Suryaa.co.in

Editorial

చెబితే వింటివ గురూ.. గురూ!

– జగన్ సర్కారుపై కాంట్రాక్టర్ల జంగ్
– పాత బిల్లులివ్వకపోతే కొత్త పనులు చేయమంటున్న కాంట్రాక్టర్లు
– 80 వేల కోట్ల బకాయిలు తీర్చేదెలా?
– హైకోర్టు తీర్పులతో జగనన్న సర్కారుకు హైటెన్షన్
(మార్తి సుబ్రహ్మణ్యం)
‘పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడ్ని పోచమ్మ కొట్టింద’న్నది తెలంగాణలో ఓ సామెత. ఇప్పుడు ఆ సామెత ఆంధ్రా జనాలకూ చేరింది. జగనన్న సర్కారు తనకు నచ్చని వారికి చుక్కలు చూపిస్తుంటే.. కోర్టులు జగనన్న సర్కారుకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజుకో కొరడా దెబ్బలతో సర్కారు వీపు విమానం మోత మోగుతోంది. కాంట్రాక్టర్లకు బిల్లులివ్వాలన్న ఆదేశం అందులో ఒకటి మాత్రమే. ఎవరైనా ఒక తప్పు జరిగితే సరిదిద్దుకుంటారు. అది మరోసారి జరగకుండా చూసుకుంటారు. అదే ప్రభుత్వమయితే ఒళ్లు జాగ్రత్త పెట్టుకుని ఇంకోసారి పొరపాటు జరగకుండా చూసుకుంటుంది. కానీ ఏపీలో అలాంటి పొరపాట్లే అలవాటుగా మారిన వైచిత్రి. ఎవరు చెప్పినా.. ఎన్ని వ్యతిరేక తీర్పులొచ్చినా మారని ధిక్కార ధోరణి. ‘అతనికి తెలియదు. చెబితే వినడు. గిచ్చితే ఏడుస్తాడని’ వెనకటి కాలం నుంచి ఓ జోకు వినిపించేది. ఇప్పుడు ఆంధ్రాలో ఆ జోకు గ్రామాలకూ చేరింది.
ఆంధ్రాలో జగనన్న సర్కారు ఆడకత్తెరలో చిక్కుకుంది. టీడీపీ హయాంలో పని చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులివ్వకుండా ఆపేసిన జగన్ సర్కారుపై, ఇప్పుడు కాంట్రాక్టర్లు యుద్ధం ప్రకటించేశారు. పాత బిల్లులివ్వాలని ఏకంగా రోడ్డెక్కారు. ఒకటి కాదు. రెండు కాదు. ఏకంగా 80 వేల కోట్ల రూపాయల బిల్లులకు బొక్క పెట్టిన జగనన్నను, దారికితెచ్చేందుకు కాంట్రాక్టర్లు ఏకమయ్యారు. పాత బిల్లులు ఇవ్వకపోతే ఇకపై ఎవరూ కొత్త పనులు చేసేది లేదని భీష్మించారు. దీనితో జగనన్న సర్కారు చిక్కుల్లో పడింది.
ఒకవైపు రాష్ట్రంలో గుంతలు పడని రహదారులు లేవు. మధ్యలో నిలిచిపోయిన పనులకు లెక్కలేదు. ఒక్క శాఖ అని కాదు. దాదాపు ప్రభుత్వ శాఖలన్నీ కాంట్రాక్టర్లకు బకాయిలు పడ్డాయి. చివరాఖరకు పంచాయితీ ఆఫీసులకు సొంత డబ్బులతో రంగులు వేయించిన పంచాయితీ కార్యదర్శులు కూడా ఇప్పుడు జగనన్న సర్కారు మెడపై బిల్లుల కత్తి పెట్టేశారు. ఈవిధంగా బిల్లులు రాని కాంట్రాక్టర్లంతా ఒక్కొక్కరు రోడ్డుపైకొస్తున్నారు.
