Suryaa.co.in

Political News

కాంగ్రెస్ ”స్వయం విధ్వంసక పార్టీ’

(ఎస్.కె జకీర్. ఎడిటర్, బంకర్ న్యూస్)

స్వయం విధ్వంసక లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతం. ఆ పార్టీ సీనియర్లు వృద్ధులు కావడం, అవినీతికి అలవాటు పడడం, స్వప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం వల్ల ఒక నిర్మాణాత్మకశక్తిగా ఆ పార్టీ అవతరించలేకపోతున్నది. తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలు జాతీయ స్థాయిలో ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలకు ప్రతిబింబమే!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ను ‘ప్రాంతీయపార్టీ మోడల్’ గా మార్చాలనుకుంటున్నారు.కాంగ్రెస్ సీనియర్లు చేస్తున్న ఈ వ్యాఖ్యలు యువతకు,వృద్ధ తరానికి మధ్య దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘గొడవల’కు అడ్డం పడుతున్నవి.తెలంగాణలో అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఓడించే ‘ఎజండా’ రూపకల్పన కన్నా రేవంత్ రెడ్డిని పదవి నుంచి దింపడమే సీనియర్ల లక్ష్యం.అలాగే ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసి.వేణుగోపాల్, టీఎస్.కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ ల ఆశీస్సులు రేవంత్ కు పుష్కలంగా ఉన్నవి.

కనుక రేవంత్ ఒంటెత్తు పోకడలకు పాల్పడుతున్నట్టు విమర్శలున్నవి.వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి నున్నచీ దింపాలని కొందరు సీనియర్లు కంకణం కట్టుకున్నారు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు ఈ ప్రయత్నాలలో ముందు వరుసలో ఉన్నారు.కాగా గులాంనబీ ఆజాద్ తో పాటు 23 మంది నేతలు లేఖ రాసినా, కపిల్ సిబాల్, చిదంబరం వంటి వారు విమర్శలు చేసినా కాంగ్రెస్ లో మార్పు రావడం లేదు. కాంగ్రెస్ ను ప్రజలు బీజేపీకి సమర్థ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారా ? అని కపిల్ సిబల్ ప్రశ్నించారు. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే నరేంద్రమోదీ సారథ్యంలోని బిజెపికి తిరుగులేకుండా పోతున్నదని, ప్రతిపక్ష పార్టీగా బలోపేతం కావాలన్న బలమైన ఆకాంక్ష కాంగ్రెస్ లో కనపడడం లేదు.

పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి, బలమైన, సమర్థమైన, అందరికీ అందుబాటులో ఉండే నాయకత్వాన్ని ఏర్పర్చుకోవాలని పార్టీ హైకమాండ్ కు ఆజాద్ తదితరులు సూచించారు. సోనియాగాంధీ చలించలేదు. సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని కోరిన నాయకులపై పై అశోక్ గెహ్లాట్ వంటి సోనియా విధేయులు దాడి చేశారు. ‘సోనియా లేకపోతే మీరెక్కడుండేవారు? ఆమె లేకపోతే మీకు పదవులు ఉండేవి కావు, మిమ్మల్ని ఎవరూ గుర్తించేవారు కాదు..’ అని విమర్శించారు.

