Home » బాబుపై మరో పది రోజుల్లో ఐదు కేసులు నమోదు చేసేందుకు కుట్ర

బాబుపై మరో పది రోజుల్లో ఐదు కేసులు నమోదు చేసేందుకు కుట్ర

జగన్మోహన్ రెడ్డి పై 11 చార్జి షీట్లను దాఖలు చేసిన సిబిఐ
అందుకే… చంద్రబాబు నాయుడు పై 12 కేసులను నమోదు చేయాలన్నదే జగన్మోహన్ రెడ్డి ప్లాన్
ఇప్పటికే ఐదు కేసులు నమోదు చేయగా… ఆరవ కేసుకు ఎఫ్ఐఆర్ రెడీ అయినట్లు తెలిసింది
జగన్మోహన్ రెడ్డి, విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి లేఖ
నేను దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు… సీ బీ ఐ, జగన్మోహన్ రెడ్డి లతో పాటు మరో 14 మందికి నోటీసులు జారీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి లో నుంచి వైదొలిగి, కాంగ్రెస్ కు మద్దతునిస్తానన్న షర్మిల
సోదరి బాటలోనే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో కాంగ్రెస్ కు చేరువై… బిజెపికి దూరం అవుతారా?
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై 12 అక్రమ కేసులను నమోదు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నట్లుగా నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు పై ఐదు కేసులు నమోదు చేశారని, గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన నీరు – చెట్టు అనే పథకంలో అవకతవకలు జరిగాయని ఆరవ కేసు నమోదు చేయడానికి ఎఫ్ఐఆర్ సిద్ధం చేశారన్నారు.

అయితే ఫిర్యాదుదారుడు కోసం ప్రభుత్వ పెద్దలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఫిర్యాదుదారుడి పేరు చివర రెండక్షరాలు ఉంటాయో, లేకపోతే ఈసారి చౌదరి, యాదవ, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారితో ఏమైనా ఫిర్యాదు చేయిస్తారేమో చూడాలని ఎద్దేవా చేశారు. శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… సిబిఐ జగన్మోహన్ రెడ్డి పై 11 చార్జి షీట్లు దాఖలు చేయగా , చంద్రబాబు నాయుడు పై సిఐడి ద్వారా అంతకంటే ఒక కేసు ఎక్కువగానే నమోదు చేయించాలని పథక రచన చేస్తున్నారన్నారు. రానున్న పది రోజుల వ్యవధిలో ఇంకొక ఐదు కేసులు చంద్రబాబు నాయుడు పై నమోదు చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే ఆ కేసుల్లో ఎఫ్ ఐ ఆర్ రెడీ చేసేందుకు కసరత్తు చేస్తుండగా, ఫిర్యాదుదారులకు ఇది ఒక చక్కటి అవకాశం అంటూ అపహాస్యం చేశారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులు ఎవరన్నది త్వరలోనే తెలుస్తుంది. ఇప్పటికే ఫిర్యాదు చేసిన వారంతా ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారేనని గుర్తు చేశారు. అక్రమ కేసులలో A1 ఇతరుల పేర్లు పెట్టి, A2, A3 గా చంద్రబాబు నాయుడు పేరును చేర్చే అవకాశం ఉందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ రిపోర్ట్ క్వాష్ చేయాలని చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు నవంబర్ 7వ తేదీన తీర్పు వెలువరించనుంది. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధన వర్తిస్తుందని న్యాయస్థానం తీర్పునిస్తుందనే ఆశాభావాన్ని రఘు రామకృష్ణంరాజు వ్యక్తం చేశారు.

దీనితో చంద్రబాబు నాయుడు పై నమోదు చేసిన అక్రమ కేసులన్నీ వీగిపోతాయి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన అనుచరుడు, రాజకీయ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి ఏడవ తేదీలోగానే చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులను శరవేగంగా నమోదు చేయాలన్నారు. ఈ డకోటా ఫిర్యాదుల విచారణకు గవర్నర్ అనుమతించే అవకాశమే లేదన్నారు. దీనితో చంద్రబాబు నాయుడు పై నమోదు చేసిన కేసులన్నీ హోల్సేల్ గా కొట్టుకు పోతాయి. చంద్రబాబు నాయుడు కు షరతులతో మంజూరు చేసిన బెయిల్ తీర్పు కాపీని నేను చదివాను. చంద్రబాబు నాయుడు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరించరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇద్దరు డిఎస్పీలతో నిఘా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని తోసిపిచ్చిందనీ తెలిపారు. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా న్యాయమైన, ధర్మమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తికి రఘురామకృష్ణం రాజు అభినందనలను తెలియజేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా న్యాయమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి ని కూడా అభినందించాల్సిందేనని పరోక్షంగా ప్రభుత్వ వ్యవహార శైలిపై ఆయన తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

