Suryaa.co.in

Andhra Pradesh

ఈనాడు, ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా

– 8 గంటల సమయం ఇచ్చి, క్షమాపణ చెప్పాలని కోరుతా
– వారు ఆ పని చేయకపోతే, రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా
– అమెరికాలో నమోదైన డాక్యుమెంట్‌లో ఎక్కడా నా పేరు లేదు
– సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్‌ల మధ్య ఒప్పందం. మధ్యలో దళారి లేడు
– అది సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్‌ల మధ్య జరిగిన ఒప్పందం
– దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా ముందే ఇచ్చింది
– యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: అమెరికాలో నమోదైన డాక్యుమెంట్‌లో ఎక్కడా నా పేరు లేదు. కావాలంటే చూడండి. ఇక్కడ పత్రికల్లో నా పేరు రాసిన వాళ్లనే అడగండి. సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్‌ల మధ్య ఒప్పందం. మధ్యలో దళారి లేడు. అలాంటప్పుడు అవినీతికి అవకాశం ఎక్కడ? వాణిజ్యవేత్తలు పాలకులను కలవడం కొత్త కాదు. అన్ని చోట్లా జరుగుతుంది. నన్ను అదానీ కలవడం కొత్త కాదు. ఆయన నన్ను చాలాసార్లు కలిశారు. సెకీతో ఒప్పందానికి ముందు, తర్వాత కూడా కలిశారు. ఆయన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారు. అందుకే కలిశారు. ఆ భేటీకి వేరే ప్రత్యేకత లేదు. నిజానికి సెకీ మాకే కాకుండా, వేరే రాష్ట్రాలకు కూడా రాసి ఉండొచ్చు. వారు స్పందించకపోయి ఉండొచ్చు. కానీ, మేము స్పందించాం.

రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎలా విప్లవాత్మక అడుగులు పడ్డాయి. ఇప్పుడు అవిఎలా వెనక్కు వెళ్తున్నాయో చెబుతాను. రాష్ట్రంలో ఈరోజు చాలా బాధాకరమైన పరిస్థితులు. ఒక బడ్జెట్‌ ప్రవేశపెట్టడం. దాని ద్వారా కాన్ఫిడెన్స్‌ ఇవ్వడం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు.. ఇవేవీ కనిపించడం లేదు. సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్‌ లేదు. యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన. రెడ్‌బుక్‌ పాలన కొనసాగుతోంది. ప్రతి చోటా దోపిడి. ఒక మాఫియా సామ్రాజ్యం. పైస్థాయి నుంచి కింది వరకు ఎక్కడిక్కడ కమిషన్లు. దోపిడి.

గతంలో అసాధ్యం అనుకున్న మార్పులు మనం చేసి చూపగలిగాం. మేం తీసుకొచ్చిన ప్రతి మార్పు, నా సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాక, తీసుకున్న నిర్ణయాల ద్వారా జరిగింది. ప్రభుత్వ పథకాలు గ్రామాల్లోనూ డోర్‌ డెలివరీ చేశాం.ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ. వాలంటీర్ల వ్యవస్థ. దాదాపు 540 రకాల సేవలు అందించాం. ప్రతి ఇంటికి మంచి చేశాం. ఎక్కడా, లంచాలు, వివక్ష లేదు.

క్యాలెండర్‌ ఇచ్చి మరీ పథకాలు అమలు చేశాం. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు. ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు నేరుగా బదిలీ చేశాం. ప్రతి ఇంటికి మేలు చేశాం. ఈరోజు మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయి. పథకాల కోత మొదలైంది. ఏ పని కావాలన్నా టీడీపీ నాయకుల ఇళ్లు తిరగాల్సిందే. బడులు పూర్తిగా మార్చాం. ప్రైవేటుకు థీటుగా వాటిని అభివృద్ధి చేశాం. ఇంగ్లిష్‌ మీడియమ్‌తో మొదలు పెడితే, సీబీఎస్‌ఈ, ఐబీ వరకు తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్‌ శిక్షణ. డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌. ట్యాబ్‌లు, సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్, పూర్తి ఫీజు చెల్లింపు, అమ్మ ఒడి, మ్యాండేటరీ ఇంటర్న్‌షిప్‌ మొదలుపెడితే కరికులమ్‌లో మార్పులు.

గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో ఇంటి వద్దనే వైద్యం. విలేజ్‌ క్లినిక్స్, నాడు–నేడుతో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఆస్పత్రులు బాగు పడ్డాయి. 52 వేల పోస్టులు భర్తీ చేసి జీరో వేకెన్సీ తెచ్చాం. రాష్ట్రంలో స్పెషలిస్టుల కొరత కేవలం 4 శాతం. అది జాతీయ స్థాయలో 61 శాతం. 3300 చికిత్సలు ఆరోగ్యశ్రీలో. ఆరోగ్య ఆసరా వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే. ఒకేసారి 17 కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటు మొదలైంది మా ప్రభుత్వ హయాంలోనే.

చేయి పట్టుకుని రైతులను నడిపించాం. ఈ–క్రాప్‌ వ్యవస్థ, ఆర్బీకేలు, దళారుల ప్రమేయం లేకండా పంటల కొనుగోలు. అదే ఈరోజు అన్ని వ్యవస్థలు తిరోగమనమే. ప్రతి రోజూ రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెస్పీ కంటే దాదాపు రూ.400 కంటే తక్కువకు రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారు. దళారుల చేతిలోనే అన్నీ.

ప్రతి క్వార్టర్‌ అయిపోగానే, ఫీజులు చెల్లించేవాళ్లం. ఇప్పటికీ మూడు క్వార్టర్లు పూర్తి కాగా, జనవరికి నాలుగు క్వార్టర్లు. ఆ మేరకు పిల్లల ఫీజులు బకాయిలు. కాలేజీల్లో పిల్లలను వెనక్కు పంపుతున్నారు. బడులకు పోయే పిల్లలు పంట పొలాల్లో పని చేస్తున్నారు. రూ.2800 కోట్లు విద్యాదీవెన బకాయిలు. రూ.1100 కోట్లు వసతి దీవెన బకాయిలు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2200 కోట్లు దాటాయి. ఆరోగ్య ఆసరా ఊసే లేదు. 108, 104 సర్వీసులు మూలనబడ్డాయి. వాలంటీర్లను తొలగించారు. వారికి రూ.10 వేలు ఇస్తామని పచ్చిగా మోసం చేశారు. అన్ని వ్యవస్థలు దారుణంగా వెనక్కు పోయాయి.

రాష్ట్రానికి ఉన్న ఆదాయం పెరిగేలా ప్రభుత్వం ఏదైనా చేస్తే, దాన్ని సంపద సృష్టి అంటారు. రాష్ట్ర పురోగతి కోసం ఎక్కడైనా ఆదాయం పెరిగే ఆలోచన చేయాలి. నిజానికి అది కేవలం వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. దాదాపు రూ.12 వేల కోట్లతో మూడు కొత్త పోర్టుల నిర్మాణం. పనులు కూడా వేగంగా జరిగాయి. ఒక పోర్టు దాదాపు 65 శాతం పూర్తి అయింది. నిజానికి వాటికి ప్రత్యేకంగా ఫండ్‌ కూడా అవసరం లేదు, నిజానికి ఆ పోర్టులు పూరై్తతే, ఎంతో ఆదాయం వచ్చేది. ఆ పోర్టులు రేపు లక్షల కోట్లు విలువ చేస్తాయి.

అదే విధంగా మెడికల్‌ కాలేజీలు. 17 కాలేజీలు కడుతుంటే, 5 మా హయాంలోనే పూర్తయ్యాయి. మరో మూడింటిలో ఎంసీఐ సీట్లు కూడా కేటాయించింది. ఇలాంటి ప్రాజెక్టులు పూరై్తతే దాన్ని సంపద సృష్టి అంటారు. ఒక సీపోర్టు వస్తే, ఉద్యోగాలు వస్తాయి. జీఎస్‌డీపీ పెరుగుతుంది. మెడికల్‌ కాలేజీలు వస్తే వైద్యం ఖర్చులు తగ్గుతాయి. దాన్నే సంపద సృష్టి అంటారు. నిజానికి ఆదిశలో ఆరోజుల్లో విప్లవాత్మక మార్పులకు అడుగులు పడ్డాయి.

ఆరోజుల్లో దాదాపు 18 లక్షల పంప్‌సెట్లు. దానికి ఉచిత కరెంటు కోసం దాదాపు రూ.9 వేల కోట్ల ఖర్చు. అలాంటి పరిస్థితుల్లో.. చంద్రబాబు 5 ఏళ్ల పాలన చూస్తే.. విద్యుత్‌ రంగం దారుణం. డిస్కమ్‌లు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయి. డిస్కమ్‌ల పరిస్థితి చూస్తే, చంద్రబాబు రాకముందు రూ.29 వేల కోట్ల అప్పులు, బకాయిలు ఉంటే, ఆయన దిగిపోయేనాటికి అవి ఏకంగా రూ.86 వేల కోట్లకు ఎగబాకాయి. దాదాపు 23.88 శాతం సీఏజీఆర్‌. డిస్కమ్‌ల నష్ట పరిస్థితి. ప్రభుత్వం నుంచి డిస్కమ్‌లకు సపోర్టు చూస్తే.. రూ.13,255 కోట్లు మాత్రమే చేయగా, మా ప్రభుత్వ హయాంలో రూ.47,800 కోట్లు. ఆ విద్యుత్‌ను 20 ఏళ్లపాటు ఉచితంగా ఇచ్చేలా, ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది.

2020 నవంబర్‌ లో 6,400 మెగావాట్లకు సంబంధించి టెండర్లు. ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో, సోలార్‌ పార్కులు రాష్ట్రంలో పెట్టాలని టెండర్లు పిలిచాం. ఆ టెండర్లలో రూ.2.49 నుంచి రూ.2.58 చొప్పున సరఫరాకు ఎన్టీపీసీ వంటి పెద్ద సంస్థలన్నీ పాల్గొన్నాయి. దాదాపు 24 బిడ్లు దాఖలయ్యాయి. కానీ దురదృష్టవశాత్తూ మనం ఈ ప్రాజెక్టులు స్టార్ట్‌ చేయాలంటే చంద్రబాబు అనే చంద్రగ్రహణం కూడా మనకు ఉంది కాబట్టి, రకరకాల పద్ధతుల్లో కోర్టుల్లో ఈ ప్రక్రియ అంతా ఆపేసే కార్యక్రమం జరిగింది. కోర్టుల ద్వారా ఆగిపోయిన పరిస్థితులు కనిపించాయి. 2020 నవంబరులో ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి, ఆ తర్వాత వివిధ కోర్టుల్లో దీని కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

2021, సెప్టెంబరు 15న, రాష్ట్ర ప్రభుత్వానికి తీయటి కబురు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి లేఖ వచ్చింది. సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) నుంచి వచ్చిన లేఖ సారాంశం చూస్తే.. 6400 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ సరఫరా చేయడానికి సిద్ధమని ప్రకటించింది. ప్రభుత్వానికి వచ్చిన అతి తక్కువ ధర రూ.2.49 చూశాం. మీరు రైతులపై చూపుతున్న శ్రద్ధను అభినందిస్తున్నాం. డిస్కమ్‌ల మీద భారం తగ్గిస్తూ, రైతులను ఆదుకుంటున్న విధానాన్ని, వారికి ఉచిత విద్యుత్‌ ఇవ్వడాన్ని ప్రశంసిస్తూ, ఆ విద్యుత్‌ను తామే రూ.2.49కే ఇస్తామని సెకీ వెల్లడించింది.

అంతే కాకుండా, వారు చెప్పిన ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే.. ఒక స్పెషల్‌ ఇన్సెంటివ్‌గా.. ఐఎస్‌టీఎస్‌ (ఇంటర్‌స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జెస్‌)ను 25 ఏళ్లపాటు రద్దు చేస్తామని వెల్లడించారు. అలా 2026 నాటికి మొత్తం మీద 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ సరఫరా చేస్తామని సెకీ వివరించింది.

