాహుల్ నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు
– ఇంకా ప్రజలను మభ్యపెడతారా?
– కంచ గచ్చిబౌలి విషయంలో వితండవాదాలు వద్దు.
– విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఢిల్లీ: దేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం బోఫోర్స్, 2జీ, బొగ్గు కుంభకోణం వంటి ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడింది. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులోనూ వేలకోట్లు కొల్లగొట్టాలని చూస్తోంది. స్వాతంత్ర్య సమరయోధులు నేషనల్ హెరాల్డ్ ను స్థాపించుకున్నారు. కానీ దొడ్డిదారిన ఈ పత్రిక ద్వారా రాహుల్, సోనియా గాంధీ కి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీకి ఈ ఆస్తులను బదలాయించుకుంటున్నారు.

దీనిపై విచారణ చేస్తే.. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేపట్టడం సిగ్గుమాలిన చర్య. కాంగ్రెస్ పార్టీకి చట్టంమీద విశ్వాసం ఉంటే ఈ విధంగా ధర్నాలు చేయరు. నెహ్రూ కుటుంబానికి, దేశాన్ని లూటీ చేయాలనే ఉద్దేశమే తప్ప సేవ చేయాలనే ఉద్దేశం లేదు. బోఫోర్స్ కుంభకోణం నుంచి నేషనల్ హెరాల్డ్ కేసు వరకు కాంగ్రెస్ పార్టీ సర్వస్వం అవినీతిమయమే.

రాజకీయ వ్యవస్థలను, దేశ రాజ్యాంగ బద్ధ సంస్థలను నిర్వీర్యం చేయడం, దేశాన్ని అవినీతి మయంగా మార్చడం కాంగ్రెస్ చేసింది. ఈ కేసు ఇవాళ వచ్చింది కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. 2012 నవంబర 1వ తేదీన.. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు.. సుబ్రమణ్యస్వామి ఢిల్లీ కోర్టులో కేసు వేశారు.

అందులో చాలా స్పష్టంగా.. సోనియా, రాహుల్ పైన.. యూపీయే హయాంలోనే.. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను తమ రియల్ ఎస్టేట్ కంపెనీకి మళ్లించుకున్నారు అని చాలా స్పష్టంగా దాఖలు చేశారు. ఇది పత్రికకు సంబంధించిన ఆస్తులు. కాంగ్రెస్ పార్టీ.. ఈ పత్రికకు.. 90 కోట్ల రుణం ఇస్తే.. దాన్ని.. 50 లక్షలరూపాయల కోసం మళ్లీ రియల్ ఎస్టేట్ కంపెనీకి దారిమళ్లించారు.

దీనికి సోనియా, రాహుల్ నేతృత్వం వహిస్తున్న కంపెనీ ఎలా వీటిని స్వాధీనం చేసుకుందో కోర్టులో సుబ్రమణ్యస్వామి వివరించారు. ఈ కేసును కొట్టేయాలని రాహుల్, సోనియా హైకోర్టుకు వెళ్తే.. కోర్టు కొట్టేసింది. దర్యాప్తు జరగాలని స్పష్టం చేసింది.2016లో సుప్రీంకోర్టు కూడా సోనియా, రాహుల్ అభ్యర్థనను తోసిపుచ్చింది.

మోదీ ప్రధాని అయ్యాకే ఈ కేసులు బయటకు వచ్చినట్లు.. సోనియా, రాహుల్, కాంగ్రెస్ నేతలను సుద్దపూసలు అయినట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉల్టాచోర్.. అన్నట్లుగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ధర్నాలు చేస్తోంది.సోనియా, రాహుల్ గాంధీ.. చట్టానికి వ్యతిరేకంగా, ఆస్తులను దారిమళ్లించుకుంటే మీకు భయపడి కేసులు విత్ డ్రా చేసుకోవాలా? కోర్టుల పరిధిలోకి వెళ్లిన అంశం కేంద్రం చేతుల్లోనో.. దర్యాప్తు సంస్థల చేతుల్లోనే ఉండదు. కోర్టుకు, ఈడీకి సహకరించాల్సింది పోయి.. దబాయించేందుకు ప్రయత్నించడం సరికాదు.

కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించడం మానుకోవాలి. ఈడీ కార్యాలయాలు, కేంద్రప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు చేసినంత మాత్రాన.. మీ అవినీతి, అక్రమాలు సమసిపోవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బొగ్గు కుంభకోణం, 2జీ స్కామ, బోఫోర్స్ స్కామ్, అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణాన్ని.. కాంగ్రెస్ చేసిన అవినీతిని మరిచిపోలేదు. సోనియా, రాహుల్ నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలున్నా.. ఇంకా ప్రజలను మభ్యపెడతారా?

