Suryaa.co.in

Telangana

సింగరేణి అలియాస్ పేర్ల బాధితులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి

– బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్
– ఎమ్మెల్సీ కవిత సూచన మేరకు సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ సుభాని గారిని కలిసి వినతిపత్రం అందజేసిన సింగరేణి జాగృతి సభ్యులు

హైదరాబాద్ : సింగరేణిలో మారు పేర్ల (అలియాస్ నేమ్స్) తో కార్మికులుగా పని చేసి డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

సోమవారం హైదరాబాద్ లోని తన నివాసంలో సింగరేణి జాగృతి నాయకులు, అలియాస్ నేమ్స్ డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, సంస్థలో 30 ఏళ్లకు పైగా సేవ చేసిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేయడం అన్యాయమన్నారు. తండ్రులు అలియాస్ నేమ్స్ తో పని చేస్తే వారసులకు రెండు ఇంటి పేర్లు ఉన్నాయనే కారణంతో ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు.

అలియాస్ నేమ్స్ డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని విజిలెన్స్ విభాగం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతోందని అన్నారు. సింగరేణిలో అలియాస్ నేమ్స్ తో డిపెండెంట్ ఉద్యోగాల కోసం వందలాది మంది ఎదురు చూస్తున్నారని తెలిపారు. యాజమాన్యం మానవత దృక్పథంతో వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఈ సమస్య పరిష్కారానికి సింగరేణి యాజమాన్యం, జాతీయ కార్మిక సంఘాలు లేబర్ కమిషనర్ వద్ద చేసుకున్న ఒప్పందం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత సూచన మేరకు సింగరేణి జాగృతి నాయకులు సంస్థ జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ సుభాని గారిని కలిసి వినతిపత్రం అందజేశారు.

సమావేశంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన చారి, తెలంగాణ జాగృతి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ నరేన్ అప్పల, టీబీజీకేఎస్ కేంద్ర కోశాధికారి వెంకట్, సింగరేణి జాగృతి నాయకులు నరేష్ నేత, భువనచంద్ర, అనిల్ సందీప్ గౌడ్, సునీల్, శ్రీకాంత్ మరియు మారుపేరు బాధితులు లక్క శ్రావణ్ గౌడ్ ,పుట్ట సత్యం, వేముల సాయికుమార్ , బొద్దుల రంజిత్ కుమార్ , వేగోలం అరుణ్ కుమార్ , జక్కుల శ్రావణ్, డిష్ బాబు, తిరుమల శ్రీనివాస్ , కన్నాల రాజం , వంగ సంతోష్ , పొన్నం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE