ఉద్యమానికి ఊపిర్లు నింపిన సి.వి. ఒక సమరశీల కల౦ యోధుడు!

సరిగా మూడు సంవత్సరాల క్రితం మన నుండి భౌతికంగా సి.వి. ( చిత్తజల్లు వరహాల రావు ) దూరమయిన వారంలోగా ప్రజాశక్తి బుక్ హౌస్ వారు మన తరం ప్రజాస్వరం’ గా ఆయనపై ఒక గొప్ప జ్ఞాపికను (15-11-2017 నాడు) వెలువరించారు. ఆయన రచనలన్నిటినీ 24 సంపుటాలుగా ఒకేరోజు ( 2015 జూన్ 28 ) న ఆవిష్కరించటమే కాక ఒక అపూర్వ పౌర సన్మానాన్ని సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సంస్థలు అనేకం కలిసి విజయవాడలో నేను కన్వీనర్ గా నిర్వహించాము .

ఆ రోజుని నిప్పుకి నివురు తొలుగుతున్న వేళగా అభివర్ణిస్తూ ఆ సభలోనే సమరశీల కల౦ యోధుడు సి.వి. అనే సి.వి. రచనలపై విశ్లేషణాత్మక గ్రంధాన్ని జనసాహితి తమ ప్రజాసాహితి మాస పత్రికలో సివిపై వెలువడిన రచనలన్నిటినీ కలిపి ప్రచురించిన 240 పుటల పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు . మొదటి వర్ధంతికి (8-11-2018) ఆయనపై ప్రసంగాలను ఇప్పించారు. (2019 )రెండవ వర్ధంతికి 1975లో సివి రచించిన, కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్యగారు పుస్తకం ప్రచురణ దశలో వుండగానే ప్రజాశక్తిలో సమీక్ష రాసిన, 500 పేజీల మహా కావ్యం పారిస్ కమ్యూన్ పై వెలువడిన సమీక్షలనన్నిటినీ కలిపి ఒక ‘ఇ-బుక్ ‘ను జనసాహితి తెచ్చింది. కరోనా నడిమధ్యన సి.వి. నేటికీ అవసరమంటూ మూడవ వర్ధంతి వచ్చింది.

దేశాన్ని అమావాస్య ఆవహించింది
అధికారం అవినీతికి దారితీసింది
హద్దూపద్దూలేని నిరంకుశాధికారం అంతూపంతూ లేని అవినీతికి మార్గం వేసింది
ఈ మాటలు నేటివేనని అనుకునేట్లున్నా, సరిగా 55 ఏళ్ల క్రితపు విషాదభారతం కావ్యంలోనివని తెలిస్తేగానీ ‘ సివి ’ దార్శనికత మనను అబ్బురపరచదు.

మధ్య యుగాల్లోకి మళ్ళీ వెళ్ళి మనం జీవిస్తున్నామా – అనేంతటి తీవ్రమైన సందేహం నేడు కలుగుతోంది. అని కూడా ఆధునిక యుగంలో కుల వ్యవస్థ లో (రచన 1980) ఆయన రాశారు. రానున్న ప్రమాదాన్ని ఎంత ముందుగా కనుగొని హెచ్చరించాడా అనిపించే మాటలవి!

మార్క్సిస్ట్ థియరీని వ్యక్తి భౌతిక అస్థిత్వానికే ‘పరిమితం’ చెయ్యటం తెలివితక్కువతనమే కాదు, నీచం కూడా. ‘ఎకనామిక్ డిటర్మినిజమ్’ అనే చెత్త విమర్శకి మార్క్సిస్ట్ థియరీ కచ్ఛితంగా నోచుకోదు. మార్క్సిస్ట్ తత్వం వ్యక్తి భౌతిక అస్తిత్వానికే పరిమితమై లేదు. దాన్ని మించి చాలావుంది. అది మన జీవితాన్ని చూస్తుంది; మనం ఎలా బతుకుతున్నామో గమనిస్తుంది.