కాంగ్రెస్ లో ఆత్మ పరిశీలన, సమీక్ష లేవు.క్రమంగా కుళ్లిపోయిన ఒక వ్యవస్థగా పార్టీ మారిపోయింది. ఒక బలమైన నాయకత్వాన్ని జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల్లోనూ ఏర్పర్చగలిగిన శక్తి కాంగ్రెస్ కోల్పోయినట్లు కనపడుతున్నది. ప్రతి ఎన్నికనూ బీజేపీ సీరియస్ గా తీసుకుని అన్ని శక్తులూ ఒడ్డి పోరాడుతున్నది.
వారసత్వంతో నిమిత్తం లేని నాయకులను బిజెపి ప్రోత్సహిస్తున్నది.వారసత్వమే నాయకత్వం కావడం కాంగ్రెస్ దౌర్భాగ్యం. రాష్ట్రం తర్వాత రాష్ట్రం కోల్పోతున్నా పార్టీలో అసంతృప్తిని, అసమ్మతిని సహించలేకపోతున్నది.పరాజయాలపై కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించేవారు కనపడడంలేదు.ప్రతిపక్షం బలోపేతం కాలేకపోతే అధికార పక్షానికి తిరుగుండదన్నది సాధారణ సూత్రం.జాతీయ స్థాయిలో బీజేపీ అయినా,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లలో కేసీఆర్,జగన్ అయినా తిరుగుగులేని రాజకీయ శక్తులుగా మారిపోయారు.కాంగ్రెస్ చతికిలపడడమే ఇందుకు ప్రధాన కారణం.

జ్యోతిరాదిత్య సింధియా వంటి యువనాయకుడు ఉండగా, 73 సంవత్సరాల కమల్ నాథ్ ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించడమే పెద్ద తప్పు. ఒక వైపు భారతీయ జనతా పార్టీ వృద్ధ నేతలను మార్గదర్శక మండలికో, గవర్నర్ పదవులకో పంపించి యువనేతలను ప్రోత్సహిస్తున్నది.ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు రాని వారిలో నిరాశానిస్పృహలు తలెత్తుతున్నవి. రాహుల్ గాంధీతో పాటు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, జితేంద్ర ప్రసాద, మిలింద్ దేవర వంటి వారిని యువబృందంగా భావించేవారు.

2014 తర్వాత 16వ లోక్ సభలో కర్ణాటకకు చెందిన కురువృద్ధ నేత మల్లిఖార్జున ఖర్గే స్థానంలో జ్యోతిరాదిత్యను సభా నాయకుడుగా ఎంపిక చేసి ఉంటే లోక్ సభలో బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించి ఉండేది. జ్యోతిరాదిత్య సింధియా లేదా సచిన్ పైలట్ వంటి యువనాయకుడ్ని ముందుకు నెట్టినా కాంగ్రెస్ లో కొత్త ఊపు లభించేది. ఒక విమాన ప్రమాదానికి బాధ్యత వహించి తన తండ్రి మాధవరావు సింధియా మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జ్యోతిరాదిత్య సింధియా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ కూడా అస్త్ర సన్యాసం చేసి పార్టీ అధ్యక్ష పదవిని మరొకరికి అప్పజెప్పాల్సిందిగా ప్రకటించారు.

ఎంతమంది బతిమిలాడినా రాహుల్ వినిపించుకోలేదు. ఆ తర్వాత మరో యువనాయకునికి పార్టీ అధ్యక్ష పదవి అప్పజెప్పాలన్న చర్చ జరిగింది. జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ లాంటి యువనేతలను పార్టీ అధ్యక్ష పదవిలో నియమించాలని కొందరు నేతలు అప్పట్లో బహిరంగంగా కోరారు. చివరకు ముకుల్ వాస్నిక్ వంటి విధేయుడైన నాయకుని పేరు కూడా ముందుకు వచ్చింది. కాని సోనియాగాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలనకు సమయం ఆసన్నమైనట్టు సింధియా ప్రకటించారు.కానీ కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం జరగలేదు.అందుకు సీనియర్లు నిరాకరించారు.

బిజెపి హయాంలో తాము బలోపేతం అయ్యేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేయడం లేదు. నాయకుడికి కావల్సింది పలాయనమంత్రం కాదు. సర్వశక్తులనూ కూడగట్టుకుని, కార్యకర్తల్లో, నేతల్లో ఆత్మస్థైర్యం నింపే వారు లేరు. వేగంగా నిర్ణయాలు తీసుకుని పార్టీని నడిపించే శక్తి లేదు. 2019 ఎన్నికల్లో రెండవసారి పరాజయం చెందడం 52 సీట్లకు పరిమితం కావడం కాంగ్రెస్ ఆత్మస్థయిర్యాన్ని బాగా దెబ్బతీసింది. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వాలను కుప్పకూల్చడం,ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోవడం, సీనియర్ నాయకులను ఆకర్షించడం, కాంగ్రెస్ పునాదులను దెబ్బతీసే చర్యలతో కాంగ్రెస్ కకావికలమవుతున్నది. కాగా కాంగ్రెస్ అంతర్గత కుటిల రాజకీయాలు ఆ పార్టీ కూకటి వేళ్ళను మరింత దెబ్బతీస్తున్నవి.

