Suryaa.co.in

Political News

దశాబ్ది జోష్‌

-ఉద్యమ జ్ఞాపకాలను నెమరేసిన ఆవిర్భావ ఉత్సవాలు
-21రోజుల పాటు అట్టహాసంగా జరిగిన కార్యక్రమాలు
-ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో విజయవంతం
-ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు
-తెలంగాణ సాధించిన ప్రగతిపై జోరుగా చర్చ
-అమరుల స్మరణతో పరిసమాప్తం
-వారి ఆకాంక్షలు నెరవేరేలా రాష్ట్ర సర్కారు పాలన
(లక్ష్మీశ్రీనివాస్‌)

పోరాటాలు, ఆత్మబలిదానాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ, తొమ్మిదేళ్లు పూర్తిచేసుకొని పదో ఏట అడుగుపెట్టిన సందర్భాన్ని, అనతి కాలంలోనే సాధించిన విజయాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆవిర్భావ సంబురాలు గులాబీ శ్రేణులు, అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. జూన్‌ 2న అవతరణ వేడుకలతో మొదలై.. 22న అమరుల సంస్మరణతో సంపూర్ణమై ఆద్యంతం ఉద్యమ జ్ఞాపకాలను నెమరేశాయి.

పండుగలా జరిగిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు సర్వత్రా తెలంగాణ సాధించిన ప్రగతిపై చర్చించుకోవడం కనిపించింది. మలిదశ పోరులో వివిధ రూపాల్లో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాన్ని గుర్తుచేసుకుంటూ నెత్తిన బోనాలు, బతుకమ్మలతో ప్రజలు తరలిరావడం నాటి స్ఫూర్తిని చాటింది. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతమయ్యాయి.

జూన్‌ 2న మొదలైన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, 22న అమరుల సంస్మరణతో సంపూర్ణమయ్యాయి. అరు దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిన రోజును గుర్తు చేసుకుంటూ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో సాగిన పోరాటం ద్వారా రాష్ట్రం సిద్ధించి, తొమ్మిదేళ్లు పూర్తయి, పదో ఏట అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించి, ఆ మేరకు భారీ ఏర్పాట్లు చేసి కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చేసింది.

21 రోజులపాటు సాగిన సంబురాల్లో అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణకోసం జరిగిన మలిదశ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ, రాష్ట్రం సిద్ధించిన తర్వాత సాధించిన ప్రగతిని కొనియాడుతూ ఆటపాటలతో ఉత్సవాలను సక్సెస్‌ చేశారు.

సొంతరాష్ట్రం ఉంటే అభివృద్ధి ఎంత బాగుంటుందో ఉద్యమం సందర్భంగా కేసీఆర్‌ చెప్పిన మాటలను, అవి నిజమైన తీరును నెమరేసుకున్నారు. రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాల తీరును, పాల్గొన్న వారి పటిమను యాది చేసుకున్నారు.

అన్ని వర్గాల వారు భాగస్వాములై రైతు దినోత్సవం, మహిళా దినోత్సవం, గిరిజన దినోత్సవం, సంక్షేమం, చెరువుల పండగ, మంచినీళ్ల పండగ, సాగునీరు, కరెంటు, పారిశ్రామిక ప్రగతి, సురక్ష, సుపరిపాలన, వైద్యం, విద్య, హరితం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఆధ్యాత్మిక దినోత్సవాలను పండుగలా జరుపుకొన్నారు. వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత కరంటు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా, మహిళా సంక్షేమం, ప్రాజెక్టుల ద్వారా అందుతున్న సాగునీరు, మిషన్‌ భగీరథ, మెరుగైన విద్య, వైద్యంపై చర్చించుకున్నారు.

పల్లెపల్లెలో కలిసికట్టుగా..
దశాబ్ది ఉత్సవాలను పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా కలిసికట్టుగా విజయవంతం చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

కాళేశ్వరం, దేవాదుల, తుపాకులగూడెం, ఎస్సారెస్పీ పునర్జీవం ప్రాజెక్టుతో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుండడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సాగుకు నిరంతరం కరంటు సరఫరా అవుతుండడంతో పంటలు పుష్కలంగా పండుతున్నాయని, ప్రభుత్వమే సొంత ఊరిలో పంట కొనుగోలు చేస్తూ భరోసా కల్పిస్తున్నదని చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శిగా ఉన్నదని కొనియాడారు.

ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌ వంటివి దేశంలోనే ఎక్కడా లేవని, దివ్యాంగులకు ఆసరా పెన్షన్‌ మరో వెయ్యి రూపాయలు పెంచడం గొప్ప నిర్ణయమని కితాబునిచ్చారు. చేపలు, గొర్రెల పంపిణీ, దళితబంధు, బీసీ వర్గాలకు ఆర్థిక సాయం వంటి పథకాలతో చేతి, కుల వృత్తులవారికి, పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని భరోసా వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాలు విజయవంతం కావడంతో ముఖ్యంగా పార్టీ శ్రేణులు, అభిమానుల్లో నూతనోత్సాహం నిండింది.

LEAVE A RESPONSE