మనం ఏం ఉత్పత్తి చేస్తున్నామో, దేంతో ఉత్పత్తి చేస్తున్నామో, దాని ఎడ మన వైఖరేంటో, ఉత్పత్తి పంపిణీల్లో మన సామాజిక అవగాహనేంటో, ఆ క్రమం‌లో మనుషుల మధ్య సామాజిక, సాంస్కృతిక, మానసిక అంశాలు ఎలా ముడిపడి వున్నాయో – అంటే యివన్నీ ఆర్ధికాన్ని (ఎకానమీని) ఏ విధంగా రాజకీయం చేస్తుందీ… అంతేగాక ఉత్పత్తిలో జోక్యం, కార్మిక విభజన (డివిజన్ ఆఫ్ లేబర్), ఆస్తి రూపాలు (తెగల, పురాతన, భూస్వామ్య లాంటివి) వీటిని పై కాల, భౌగోళిక, సాంకేతిక మార్పులు ఎలా శక్తివంతంగా పని చేస్తాయో రాజకీయ ఆర్ధికం (మార్క్సిస్ట్ పొలిటికల్ ఎకానామీ – మార్క్సిస్ట్ తత్వం) నొక్కి చెప్తుంది.

అందుకే మార్క్సిజాన్ని , సమాజాన్ని, చరిత్రని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సి. వి. 2015 లో శాంతిశ్రీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనదేశంలో రాజకీయ మార్పుకి సమాంతరంగా సాంస్కృతిక మార్పు అవసరమని మార్క్సిస్టులు గుర్తుంచుకోవాలి అంటాడు. ఒక విధంగా మమేకమైన ఈ రెండు విషయాల్ని నొక్కి చెప్పవలసి వచ్చిందంటే సివికి మార్క్సిస్టు ఉద్యమాలపై గల అస౦తృప్తికి ఒక వ్యక్తీకరణ అనుకోవాలి.
ఇదే విషయాన్ని సి.వి. 17-6-2015న ప్రజాసాహితికి జేజేలు అంటూ రాసిన తన చివరి వీలునామా లాంటి లేఖలో మరింత స్పష్టంగా ఇలా చెప్తారు.

కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఒకసారి, మతతత్వంపై మరోసారి, దున్నేవానికేభూమికి, రాజ్యాధికారానికీ వేరొకసారి … ఇలా ఉద్యమాలు పోరాటాలు వేటికవి విడివిడిగా ఉండవేమోనని నేననుకుంటున్నాను. తెలుగు వారికి లభించిన అరుదైన ప్రజారచయిత సి.వి. యుగయుగాల భారత శ్రామిక వర్గ చరిత్రయే దళిత చరిత్ర అంటూ నిర్ధారించకలిగిన రాజకీయ అవగాహన సి.వి. కుంది. మనుస్మృతి అమల్లోకొచ్చి నేటికి 2 వేల సంవత్సరాలు దాటిపోయింది. అయినా మన మానసిక, సాంస్కృతిక, సాహితీ, సాంఘిక రంగాల్లో ఈ స్మృతి ప్రభావం విరగడకాని పీడలా, భయంకరమైన నీడలా మనల్ని నేటికీ వెన్నాడుతూనే వుంది’ అని సి.వి. మనుధర్మశాస్త్రం శూద్ర దళిత బానిసత్వం లో వాపోతూ ఇండియాలోని ఏడు లక్షల మాలపల్లెల్లో ఈ మనుస్మృతి గురించి విశ్లేషించండి అని చెప్తారు.