బెయిల్ రద్దు చేయడం కుదరకపోతే… ఆరు నెలల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి పై నమోదైన ఆర్థిక నేరాల కేసుల విచారణను పూర్తి చేయాలి
జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆయన సహా నిందితుడైన విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందరేశ్వరి గారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. వీరిపై నమోదైన ఐపిసి కేసులను, క్విడ్ ప్రోకో కేసులను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. విశాఖపట్నంలో తన కూతురి పేరిట విజయసాయిరెడ్డి కూడబెట్టిన ఆస్తులు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన సమీప బంధువు పాత్ర, దసపల్లా భూముల కబ్జా బాగోతం,ఓ రిసార్ట్ ను స్వాధీనం చేసుకొని 33 ఏళ్ల పాటు ఉన్న లీజును 99 ఏళ్లకు పొడిగించిన వైనాన్ని పూసగుచ్చినట్లు వివరించారు.

వైఎస్ వివేకానంద రెడ్డి తన సమీప బంధువుల చేతిలో హత్యకు గురి అయితే, విజయసాయిరెడ్డి ప్రజల దృష్టిని మరల్చడానికి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని చేశారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిలు చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని గత పదేళ్లుగా బెయిల్ పై బయటనే ఉన్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి, విజయ సాయి రెడ్డిల బెయిల్ రద్దు చేయడం కుదరకపోతే, వారిపై మోపిన కేసుల విచారణను ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని పురందరేశ్వరి గారు కోరారు. కేసుల విచారణ పూర్తి అయితే వారే జైలుకు వెళతారనేది పురందరేశ్వరి అభిప్రాయం కాబోలని రఘురామ కృష్ణంరాజు అన్నారు .

సుప్రీం కోర్టులో నేను దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం స్పందించి,కేసుల విచారణ ఎందుకింత ఆలస్యం అయ్యిందని సీబీఐ తో పాటు, జగన్మోహన్ రెడ్డి కి మరో 14 మందికి నోటీసులు జారీ చేసిందని తెలిపారు.. ఈ కేసును జనవరి కి కోర్టు వాయిదా వేసింది..కేంద్ర మాజీ మంత్రిగా, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందరేశ్వరి గారు రాసిన లేఖ పై సుప్రీంకోర్టు త్వరలోనే సమాధానం ఇస్తుందన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణం రాజు వ్యక్తం చేశారు. గతంలో నేను కూడా ఇదేవిధంగా సుప్రీంకోర్టుకు లేఖ రాయగా, లేఖ ద్వారా తాము ఎటువంటి చర్యలు తీసుకోలేమని, పూర్తి వివరాలతో పిటిషన్ దాఖలు చేయమని సూచించారని తెలిపారు.

బహుశా… పురందరేశ్వరి ని కూడా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ( పిల్ ) దాఖలు చేయమని న్యాయస్థానం సూచించే అవకాశాలు ఉన్నాయి. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేస్తున్నందువల్లే, తమపై ఇలా కేసులు వేస్తున్నావా ? అంటూ ఏక వచనంతో పురందరేశ్వరి గార్ని సంబోధిస్తూ విజయసాయి రెడ్డి ట్విట్ చేసి ఉంటారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. మహిళలను ఏక వచనంతో సంబోధించడాన్ని సభ్య సమాజం, మహిళా సమాజం హర్షించదన్నారు. పురందరేశ్వరి పిటిషన్ దాఖలు చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని, ఈ దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి లభిస్తుందని రఘు రామ కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు .

ఈ కేసులకు సంబంధించిన సమాచారం తన వద్ద ఉన్నదని, పురందరేశ్వరి కి ఎటువంటి సమాచారం కావాలన్నా తాను అందజేయడానికి, అండగా ఉండడానికి సిద్ధమేనని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ విషయాన్ని పురందరేశ్వరిగారిని కలిసి రహస్యంగా చెప్పవచ్చునని పేర్కొన్నారు. కానీ తన వద్ద రహస్యాలు ఏమీ ఉండవని స్పష్టం చేశారు. అందుకే మీడియా ముఖంగానే చెబుతున్నానని తెలిపారు.