ఇవీ ఆ లేఖ ముఖ్యాంశాలు. టేక్‌ ఎవేస్‌: నేను ఒక్కటే అడుగుతున్నాను. ఆ లెటర్‌లో టేక్‌ ఎవేస్‌ చూస్తే..
1. కేంద్ర సంస్థ సెకీతో ప్రభుత్వం నేరుగా జరిపిన లావాదేవీ ఇది. ఇక్కడ మూడో వ్యక్తి ఎవరూ లేరు. ఇంకా చెప్పాలంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విషయం.
2. యూనిట్‌ రూ.2.49కే. ఇది రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ ఖర్చుతో వచ్చే విద్యుత్‌.
3. ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఐఎస్‌టీఎస్‌ (ఇంటర్‌స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జెస్‌) ఉండదు. ఇది స్పెషల్‌ ఇన్సెంటివ్‌గా ఇస్తున్నామని చెప్పడం.
గతంలో రాష్ట్రంలో సగటు విద్యుత్‌ కొనుగోలు ధర రూ.5.10. అదే మనకు 17 వేల మిలియన్‌ యూనిట్లు కేవలం రూ.2.49కే ఇవ్వడానికి కేంద్ర సంస్థ ముందుకు వచ్చింది. అంటే ఒక్కో యూనిట్‌ ధర ఇక్కడ రూ.2.60 తగ్గింది. దీని వల్ల ఏటా రూ.4400 కోట్లు. 25 ఏళ్లలో ఆ మొత్తం దాదాపు రూ.1.10 లక్షల కోట్లు. మరి అది సంపద సృష్టి కాదా?

కేంద్రం నుంచి ఇలాంటి ఆఫర్‌ వస్తే.. అతి తక్కువ ధరకు విద్యుత్‌. ఐఎస్‌టీఎస్‌ మాఫీ. 25 ఏళ్లలో మీకు లక్ష కోట్లకు పైగా ఆదా. రైతులకు మంచి చేసేందుకు మీతో కలిసి వస్తామని అంటే.. అలాంటి లెటర్‌ను పక్కన పెడితే, మీరంతా నన్ను ఏమనేవారు? ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఏమని విమర్శించేవారు. ఆలోచన చేయమని కోరుతున్నాను.

రాష్ట్రానికి మంచి చేయాలని నేను అడుగులు ముందుకు వేస్తే, బురద చల్లుతున్నారు. వారు చేస్తోంది ధర్మమేనా? మనమంతా అడగాలి. చంద్రబాబుకు అన్నీ తెలుసు. అయినా ఆయనే ఆ నింద వేస్తున్నారు.రూ.2.49కే యూనిట్‌ పవర్‌. ఇది ఒక చరిత్ర. కేవలం మా ప్రభుత్వం వల్లనే సా«ధ్యమైంది. అది చరిత్రాత్మక ఒప్పందం. అలాంటి ఒప్పందాన్ని తప్పుబడుతున్నారు. ఆరోపణలు చేస్తున్నారు.

చంద్రబాబు హయాంలో విద్యుత్‌ కొనుగోళ్లు
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య 3494 మెగావాట్లకు సంబంధించి 133 పీపీఏలు చేసుకున్నారు. ఆ పీపీఏలు గమనిస్తే.. రూ.4.84 నుంచి రూ.4.83 వరకు ఉన్నాయి. 2014లో మాత్రం రూ.4.70కి వచ్చింది. సోలార్‌ కు సంబంధించి.. 2500 మెగావాట్లకు ఆయన పీపీఏ చేసుకున్నారు. 2014లో 650 మెగావాట్లు సగటున రూ 6.49కు కొనుగోలుకు చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. రూ.5.25 నుంచి రూ.6.99 మధ్య ఒప్పందం చేసుకున్నారు. 2015లో రూ.5.96 కు మరో 250 మెగావాట్లకు ఒప్పందం. 2016లో రూ.6.80, రూ.5.99, రూ.4.61, రూ.4.50 కి కొనుగోలు చేశారు. ఆయన సోలార్‌ ఎనర్జీని యావరేజ్‌ గా రూ.5.90కి కొనుగోలు చేశారు.