మరోవైపు వచ్చే నెలలోగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంతోపాటు.. అందరికీ బిల్లులు చెల్లించినట్లు అఫిడవిట్ ఇవ్వాలని హైకోర్టు విదిలించిన తీర్పు కొరడాతో, జగన్ సర్కారు వీపుపై నిలువెల్లా గాయాలయ్యాయి. ఇక ఒక్కో శాఖకు చెందిన కాంట్రాక్టర్లు కూడా కోర్టుకెక్కితే, పాలకులు చుక్కలు తప్పవు. ఏం చేస్తాం. చేసుకున్న వారికి చేసుకున్నంత!చెరపకురా చెడేవు అన్నది పెద్దలు చెప్పిన సామెత. ఇప్పుడు జగన్ సర్కారు విషయంలో అదే జరుగుతోంది.గత ప్రభుత్వ హయాంలో పనులు చేశారన్న కసితో, ఆ బిల్లులను ఆపేసిన సర్కారు ఆనందం.. టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లను ఆర్ధికంగా నష్టపరిచామన్న ఉత్సాహం.. రెండున్నరేళ్లకే కరిగిపోయింది. పాలకులు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, కోర్టులంటూ ఒకటున్నాయి కదా? నిజానికిదో విచిత్ర పోకడ. ఇన్ని దశాబ్దాల్లో ఈ తరహా పాలన ఎవరూ చేసి ఉండరన్నది అనుభవజ్ఞుల మాట. టీడీపీ ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన వైఎస్ ప్రభుత్వం గానీ, ఆ తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు గానీ ఇలాంటి మతిలేని నిర్ణయాలు తీసుకోలేదు.
పాలకులు వస్తుంటారు. పోతుంటారు. ప్రభుత్వం ఏది ఉన్నా కాంట్రాక్టర్లకు పనులు చేయక తప్పదు. ఎవరికో ఒకరికి పనులు అప్పచెప్పక తప్పదు. అఫ్‌కోర్స్.. అందులో పాలకపార్టీలకు చెందిన కాంట్రాక్టులే ఎక్కువమంది ఉంటారు. అది ఎక్కడయినా, ఎప్పుడయినా జరిగేదే. కావాలంటే ఆ పనులపై అప్పుడే విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసే అవకాశం అందరికీ ఉంటుంది. నిజంగా ఆ పనుల్లో అవకతవకలు జరిగితే బిల్లులు ఆపేయవచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్ల తర్వాత, విచారణ జరుగుతోందని స్వయంగా కోర్టుకే అబద్ధాలు చెప్పడం తెంపరితనమే. దానికి చాలా గుండెలు కావాలి. అలాంటి గుండెలున్న ‘గుండెలుతీసని బంట్లు’ చాలామంది ఉన్నట్లు కోర్టు వ్యాఖ్యలతో తేలింది. చివరాఖరకు అసలు విచారణ జరగడం లేదని సీఎస్ చెప్పడంతో, జగనన్న సర్కారు అసలు మోసం బయటపడింది.
ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినప్పుడు, అబద్ధాలు చెప్పడంలో తప్పులేదని పెద్దలు చెబుతుంటారు. కానీ ఏపీలో సర్కారుకు అబద్ధాలు చెప్పడమే ఒక అలవాటుగా మారడం దురదృష్టం. మామూలుగా అయితే ‘అబద్ధమే నీ బతుకయిపోయిందని’ నిందిస్తుంటాం. ఇప్పుడు దానికీ, దీనికీ పెద్ద తేడా కనిపించడం లేదన్నది విజ్ఞుల వ్యాఖ్య. పాత సర్కారులో చేసిన పనులను నిలిపివేసిన జగన్ సర్కారు.. మరి పాత సర్కారులోని అధికారులను ఎందుకు కొనసాగిస్తోంది? పాత సచివాలయం, పాత శాసనసభ, పాత ప్రభుత్వ భవ నాలనే ఎందుకు కొనసాగిస్తోంది? మంత్రులు, అధికారుల క్వార్టర్లు, స్టేట్‌గెస్ట్‌హౌస్, డీజీపీ ఆఫీసునే ఎందుకు కొనసాగిస్తోంది? పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో వచ్చే ఆదాయాన్ని ఎలా పొందుతుంది? ఇవీ.. బుర్ర బుద్ధీ ఉన్న ఎవరికయినా వచ్చే సందేహాలు!

LEAVE A RESPONSE