కాంగ్రెస్ అవినీతి, అక్రమాలకు ఎలా పెద్దపీట వేస్తుందో.. మరోసారి బహిర్గతమవుతోంది. కాంగ్రెస్ చేస్తున్న ధర్నాలు, నిరసన ప్రదర్శనను.. చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. అవినీతి కుంభకోణాల్లో చిక్కుకున్న సోనియా, రాహుల్ లను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

5వేల మంది స్వాతంత్ర్య సమరయోధులు ఇందులో షేర్ హోల్డర్లుగా ఉండేవారు. వారి స్థానంలో ఇవాళ నకిలీ గాంధీలు రాజ్యమేలుతున్నారు. 90 కోట్లు నేషనల్ హెరాల్డ్ పత్రికకు కాంగ్రెస్ పార్టీ ఇస్తే.. దీన్ని 50 లక్షలకే.. రాహుల్, సోనియాలు మెజారిటీ షేర్ హోల్డర్లుగా ఉన్న సంస్థకు కట్టబెట్టారు. దీన్ని బీజేపీ తెలంగాణ శాఖ.. కాంగ్రెస్ ప్రదర్శనలను ఖండిస్తోంది. రాజ్యాంగబద్ధ సంస్థలు.. ఇలాంటి ధర్నాలతో భయపడవని తెలుసుకోవాలి.

న్యాయస్థానం ఆదేశాల మేరకు.. సమగ్రంగా విచారణ జరగాలి. మీరు చేసిన అవినీతి, అక్రమాలను విచారణ సంస్థలు చూస్తూ ఊరుకోవు. లక్నో, పట్నా, భోపాల్, ముంబై, ఢిల్లీ, ఇండోర్ లో ఉన్న ఆస్తులను సీజ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ కోరింది.కాంగ్రెస్ సిగ్గుమాలిన చర్యలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.

కంచ గచ్చిబౌలి విషయంలో వితండవాదాలు వద్దు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం చేసిన.. దుందుడుకు చర్యలను, తప్పును ఒప్పుకుని కోర్టుముందు వితండవాదాలు చేయవద్దు. అబద్ధాలు మాట్లాడకుండా ఆ భూమిలో సుప్రీంకోర్టు చెప్పినట్లు అక్కడ మొక్కలను నాటే పని చేపడితే బాగుంటుంది.

అర్ధరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టి చెట్లను నరికిన ఘటనలు.. దేశ చరిత్రలో ఎక్కడా లేవు. పోలీసు బందోబస్తు పెట్టి వంద ఎకరాల్లో చెట్లు నరకడం.. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి అద్దం పడుతోంది. సుప్రీంకోర్టు ఇవాళ ఏం చెప్పిందో.. ప్రధానమంత్రి గా కూడా ఇదే మాట చెప్పారు. చెట్లు నరకడం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. బీజేపీ తరపున ఈ విషయంలో అన్నిరకాలుగా ప్రయత్నించాం.. విద్యార్థులకు అండగా నిలిచాం.

యువమోర్చా, మహిళామోర్చా కార్యకర్తలు ఉద్యమాలు చేశారు. జైలుపాలయ్యారు. వాల్టా చట్టం కింద చెట్టు నరకాలన్నా సర్కారరు అనుమతి తీసుకోవాలి. వంద ఎకరాల్లో చెట్లు నరికేందుకు ఎవరి అనుమతి తీసుకున్నారు. వాల్టా యాక్ట్ కింద ఏరకమైన చర్యలు తీసుకున్నారు.

భూములు అమ్ముతున్నరా లేదా? ఉపాధికల్పన జరుగుతున్నదా అనేది కాదు. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ పడొద్దనది మా ఆలోచన. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ కాంక్రీట్ జంగల్ గా మారిన సందర్భంలో.. చుట్టుపక్కలనున్న ప్రాంతాల్లోని వణ్యప్రాణులు, పక్షులు ఈ ప్రాంతంలోని చెట్లను తమ ఆవాసంగా మార్చుకున్నాయి. అటువంటి భూములను భావితరాలకోసం కాపాడుకోవడం మనందరి బాధ్యత.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా.. ఇలాగే భూములను అమ్ముకునేందుకు ప్రయత్నించింది. జింకలు చనిపోయిన మాట వాస్తవం కాదా? పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత సమాజానిది.

LEAVE A RESPONSE