అతి తక్కువ రేట్‌కు పీఎస్‌ఏ చేసుకోవడం తప్పా?
చంద్రబాబు హయాంలో విండ్‌ పవర్‌ యావరేజ్‌ యూనిట్‌ ప్రైస్‌ రూ.4.63 అయితే.. సోలార్‌ యూనిట్‌ రూ.5.90. మరి నేను రూ.2.49కు అంటే చంద్రబాబు పెట్టిన దానిలో సగం రేటుకు కొనుగోలు చేస్తే.. చీపెస్ట్‌ రేట్‌ కి పవర్‌ సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే.. ఐఎస్‌టీఎస్‌ చార్జెస్‌ మాఫీ చేస్తామని చెబితే.. నేను స్పందించకపోయి ఉంటే నన్ను మీరేమని ఏమనేవారు? స్పందించిన నేను మంచి వాడినా.. అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఏలు చేసుకున్న చంద్రబాబు మంచి వాడా?

ఎవరికి సంపద సృష్టి. ఎవరికి ఆవిరి?
చంద్రబాబు హయాంలో సంపద ఎలా ఎరోడ్‌ (ఆవిరైపోయిందో) అయిందో చెబుతాను. చంద్రబాబు సోలార్, విండ్‌ పీపీఏలను వైయస్సార్‌సీపీ చేసుకున్న సోలార్‌ ఒప్పందంతో పోలిస్తే.. అవన్నీ 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వంపై మోపుతున్న భారం.. రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సిన భారం ఇది. ఇదే మాదిరిగా చూస్తే.. 3500 విండ్‌ పీపీఏలకు సంబంధించి ఆయన చేసుకున్న రూ.4.84లు మైనస్‌ మనం చేసుకున్న రూ.2.49. అంటే రూ.2.35 రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కట్టాల్సి వస్తుంది. ఇంటూ 3500 మెగావాట్లు అంటే 9000 మిలియన్‌ యూనిట్లు.. అంటే రూ.2.35 ఇంటూ 9000 మిలియన్‌ సంవత్సరానికి రూ.2 వేల కోట్లు.. 25 ఏళ్లలో రూ.50 వేల కోట్లు కేవలం చంద్రబాబు చేసుకున్న విండ్‌ యూనిట్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం. సోలార్‌ ఎనర్జీ ఒప్పందాలు చూస్తే.. చంద్రబాబు 2400 మెగావాట్లు ఆయన చేసుకున్న ఒప్పందం.. యావరేజ్‌ ప్రైస్‌ రూ.5.90.

అదే మేము ఒప్పందం చేసుకున్నది రూ.2.49. అంటే రూ.3.41 ఆయన చేసుకున్న పీపీఏల వల్ల రాష్ట ప్రభుత్వం అదనంగా కట్టాలి కదా? 2400 మెగావాట్లు అంటే.. 4200 మిలియన్‌ యూనిట్లు ఇంటూ రూ.3.41. ఏడాదికి 1500 కోట్లు సంవత్సరానికి భారం పడుతుంది. రూ.1500 కోట్లు ఇంటూ 25 ఏళ్లు అంటే.. రూ.37500 కోట్లు..

జగన్‌ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ ఒప్పందం వల్ల 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్ల సంపద సృష్టి జరుగుతుంటే.. చంద్రబాబు చేసుకున్న సోలార్, విండ్‌ ఒప్పందాల వల్ల.. 25 ఏళ్లలో రూ.87,500 కోట్ల సంపద ఆవిరవుతుంది. తేడా గమనించండి.