కాంగ్రెస్ తరపున షర్మిల ప్రచారం చేసే ఛాన్స్
తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకుని, కాంగ్రెస్ పార్టీకి వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో, ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె పాల్గొనే ఛాన్స్ ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు . ప్రచారంలో పాల్గొంటే ఆమె ఓటర్ల పై కొంత ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని ఆమె చెప్పకపోవచ్చు. జగనన్న విడిచిన బాణం ఆంధ్ర ప్రదేశ్ కు కూడా ప్రచారానికి వచ్చే అవకాశం ఉంటుంది.

వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థానానికి ఎదిగారు. రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి తనయుడు ఒక పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన తనయకు సముచిత స్థానం ఇచ్చి, ఆమె భర్త అనిల్ ను కూడా రాష్ట్రంలోనూ ప్రచారం చేయించే అవకాశాలు లేకపోలేదు. షర్మిల, బ్రదర్ అనిల్ కు మంచి ప్రజాధరణే ఉంది. జగన్ కు అత్యంత సన్నిహితుడైన కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని పాలేరు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆయనకు జగన్మోహన్ రెడ్డి ఎన్నో కాంట్రాక్టులు కట్టబెట్టారు.

దీంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? అన్న అనుమానాలు లేకపోలేదు. అన్నయ్యకు వ్యతిరేకంగా చెల్లెలు షర్మిల పోరాడుతుందా?? అన్న రకరకాల విశ్లేషణలు సోషల్ మీడియాలో కొనసాగుతున్నాయి. బిజెపికి జగన్ మోహన్ రెడ్డి సొంత, దత్త పుత్రుడు అనే వాదనలు లేకపోలేదు. అయినా, కాంగ్రెస్ పార్టీకి ఇన్ డైరెక్టుగా జగన్మోహన్ రెడ్డి మద్దతు పలుకుతున్నారా? అన్న మిలియన్ డాలర్ల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని షర్మిల విలీనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన షర్మిల ప్రచారం నిర్వహించకుండా ఉంటుందా?

జగన్మోహన్ రెడ్డి బిజెపికి దూరం జరిగి కాంగ్రెస్ కు చేరువ అవుతారా??, ఇన్ని కేసులను పెట్టుకుని బిజెపిని కాదని కాంగ్రెస్ కు చేరువ అయితే బిజెపి చూస్తూ ఊరుకుంటుందా?, భవిష్యత్తులో బిజెపి అధికారంలోకి రాదని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారా? అంటూ శరపరంపరంగా రఘురామ కృష్ణంరాజు ప్రశ్నాస్త్రాలను సంధించారు. రాష్ట్ర ప్రజల డబ్బులతో ఇస్తున్న వైయస్సార్ పురస్కారాల పంపిణీకి వైకాపా గౌరవాధ్యక్షురాలుగా రాజీనామా చేసి, వైయస్సార్ టిపి గౌరవాధ్యక్షురాలుగా కొనసాగుతున్న విజయమ్మ హాజరు కావడం దేనికి సంకేతం?

ఇదేమి కుటుంబ కార్యక్రమం కాదు… అయినా ఆమె ముఖ్యఅతిథిగా ఎందుకు హాజరయ్యారు. ఒకటవ తేదీన విజయమ్మ తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుంటే, మూడవ తేదీన వైయస్ షర్మిల ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నానని పేర్కొనడం వెనుక ఆంతర్యం ఏమిటి?, ఈ సందిగ్ధతకు ఎవరు సమాధానం చెబుతారు. కాంగ్రెస్ పార్టీకి షర్మిల సంపూర్ణ మద్దతును ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజకీయ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేసిందనే దానికంటే, ఆయనకు బెయిల్ రావడానికి ఎంతగా సహకరించిందో అందరికీ తెలుసు. సోనియా గాంధీని కలిసి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎంతగా ప్రాధేయపడ్డారో, ఆమె కనికరించి బెయిల్ రావడానికి ఎంతగా సహకరించారో ప్రజలు మరిచిపోయారని అనుకుంటే పొరపాటేనని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు .

Leave a Reply