Suryaa.co.in

Andhra Pradesh

శంకుస్థాపన శిలాఫలకం ధ్వంసం!

– చంద్రబాబు పేరుపై శాడిజం
– తమది సైకో పార్టీ అని నిరూపించిన నేతలు
– 5 స్టార్ హోటల్ కేంద్రంగా వైసీపీ అరాచకం
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చొరవ
– 2022 ఘటనకు ఎన్డీయే సర్కారు హయాంలో విముక్తి
– శభాష్‌ అంటున్న స్థానికులు, నేతలు
(వాసిరెడ్డి రవిచంద్ర)

గుంటూరు, మహానాడు: జగన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలను విధ్వంసకర సైకో పార్టీ అని పదే పదే ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తుంటాయి. ఆ విమర్శలకు బలం చేకూర్చే సంఘటన గుంటూరులో వెలుగు చూసింది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ అరాచకం తాజాగా వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు జోక్యంతో జరిగిన తప్పును ఆ కార్పొరేట్‌ సంస్థ సరిదిద్దుకుంది. ఓ 5 స్టార్ హోటల్ కేంద్రంగా వెలుగు చూసిన వైసీపీ అరాచకంపై ప్రత్యేక కథనం…

2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి అభివృద్ధితో భాగంగా, పర్యాటక రంగాన్ని చంద్రబాబు ఎంతో ప్రోత్సహించారు. అందులో భాగంగానే ఐటీసీ అధికారులతో మాట్లాడి గుంటూరులో 5 స్టార్ హోటల్ నిర్మాణం చేసేలా ఒప్పించారు. దీంతో నగరంలోని నవభారత్ నగర్ లో వెల్ కం హోటల్ పేరుతో 14 అంతస్తుల్లో 5 స్టార్ హోటల్ నిర్మించారు. ఈ వెల్ కం హోటల్ కు 2016 ఏప్రిల్ 29న శంకుస్థాపన జరిగింది.

ఈ కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావులతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. శంకుస్థాపన సందర్భంలో చంద్రబాబు పేరుతో ఓ శిలా ఫలకం కూడా వేశారు. హోటల్ నిర్మాణ పూర్తి సమయానికి చంద్రబాబు అధికారం కోల్పోవడం.. జగన్ రెడ్డి అధికారంలోకి రావడం… జరిగిపోయింది.

హోటల్ నిర్మాణ పూర్తి అయ్యాక జనవరి 12, 2022న అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతుల మీదుగా వెల్ కం హోటల్ ను ఐటీసీ అధికారులు ఘనంగా పారంభింపచేశారు. అయితే, చంద్రబాబు శంకుస్థాపన చేసిన సందర్భంగా వేసిన శిలాఫలకాన్నిహోటల్ ప్రారంభోత్సవం రోజున వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టుబట్టి అక్కడి నుండి తొలగించిచారు.

ఐటీసీ అధికారులు వారిస్తున్నా వినకుంటే “మా జగనన్నకు ఆ శిలాఫలకం చూస్తే కోపం వస్తుంది” తీసివేయండి అని ఆఘమేఘాలమీద చంద్రబాబు పేరుతో ఉన్న ఆ శిలాఫలకాన్ని పగలగొట్టి తీసిపారేశారు. ఈ చర్య అప్పటి వైసీపీ ప్రభుత్వ సైకోయిజానికి నిదర్శనంగా మారింది.

ఇది ఇలా ఉంటే, ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఐటీసీ వెల్ కం హోటల్ వెళ్ళిన మాజీ మంత్రి, టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, పార్టీ నేతలు కనపర్తి శ్రీనివాసరావు, బుచ్చి రాంప్రసాద్ లు చంద్రబాబు శంకుస్థాపన చేసిన శిలాఫలకం అక్కడ లేకపోవడాన్ని గమనించారు. కేవలం జగన్ ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకం మాత్రమే ఉండటంతో మాజీ మంత్రి ఆనందబాబు వెంటనే అక్కడే ఉన్నహోటల్ జనరర్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్ళారు. అయితే, తనకు ఆ విషయ తెలియదని ఎందుకు తొలగించారో పై అధికారులతో మాట్లాడతానని సమాధానం ఇచ్చారు. ఆ సమాధానంతో సంతృప్తి చెందని నక్కా ఆనందబాబు అక్కడి నుండే ఐటీసీ అధికారులతో మాట్లాడగా ప్రారంభోత్సవం రోజు వైసీపీ నేతలు శాడిజంతో శిలాఫలకం ధ్వంసం చేసిన విషయాన్ని చెప్పారు. తక్షణమే అదే స్దానంలో శిలాఫలకం ఏర్పాటు చేయమని కోరారు.

హోటల్ యాజమాన్యం అంగీకరించి, రెండు రోజుల్లోనే చంద్రబాబు పేరుతో ఉన్న శిలాఫలకాన్ని కొత్తగా తయారు చేయించి యథాస్థానంలో పెట్టారు. మరల వెల్ కం హోటల్ కు వెళ్ళిన నక్కా ఆనంద బాబు, పార్టీ నేతలు కనపర్తి, బుచ్చి రాం ప్రసాద్ లకు చంద్రబాబు శిలాఫలకం కనపడటంతో ఆనందం వ్యక్తం చేస్తూ హోటల్ యాజమాన్యాన్ని అభినందించారు.

ఇలాంటి శాడిస్టు చర్యలతోనే జగన్ రెడ్డి కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని నక్కా ఆనందబాబు మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు హుందాగా ప్రవర్తిస్తే వచ్చే ఎన్నికల నాటికి అయినా ప్రతిపక్ష హోదా దక్కుతుందని హితవు పలికారు. నక్కా ఆనంద బాబు, పార్టీ నేతలు చేసిన పనికి పలువురు అభినందించారు.

LEAVE A RESPONSE