సెకీ లేఖ. పరిణామాలు. ఒప్పందం
సెకీ నుంచి 2021, సెప్టెంబరు 15న లేఖ రాగా, ఇటువంటి మంచి ఆఫర్‌ రావడంతో, ఆ మర్నాడే క్యాబినెట్‌ మీటింగ్‌ ఉండగా, దాన్ని టేబుల్‌ ఐటెం కింద పెట్టాం. అంటే సెప్టెంబరు 16న క్యాబినెట్‌లో చర్చించాం. ఎనర్జీ శాఖ అన్నీ అధ్యయనం చేసి వచ్చే క్యాబినెట్‌ నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దాదాపు 40 రోజుల పాటు అన్నీ అధ్యయనం చేసిన ఇంధన శాఖ కమిటీ, 2021, అక్టోబరు 25న నివేదిక సమర్పించింది.

ఆ తర్వాత అక్టోబరు 28న క్యాబినెట్‌ జరగ్గా, ఆ నివేదికను క్యాబినెట్‌ ముందు ఉంచడం జరిగింది. అన్నీ చర్చించిన తర్వాత క్యాబినెట్‌ ఏం చెప్పిందంటే, ఏపీఈఆర్‌సీ అనుమతి కూడా తీసుకోవాలని నిర్దేశించి, ఆమోదం తెలిపింది. ఆ తర్వాత నవంబరు 11న ఏపీఈఆర్‌సీ క్లియరెన్స్‌ ఇచ్చింది. ఆ క్రమంలో డిసెంబరు 1, 2021న ప్రభుత్వం, సెకీ మధ్య పవర్‌సేల్‌ అగ్రిమెంట్‌(పీఎస్‌ఏ) జరిగింది. దాంట్లో ఎవరెవరు సైన్‌ చేశారంటే.. సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, నాలుగు డిస్కమ్‌లు సంతకాలు చేశారు. ఇక్కడ ఎక్కడా థర్డ్‌ పార్టీ లేదు. స్పష్టంగా చెప్పాలంటే.. అది సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్‌ల మధ్య జరిగిన ఒప్పందం. దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా ముందే ఇచ్చింది.

ఆ ఒప్పందం కనుక చేసుకోకపోయి ఉంటే..
ఒక చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంటే.. రూ.2.49కే విద్యుత్‌ మన రాష్ట్రానికి దొరుకుతుంటే, ఇంకా స్పెషల్‌ ఇన్సెంటివ్‌గా ఐఎస్‌టీఎస్‌ మాఫీ. అదెంతో తెలుసా? ఒక్కో యూనిట్‌కు రూ.2. అంటే ఒక్కో మెగావాట్‌కు నెలకు దాదాపు రూ.4 లక్షలు. అంటే ఏడాదికి దాదాపు రూ.50 లక్షలు అన్నమాట.

అంత తక్కువ ధరకు మనకు సోలార్‌ విద్యుత్‌ వచ్చింది. ఆత్మ నిర్బల్‌ భారత్‌ కింద, సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తూ, కేంద్రం మనకు ఆ ఇన్సెంటివ్‌ ఇచ్చింది. అంత మంచి ఆఫర్‌ను నేను పక్కనపడేసి ఉంటే, అదే మీరు ఏమనేవారు? 25 ఏళ్లలో దాదాపు రూ.1.10 లక్షల కోట్లు ఆదా. అంటే అది సంపద సృష్టి కాదా? నిజానికి అది ఒక రోల్‌మోడల్‌ కేసు.

అప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధర
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఇదే సెకీ, అదే ఆత్మ నిర్బల్‌ భారత్‌ కింద.. తమిళనాడుకు కూడా విద్యుత్‌ సరఫరా చేసింది. చత్తీస్‌గడ్‌ రూ.2.61. ఒడిషా రూ.2.61. తమిళనాడు రూ.2.61. అదే మన రాష్ట్రానికి 12 పైసలు తక్కువగా రూ.2.49కే తెస్తే, నన్ను సన్మానించాల్సింది పోయి, ఏం విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు సంపద ఆవిరి చేస్తే, నేను సృష్టించాను. మరి ధర్మం, న్యాయం ఎక్కడుంది?

పిచ్చి రాతలు
ఇక ఎల్లో మీడియా రాతలు. వారికి తోడు తానా అంటే తందానా అంటూ, చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు, ఇతర పార్టీల్లో ఉన్న ఆయన మనుషులు, హాఫ్‌ బేక్డ్‌ నాలెడ్జ్‌ ఉన్న వాళ్ల పిచ్చి విమర్శలు.

