Suryaa.co.in

Andhra Pradesh

దళితులు ఎప్పటికీ జగన్‌ ను క్షమించరు

బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ఆర్‌.డి.విల్సన్‌

కావలి: దళితులకు చెందిన నిధులు పక్కదారి పట్టించి సీఎం జగన్‌ వెన్నుపోటు పొడిచారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ఆర్‌.డి.విల్సన్‌ విమర్శించారు. శనివారం కావలి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే నిధులను ఆయా వర్గాలకు దూరం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ అని విమర్శించారు. దళిత కార్పొరేషన్‌లో జగన్‌ రద్దు చేసిన 26 పథకాలు తిరిగి పునరుద్ధరించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారు. డాక్టర్‌ సుధాకర్‌చావుకు కారణమైన జగన్‌ను, దళితుడైన సుబ్రహ్మణ్యంను హత్య చేసిన అనంతబాబును పక్కన పెట్టుకున్నందుకు దళితులు ఎప్పటికీ ఆయనను క్షమించరని అన్నారు. వైసీపీ లోని దళిత నేతలు బయటకు వచ్చి ఆత్మ గౌరవం కాపాడుకోవాలని సూచించారు. మద్యం, ఇసుక, మైనింగ్‌ పేరుతో రాష్ట్రాన్ని జగన్‌ లూఠీ చేశాడని దుయ్యబట్టారు.

అదే దారిలో కావలి లోని వైసీపీ నేతలు సహజ వనరులు లూఠీ చేసి కోట్లకు పడగలెత్తారని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను విచ్చిన్నం చేయడానికి కుట్రపనిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని, ఇంటెలిజెన్స్‌ అధికారి రామాంజనేయులును ఉద్యోగ బాధ్యతలు నుంచి వెంటనే తప్పించాలన్నారు మరో 16 మంది ఎస్పీ స్థాయి అధికారులను కూడా తప్పించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్‌ కుమార్‌ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, ఆయన అనుచరులు కావలిలోని సహజ వనరులను దోచుకున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో కావలి బీజేపీ కన్వీనర్‌ సి.వి.సి.సత్యం, బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచర్ల మురళీ, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బ్రహ్మానందం, పట్టణ జనరల్‌ సెక్రటరీ మందా కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE