మహాప్రళయసాక్షిణీ

మహాప్రళయం సంభవించినప్పుడు జగత్తులోని జీవరాశి అంతా లయమైపోతుంది. లోకంలోని జీవరాశితో పాటుగా మిగిలినవారు కూడా లయం అయిపోతారు. అంటే గతంలో చెప్పినట్లుగా దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య గణాలన్నీ నాశనమయిపోతాయి. వీరందరికీ దైవత్వము, గంధర్వత్వము అనేవి గతజన్మలో చేసినటువంటి పుణ్యఫలంవల్ల వచ్చినవే. కల్పాంతం దాకా బ్రహ్మ తన పదవిలో ఉంటాడు. కల్పాంతాన ఆ పరబ్రహ్మలో లీనమైపోతాడు. ఇప్పటిదాకా తొమ్మిదిమంది బ్రహ్మలు ఉన్నారు. వారే నవబ్రహ్మలు. వారు
1. భృగువు
2. పులస్త్యుడు
3. పులహుడు
4. అంగిరసుడు
5. అత్రి
6. క్రతువు
7. దక్షుడు
8. వసిష్ఠుడు
9. మరీచి
అలాగే ఇంద్రపదవి కూడా. నూరు అశ్వమేధాలు చేసినవాడు ఇంద్రుడవుతాడు.
ఉత్తమ మనువు కాలంలో సుశాంతుడనేవాడు ఇంద్రుడు
రైవత మన్వంతరంలో విభుడనేవాడు ఇంద్రుడు
చాక్షుషమన్వతరంలో మనోజవుడు ఇంద్రుడు
ఇతనికే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఆ సమయంలో నూరు అశ్వమేధాలు చేసిన నహుషుణ్ణి ఇంద్రుడి స్థానంలో కూర్చుండబెట్టారు.
కాత్యాయనీ విద్యను ఉపాసన చేస్తే విష్ణుత్వం సిద్ధిస్తుంది. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతుడితో” అగ్నిచయనం చేసినవారు శాశ్వతంగా స్వర్గలోకం పొందుతారు. అంతేకాని వారికి మోక్షం రాదు. ఈ విషయం తెలిసి కూడా నేను అగ్నిచయనం చేసి ఈ పదవిలో ఉన్నాను.” అంటాడు. ఈ రకంగా పైన చెప్పిన పదవులన్నీ జీవులు చేసిన పుణ్యకర్మలవల్ల వచ్చినవే. కాబట్టి వారి కర్మఫలం క్షయంకాగానే ప్రళయం సంభవిస్తుంది. ఆ మహాప్రళయానికి ఏకైక సాక్షి ఆ పరమేశ్వరియే అప్పుడు ఉండేది
చిత్కలారూపమైన ఆమె తప్ప ఇంకెవరూ కాదు. అందుకే పంచదశిస్తవంలో
కల్పోపసంహరణ కల్పితతాండవస్య
దేవస్య ఖండపరశోః పరభైరవస్య |
పాశాంకుశిక్ష వశరాసన పుష్పబాణా
సా సాక్షిణీ విజయతే తవ మూర్తి రేకా ||
కల్పాంతంలో చేయబడిన శివతాండవానికి పాశము అంకుశము,
ధనుర్బాణాలు ధరించిన పరమేశ్వరియే సాక్షి.

Leave a Reply