Suryaa.co.in

National

ఈడీకి ఢిల్లీ సీఎం కొన్ని షరతులు

-మార్చి 12 తరువాత కేజ్రీవాల్ విచారణకు సిద్ధమంటూ ఆప్ ప్రకటన
-వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరవుతారని వెల్లడి

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎనిమిదోసారి దూరంగా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్ కు నాలుగు నెలలుగా ఈడీ నోటీసులు ఇస్తున్న విషయం తెలిసిందే. తనకు నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధం, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగం, కోర్టు పరిధిలో ఉన్న అంశం అంటూ వివిధ కారణాలతో ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరవుతున్నారు. ఫిబ్రవరి 27న కేజ్రీవాల్ కు 8వ సారి ఈడీ సమన్లు పంపించింది.. మార్చి 4న విచారణకు రావాలని కోరింది. అయితే, కేజ్రీవాల్ ఈడీ విచారణకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఈడీకి ఢిల్లీ సీఎం కొన్ని షరతులు పెట్టినట్లు తెలిసింది.

దీనిపై స్పందించిన ఆప్ ఈడీ విచారణకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మార్చి 12 తరువాత కేజ్రీవాల్ విచారణకు వస్తారని తెలిపింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు హాజరవుతారని చెప్పింది. అయితే, వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఈడీ పట్టుబడుతోంది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు నిబంధనలు అనుమతించవని చెబుతోంది.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. లంచాలు చేతులుమారడం, మద్యం పాలసీలో తప్పులు తదితర అంశాలపై కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇద్దరు ఆప్ సీనియర్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను గతేడాది ఫిబ్రవరిలో సీబీఐ అరెస్టు చేయగా, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఈడీ అక్టోబర్‌‌లో అరెస్టు చేసింది.

LEAVE A RESPONSE