కాంగ్రెస్ పార్టీ ఎదురీదుతున్నది. ఆ పార్టీ ఒక ప్రతిపక్షంగా సంఘటితంగా బిజెపికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో విఫలమవుతుంది. రాహుల్ గాంధీకి సీనియర్ నాయకులకు మధ్య పొసగడం లేదు. కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడంటూ కనపడడం లేదు. ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా తనకు అనుకూలంగా మలుచుకుని, ప్రజల్లో అభిమానం చెక్కుచెదరకుండా ఉండేందుకు నరేంద్రమోదీ ప్రదర్శిస్తున్న గజకర్ణ గోకర్ణ విద్యలను తిప్పిగొట్టగల వ్యూహరచన కాంగ్రెస్ చేయడం లేదు.అంతర్గతంగా ఒకరినొకరు తొక్కేందుకు, ఒకరి కాళ్లను మరొకరు ఇందుకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఒక పదవి కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. వెన్నుపోట్ల సంస్కృతి కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉన్నది. కాంగ్రెస్ లో రకరకాల ముఠాలున్నవి. రకరకాల గ్రూపులున్నవి. రాజకీయ పార్టీగా కన్నా దళారుల కూటమిగా దానికి గుర్తింపు ఉన్నది.

సోనియాగాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. చరిత్రలో ఒకో కాలంలో ఒకరు తమ పాత్రను పోషిస్తారు. మోదీ ప్రభంజనంలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. ఆమె అనారోగ్యంతోనే పార్టీని ఏదో రకంగా కాపాడేందుకు శాయశక్తులా పని చేయవలిసిన పరిస్థితులు నెలకొన్నవి.సోనియాగాంధీ చుట్టూ ఉండే నాయకులు సకాలంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనందువల్ల రాష్ట్రాల్లో పార్టీ దెబ్బతింటున్నది. ఒకవైపు ‘బాహుబలి’గా తయారైన మోదీతో , కుళ్లిపోతున్న వ్యవస్థగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ తలపడవలసి వస్తున్నది.

రాహుల్ గాంధీ స్థానంలో మరొక ప్రత్యామ్నాయ నాయకుడు లేరా? అన్న అంశంపై చర్చ జరుగుతున్నది. మళ్లీ సోనియాగాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం ఒక విషాదం. సోనియాగాంధీ ఆరోగ్య కారణాల వల్ల రాష్ట్రాలలో ఇదివరకటిలా పర్యటించలేరు.’మాకు కనపడే నాయకుడు కావాలి’ అని గులాం నబీ ఆజాద్ తదితర 23 మంది నాయకులు రాసిన లేఖను తప్పు పట్టడానికి లేదు. ఇది నిజంగా ఆ 23 మంది నాయకుల సమస్యేనా? కాంగ్రెస్ పార్టీని ఎవరు సమర్ధంగా నడపగలరు ?