ఇది అవసరం. ఆయన ‘ఆధునిక యుగం‌లో కుల వ్యవస్థ‌’ లో వైజ్ఞానిక దృష్టికి బదులు అంధమత విశ్వాసం, హేతుబద్ధమైన ఆచరణకి బదులు నిర్జీవ కర్మకాండ, మానవ సహజమైన జిజ్ఞాసకి బదులు గొర్రెదాటుడుతత్వం, భావస్వాతంత్ర్య రాహిత్యం, అవినీతి, నైతిక విశృంఖలత్వం దేశం‌లో పైశాచిక తాండవం చేస్తున్నాయి. అని అద్దాన్ని చూపిస్తాడు.

అంతే కాకుండా కుల వ్యవస్థ పుట్టుకను దాని కొనసాగింపునీ ఇలా విప్పి చెపుతాడు.
వర్ణ వ్యవస్థ (ఆధునిక కులవ్యవస్థ ) కేవలం వృత్తి ఆధారంగా నిర్ణయించ బడింది. పురాతన కాలంలో కుటుంబ వృత్తినే అన్ని తరాలు అనుసరించటం వలన అది వారిని అదే వర్గంలో ఉండేలా చేసింది. కానీ మధ్య యుగాలు , ఆధునిక యుగంలో ఆయా కుటుంబాలలో పుట్టడమనేది ఆయా కులాలను నిర్ధారిస్తుంది
ఈ మాటలు కూడా 40 యేళ్ళ క్రితపు ఆధునిక కులవ్యవస్థ లో సివి రాశారు.

విజ్ఞానం, విప్లవస్ఫూర్తి, సద్విమర్శ, సృజనాత్మక భావప్రకటన, రచనాపటిమ ఒక్కరిలో కలబోసి ఉండటం అరుదు. అవన్నీ సి.వి. లో ఉన్నాయి. ఆయన రచనలన్నింటికి ఓ సుదీర్ఘ వివరణాత్మక ఆవిష్కరణ ఉంటుంది. ఏ బెర్నార్డ్‌షాలోనో కనిపించే విషయ పరిజ్ఞానంతో కూడిన (సృజనాత్మక రచనకి) ముందు మాట వివరణ సి.వి.లో కూడా కనిపిస్తుంది. గతితార్కికంగా చరిత్రని చూడటం, అస్తిత్వ సమస్యల్ని ఆకళింపు చేసుకోవటం, శ్రమైక జీవన పరిశీలన, విప్లవ కార్యాచరణని రేపటి ఆశావహంతో దర్శించటం, అలారాయటానికి కారణం అని నేను అనుకుంటున్నాను. అందువల్లనే సి.వి. రచనల్లో తడబాటు ఏ కోశానా ఉండదు. తీవ్రత ఉంటుంది.

నా ఉద్దేశ్యం‌లో కులం గురించిగాని, మతాన్ని గురించిగాని, ప్రజా పోరాటాల గురించి గాని సి.వి. రాసిన అన్ని రచనల్లో వుండే వాడితనం, వేడితనం దిగంబర సాహిత్యం‌లోగాని, విప్లవ సాహిత్యం‌లోని కొన్ని రచనల్లో మాత్రమే దొరుకుతుంది.
విస్మరణకు గురైన చారిత్రాత్మక కవి రచయిత సి.వి. అని దివికుమార్‌ బాధపడ్డారు. అందుకు చాలా ఉదాహరణలు ఆయన వ్యాసం‌లో యిచ్చారు. సివిని విస్మరించడంపై దివికుమార్ అలాగని రాసిన సరిగా ఆరు నెలలకు సివిపై కమ్మిన నివురు తొలగటం ఆశ్చర్యకరమైన వాస్తవం!