గుజరాత్‌లో రూ.1.99కే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుంటే, మనం రూ.2.49కి ఎందుకు కొన్నామని అంటున్నారు. అక్కడి పరిస్థితులు వేరు. ఇర్రేడియేషన్‌ స్థితి. ఎడారి ప్రాంతాల్లో ఉత్పత్తి వ్యయం తక్కువ.

కానీ, చంద్రబాబు, ఎల్లో మీడియా అతి తెలివి ప్రదర్శిస్తూ.. గుజరాత్, రాజస్థాన్‌లో ఉత్పత్తి వ్యయం గురించి మాట్లాడుతున్నారు. కానీ, ఆయా రాష్ట్రాల్లో ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీలు ఎంతో తెలుసా? యూనిట్‌కు రూ.1.98. మరి ఈనాడు గుజరాత్‌ గురించి రాశారు. అక్కడ యూనిట్‌ ఉత్పత్తి వ్యయం రూ.1.99 అంటున్నారు. మరి ఎక్కడ ఉత్పత్తి? ఎక్కడ వినియోగం? చూడాలి కదా?

అంటే గుజరాత్‌లోనే ఉత్పత్తి చేసి, ఆ రాష్ట్రంలోనే సరఫరా చేస్తున్నారు. అంటే మొత్తం అంతా రాష్ట్రంలోనే. అందుకే వారికి ఆ రేట్లు వర్తిస్తున్నాయి. వారికి అక్కడ ఇర్రేడియేషన్‌ లెవెల్‌ వల్ల విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం రూ.1.99. రాజస్థాన్‌లో చూస్తే, అదే స్థితి. ఉత్పత్తి, సరఫరా అంతా ఒకే రాష్ట్రంలో. అయినా ఈనాడులో అది రాయరు. కేవలం ఉత్పత్తి వ్యయం తక్కువ అని మాత్రమే చెబుతారు. అక్కడ కూడా ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీలు లేవు. మరి అలా రాయడం వక్రీకరణ కాదా?

కోవిడ్‌ తర్వాత, తాజాగా గుజరాత్‌లో సెకీ టెండర్లు చూస్తే.. 2024, మార్చి 15న టెండర్ల బిడ్లు చూస్తే, రూ.2.62 నుంచి రూ.2.67 వరకు ధర. అంటే గుజరాత్‌లోనే ఉత్పత్తి. ధర. రాజస్థాన్‌లో కూడా బిడ్లు చూస్తే.. దాదాపు అవే ధరలు. అంటే ప్రస్తుత రెన్యూవబుల్‌ ఎనర్జీ రేట్లు ఇలా ఉన్నాయి.

ఆ లెక్కన రూ.1.50కే రావాలి కదా?:
మనకు అక్కడి జనరేషన్‌ కాస్ట్‌ కంటే తక్కువకు రూ.2.49కే వచ్చాయని సంతోషపడాలి. ఈనాడులో ఏం రాశారు? ఏళ్లు గడుస్తున్న కొద్దీ కొత్త మోడళ్ల టీవీల ధరలు తగ్గుతాయి. అలాగే విద్యుత్‌ ఛార్జీలు కూడా టెక్నాలజీ పెరిగిన తర్వాత తగ్గాలి కదా? అంటున్నారు. ఆ ప్రకారం, ఈనాడు థియరీ ప్రకారం చూస్తే.. అదే గుజరాత్‌లో సోలార్‌ పవర్‌ ఇవాళ రూ.1.50కే రావాలి కదా? మరి రూ.2.67 వరకు ఎందుకు పోయింది? అంటే ఏ స్థాయిలో అబద్ధాలు చెబుతున్నారనే దానికి ఇవన్నీ ఉదాహరణలు.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
చంద్రబాబు ఆ ఒప్పందాలు రద్దు చేసుకుంటే.. ఎవరూ అంత తెలివి తక్కువగా ఆ పని చేయరు. అంత తక్కువ ధరకు విద్యుత్‌ దొరకదు. పైగా 25 ఏళ్లలో లక్ష కోట్లకు పైగా ఆదా. 2009 నుంచి చూస్తే.. రూ.3.70 మొదలు చంద్రబాబు హయాంలో రూ.6.99 వరకు చేరింది. మా హయాంలో ఒకే అగ్రిమెంట్‌. యూనిట్‌ ధర రూ.2.49. అంత తక్కువ ధరకు ఎవరూ కొనుగోలు చేయలేరు. ఇది వాస్తవం. ఇంకా చెప్పాలంటే చరిత్రాత్మకం.