బిజెపిలో అద్వానీని పక్కనబెట్టి ‘సంఘ్ పరివార్’ మోదీని రంగంలోకి దించింది. రాష్ట్రాలనుంచి నాయకులను ఢిల్లీ స్థాయికి ప్రోత్సహించగలిగిన సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేదు.అందువల్ల కాంగ్రెస్ ఒక కుటుంబ పార్టీగా ముద్రవేసుకున్నది. దేశంలో మోదీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు ఆలోచించే పరిస్థితులను కాంగ్రెస్ తయారు చేయలేకపోతున్నది.”బీజేపీ దేశాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకువెళ్లింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నది. కాంగ్రెస్ ముక్త్ భారత్ మాత్రమే కాకుండా, రైతులు, దళితులు, గిరిజనుల నుంచి దేశాన్ని విముక్తం చేయడం కూడా బిజెపి లక్ష్యం” అని జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు విమర్శించారు. ఏ పార్టీనైతే ఆయన మతతత్వ పార్టీగా విమర్శించారో, ఏ పార్టీ దేశాన్ని వెనక్కు తీసుకువెళుతోందని ఆరోపించారో ఆయన అదే భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు.ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా లభించింది.

కాంగ్రెస్ పార్టీలో జ్యోతిరాదిత్య సింధియాకు తగిన ప్రాధాన్యత లభించలేదన్నది రహస్యమేమీ కాదు. జ్యోతిరాదిత్య సింధియా నాలుగు సార్లు లోక్ సభకు ఎంపికయ్యారు. విద్యుత్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. రాహుల్ గాంధీకి కుడిభుజంగా వ్యవహరించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడుగా కొనసాగారు. ప్రియాంకగాంధీతో సమానంగా ఉత్తరప్రదేశ్ లో ఆయన పార్టీ బాధ్యతలు నిర్వహించారు. అయినా ఆయన కాంగ్రెస్ ను ఎందుకు విడిచిపెట్టారన్నది పార్టీలో ఆత్మ పరిశీలన జరగవలసి ఉన్నది. ”కాంగ్రెస్ లో ఉండి దేశానికి సేవచేయలేను.నేను ఒకే చోట స్తంభించి పోదలుచుకోలేదు. ముందడుగు వేసేందుకు సమయం ఆసన్నమైంది” సోనియాకు రాసిన లేఖలో జ్యోతిరాదిత్య పేర్కొన్నారు.

హార్వర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించిన నేపథ్యం, మౌలిక స్థాయి సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన, స్వచ్ఛమైన, నిష్కళంకమైన రాజకీయ జీవితం ఉన్న జ్యోతిరాదిత్యకు దేశ రాజకీయ పరిణామాల గురించి తెలుసు. 2018లో జరిగిన మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఆయన కృషి చేశారు. రాజస్థాన్ లోనూ 45 సంవత్సరాల సచిన్ పైలట్ ను కాదని, 70 సంవత్సరాలు దాటిన అశోక్ గెహ్లాట్ ను ముఖ్యమంత్రిగా నియమించారు.

కర్ణాటకలో నేరుగా అధికారంలోకి రాలేకపోయిన బిజెపి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం ద్వారా, అధికారాన్ని హస్తగతం చేసుకోగలిగింది. అదే ప్రయోగాన్ని జ్యోతిరాదిత్య సింధియా సహకారంతో మధ్యప్రదేశ్ లో అమలు చేసింది. పార్లమెంట్లోనూ, బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బిజెపికి ఈ పరిణామాలు ఒక రకంగా కొత్త ఊపును ఇచ్చాయి. రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకోకపోయినా అధికారం హస్తగతం ఎలా చేసుకోవాలో బిజెపికి తెలిసిపోయింది.

ఇదే ప్రయోగాన్ని మహారాష్ట్రలోనూ అమలు చేయవచ్చు. యుద్ధ ప్రాతిపదికన వివిధ రాష్ట్రాల్లో, జాతీయ స్థాయిలోనూ యువతరానికి సారథ్యం అప్పగించి, దిక్కుతోచని స్థితిలో ఉన్న మైనారిటీలు, దళితులు, ఆదివాసీలకు నాయకత్వం అందించగలిగిన శక్తిని సమకూర్చుకోవాల్సి ఉన్నది. అయితే జాతీయ స్థాయిలో ‘వ్యవస్థ కుళ్లిపోయినప్పుడు’ రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగుపడుతుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

LEAVE A RESPONSE