అలానే కవిగా, రచయితగా గొప్ప సాహితీవేత్తగా రావలసినంత ప్రసిధ్ధి సి.వి. గారికి రాలేదు అని ప్రొఫెసర్ ఇనాక్‌గారు అన్నారు. అది నిజం. ఎందువల్లనంటే రచనకంటే స్వోత్కర్షలకి, పరిజ్ఞానం కంటే స్వప్రకటనలకి ప్రాధాన్యం యిచ్చే మన తెలుగు సాహితీ రంగం తీరు లోపంగానే దాన్ని భావించాలి.
కానీ సి.వి., వ్యక్తి ప్రాధాన్యతకి ఏ మాత్రం సందు యివ్వని తత్వజ్ఞానం నుంచి వచ్చినవాడు. తనకంటే ప్రజా చైతన్యం కలిగించే భావ ప్రకటన, సామాజిక జ్ఞానం‌కి మాత్రమే ప్రాధాన్యత యిచ్చిన వాడు. కనుకనే మహా విజ్ఞాన సర్వస్వమైన దాదాపు తన 26 పుస్తకాలపై తన్ను తాను రెండు పొడి అక్షరాలకు కుదించుకున్న గొప్ప రచయిత ‘ సి.వి.

ఆకలి, అసమానతలు , అభద్రత, అసంతృప్తి వీటితో సంక్షోభాల వెంట సాగి సాగి పెట్టుబడిదారీ విధానాలు బుడగల్లా పేలిపోవడాలు చాలాసార్లు జరిగే పనే.
ప్రపంచం‌లో యివి దశాబ్దానికి ఒకసారికి మించి జరగటం మనకి తెలీకపోతే మనకి కళ్ళులేవనే! పెట్టుబడి ఊసరవల్లిలా రంగులు మార్చుకుంటుంది. ఎన్నికలు, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వీటి వెనుక దాక్కుని ఊపిర్లు పోసుకుంటుంది. అబద్ధం, అవినీతులను ఆసరాచేసుకుంటుంది. నాటి వ్యాస భారతం పద్దెనిమిది పర్వాలు – నేటి విషాద భారతం ఎనిమిది పర్వాలే! అంటూ తన విషాద భారతం కావ్యం‌లో అధికారం ఎలా అవినీతికి దోవతీసిందీ, ప్రజాసేవకులు దేశద్రోహులుగా ఎలా పరిగణింప బడుతున్నారో, స్వరాజ్యలక్ష్మి భూసంస్కరణల శిశువును ఎందుకు కనదో సి.వి. అడుగుతాడు. 55 ఏళ్ళ క్రితం సి.వి. రాసిన ఈ కావ్య వస్తువు ఈ నాటికి ఎలా అన్వయింప బడుతుందో ఇంకెంత కాలమీ భారత విషాదం! అని దివికుమార్ ఆగ్రహిస్తారు.

ఆధునిక ప్రజాస్వామ్య మొక `పొద్దు తిరుగుడు పువ్వు అని చెప్పిన సి.వి. ఒక కార్యకారణ జ్ఞానం, ఒక చైతన్య వ్యవస్థ, ఒక ఉద్యమం.
చారిత్రక వాస్తవాన్ని వక్రీకరించకుండా కవిత్వం రాయడం. అందులో వచన కవిత్వం రాయడం, కత్తిమీద సాములాంటి శిక్ష అన్న సి.వి. తన మహాకావ్యం `పారిస్ కమ్యూన్’ లో బూర్జువా న్యాయ స్థానం విధించే ఏ శిక్షకైనా సిధ్ధం అంటూ ఒక కార్మిక వీరనారి చెప్పే మాటలు ఉద్యమకారుల మాటలు కావాలి.
నేడు మేం ఓడిపోయాం.
రేపు మాదే విజయం.
మేం రేపు గెలుస్తాం. ముమ్మాటికీ మాదే భవితం
అలాంటి ఆత్మ విశ్వాసానికి ఒక ఆలోచననూ, ధిక్కారతత్వానికి ఒక అవగాహననూ, భవిష్యత్తుపై ఆశను నిలిపే విస్పష్టమయిన దార్శనికతనూ మనకిచ్చేవి సివి రచనలు! ఆయనను మరింత అధ్యయనం చేద్దాం!!

C-Uma-Maheswara-Rao
సి.ఉమా మహేశ్వర రావు, తెలుగు సినీ దర్శకులు

Leave a Reply