Home » హైదరాబాద్ టు ఇరాన్..వయా..కేరళ- బెంగళూరు కిడ్నీరాకెట్

హైదరాబాద్ టు ఇరాన్..వయా..కేరళ- బెంగళూరు కిడ్నీరాకెట్

-కేరళలో బయటపడ్డ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్
-హైదరాబాద్ వైద్యుడి హస్తం
-కారుచౌకగా కిడ్నీలుకొట్టేస్తున్న ముఠా
-ఇరాన్‌లోనే కిడ్నీ మార్పిడి
-ఇప్పటిదాకా 20 మందిని ఇరాన్ తీసుకువెళ్లినట్లు నిందితుడి ఒప్పుకోలు

హైదరాబాద్: ఇది ఒళ్లుజలదరించే వార్త. అవసరంలో ఉన్న పేదవారే లక్ష్యంగా కొన్నేళ్లుగా సాగుతున్న కిడ్నీ రాకెట్ అనే అమానవీయ వికృత వ్యాపారం. మన దేశంలో కిడ్నీలను ఇడ్లీలంత కారుచౌకగా కొనుగోలు చేసి, ఇరాన్‌లోకి కిడ్నీ రోగులకు అందిస్తున్న వైనం బట్టబయలయింది. ఈ రాకెట్ హైదరాబాద్ నుంచి ఇరాన్.. మధ్యలో కేరళ-బెంగుళూరు మీదుగా సాగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఒక వైద్యుడి హస్తం ఉన్నట్లు తేలడం మరో షాకింగ్ న్యూస్.

హైదరాబాద్‌ కేంద్రంగా ఇరాన్.. వయా కేరళ ఈ వికృత వ్యాపారం నడుస్తోంది. పేద యువకులకు డబ్బు ఆశ చూపి 40 మంది కిడ్నీలను ఇడ్లీల్లా అమ్మేశారు. అయితే కిడ్నీ ఇచ్చిన ఓ యువకుడు మృతి చెందడంతో విషయం బయటపడింది. కేరళలో వెలుగు చూసిన ఈ భాగోతానికి ముఠా మాస్టర్‌ హైదరాబాద్‌కు చెందిన వైద్యుడుగా గుర్తించారు పోలీసులు. కేరళతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ అవయవ రవాణా రాకెట్‌ను పోలీసులు ఛేదించారు.

త్రిస్సూర్‌కు చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేసి కొచ్చిలో మరొకరిని అదుపులోకి తీసుకున్న తర్వాత, గత రెండు రోజుల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం వేట మొదలు పెట్టారు పోలీసులు.

హైదరాబాద్‌లో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ వెలుగుచూసింది. డబ్బు అవసరం ఉన్న యువతను గుర్తించి.. వారికి డబ్బు ఆశ చూపి, కిడ్నీలు విక్రయించేలా దళారులు ఒప్పిస్తున్నారు.

ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు రూ.20 లక్షల వరకూ ఇస్తామని ఆశపెడుతున్నప్పటికీ ఖర్చులన్నీ చూపించి, రూ.6 లక్షలు ముట్ట చెబుతున్నారు. డోనర్లు ఇరాన్‌ వెళ్లేందుకు కావాల్సిన పాస్‌పోర్టు, వీసాల వంటివి మరికొందరు దళారులు సమకూరుస్తున్నారు.హైదరాబాద్‌, బెంగళూరు నుంచి డోనర్లు ఇరాన్‌కు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

అవయవ సేకరణ కోసం భారతదేశం నుండి 20 మందిని ఇరాన్‌కు తీసుకెళ్లినట్లు సుబిత్ పోలీసుల ముందు అంగీకరించినట్లు సమాచారం. కిడ్నీ మార్పిడి కోసం భారతదేశం నుండి అక్రమంగా ప్రజలను రిక్రూట్ చేసే రాకెట్‌లో తాను భాగమని సబిత్ పోలీసులకు చెప్పాడు.

హైదరాబాద్, బెంగళూరుకు చెందిన యువకులను ఇరాన్‌లో కిడ్నీ దాతలుగా నియమించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ రాకెట్‌లో హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తులు కూడా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఢిల్లీకి చెందిన వ్యక్తికి కిడ్నీ దానానికి సంబంధించి మొదట హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తనను అవయవ వ్యాపారంలోకి తీసుకున్న ఇతరులను కలిశానని సబిత్ పోలీసులకు చెప్పాడు.

ఈ అనుమానాస్పద వ్యక్తులపై పోలీసులు విచారణ ప్రారంభించారు. నకిలీ ఆధార్ మరియు ఇతర గుర్తింపు కార్డులతో కేరళకు చేరుకున్న కొంతమంది వలస కార్మికులను అవయవ లావాదేవీల కోసం సబిత్ ఇరాన్‌కు రిక్రూట్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు NIA రంగంలోకి దిగింది. కేరళలో నమోదైన FIR ఆధారంగా ముఠాపై కేసు నమోదు చేసి కీలక సూత్రధారి మరో ఇద్దరి కోసం గాలిస్తుంది. హైదరాబాద్‌లో ఇంకా ఈ రాకెట్‌కు ఎన్ని లింకులున్నాయన్న దానిపై విచారణ ప్రారంభమయింది.

Leave a Reply