డిస్కమ్‌లు కరెంటు కొంటున్నాయి. సెకీ సరఫరా చేస్తోంది. మేము యూనిట్‌కు రూ.2.49 చొప్పున సెకీకి చెల్లిస్తున్నాం. అది అప్పట్లో చాలా తక్కువ ధర. పైగా ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీల మాఫీ. అంత మంచి ఆఫర్‌ ఎవరైనా వదులుకుంటారా? మీరే చెప్పండి. దాని వల్ల ఏటా రూ.4400 కోట్లు ఆదా. అంటే 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా.

ఈనాడు, ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా
అన్ని వాస్తవాలు మరుగు పరుస్తూ, రోజూ నాపై దుష్ప్రచారం చేస్తూ, ఈనాడు, ఆంధ్రజ్యోతి పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. అందుకే వారిపై నష్టం దావా వేయబోతున్నాను. రూ.100 కోట్లకు దావా వేయబోతున్నాను. వారు నా ప్రతిష్టకు భంగం వాటిల్లేలా చేస్తున్నారు. వాస్తవాలు మరుగునపర్చి, పచ్చి అబద్ధాలు వండి వారుస్తున్నారు. యూనిట్‌ వపర్‌ రూ.2.49కే కొనడం, ఐఎస్‌టీఎస్‌ మాఫీ.. అవన్నీ దాచిపెట్టి, నాపై ఆరోపణలు చేస్తున్నారు.

అదే పనిగా, నన్ను నిందిస్తున్నారు. నా పేరు ప్రఖ్యాతలు నాశనం చేయాలని చూస్తున్నారు. రెప్యుటేషన్‌ దెబ్బ తీస్తున్నారు. అందుకే 48 గంటల సమయం ఇచ్చి, క్షమాపణ చెప్పాలని కోరుతాను. వారు ఆ పని చేయకపోతే, రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తాను. ఒకవేళ, నేను సెకీ లేఖను పక్కనపెట్టి ఉంటే, ఏమనేవారు? అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి, నీకు ఏ ప్రయోజనం కలగదు కాబట్టి, పట్టించుకోలేదని, ప్రైవేటు ఒప్పందాలకు ప్రాముఖ్యం ఇస్తున్నానని రాసేవాళ్లు. డీబీటీలో రూ.2.73 లక్షల కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశాం. అంత సాహసం ఎవరూ చేయరు. ఎందుకంటే, దాని వల్ల ఎవరికీ లంచాలు రావు. కానీ మేం చేసి చూపాం. విద్యా రంగంలో మార్పులు చేసి, చరిత్ర సృష్టించాం.

అన్నీ ఆధారాలతో మాట్లాడాను. సాక్ష్యాలు కూడా చూపాను. పరువు నష్టం దావా కూడా వేస్తున్నాను. అన్నీ ఓపెన్‌గా చెబుతున్నాను. అసెంబ్లీలో బడ్జెట్‌లో ప్రభుత్వ అప్పు రూ.6.46 లక్షల కోట్లు అని డాక్యుమెంట్‌లో స్పష్టంగా చూపినా, బయట ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లు అని, రూ.12 లక్షల కోట్లు అని అసత్యాలు చెబుతున్నారు. దీనికి హద్దూ, అదుపు ఉండదా? సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే, పీడీ యాక్ట్‌ కింద కేసు పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. ఇక్కడ యథేచ్ఛగా చట్ట ఉల్లంఘన జరుగుతోంది.

LEAVE A RESPONSE