ప్రజల తీర్పు మోడీకి గట్టి “వార్నింగ్” కదా! అమిత్ షా ముఖం మాడింది! రాత్రి చూశా! బీజేపీ సొంతంగా 350కిపైగా గెలుస్తామన్నారు! ఎన్డీయే కూటమిగా 400 మావేనన్నారు! 2019లో గెలిచిన 303 సంఖ్య కాస్తా 240కి దిగజారింది!అతిపెద్ద పార్టీగా మాత్రమే మిగిలింది. మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది!
“బాలరాముడు” ఆగ్రహించాడేమో! అయోధ్యలో బిజెపి ఓటమి పాలయ్యింది. యోగీ ఆధిత్యనాథ్ అధికారంలో ఉన్నా! మోడీ వారణాశి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నా! యు.పి.లో సగానికిపైగా స్థానాల్లో ఓటమే! 2019లో గెలిచిన 64 సంఖ్య 33కు దిగజారింది.
రాజస్థాన్ లో అధికారంలో ఉన్నా, మంగళ సూత్రం సెంటిమెంటును రెచ్చగొట్టి, మత విద్వేషాన్ని వెదజల్లినా, 2019లో గెలిచిన 21 సంఖ్య 14కు పడిపోయింది! హరియాణాలో అధికారంలో ఉన్నా, ముఖ్యమంత్రిని మార్చినా, తొమ్మిది నుండి సంఖ్య ఐదుకు పడింది.
శివసేన – ఎన్సీపీ పార్టీలను చీల్చి, తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, మహారాష్ట్రలో 23 నుండి 9కి దిగజారింది. పశ్చిమ బంగాల్ లో పాగా వేస్తామన్నారు. 2019లో గెలిచిన 18 నుండి 12కు పడ్డారు.
బీహార్ లో వ్రతం చెడి నితీశ్ తో జట్టు కట్టారు. 2019లో గెలిచిన 17లో 12 నిలబెట్టుకున్నారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రిని జైలుకు పంపినా, 2019లో గెలిచిన 11 నుండి 8కి చేరారు. కర్ణాటకలో ఏడాది క్రితం అధికారం పోయింది. గాలి జనార్ధన్ రెడ్డిని అక్కున చేర్చుకున్నారు. 2019లో గెలిచిన 25లో 17 నిలబెట్టుకో గలిగారు.
మణిపూర్ లో అధికారాన్ని వెలగబెడుతూ, జాతుల మధ్య సంక్షోభం సృష్టించి, 2019లో గెలిచిన ఒక్క స్థానాన్ని కూడా కోల్పోయారు. పంజాబ్ లో ఉన్న రెండూ పోయాయ్!చండీఘర్ కూడా పోయింది. ఇంత జరిగినా, కాస్తా కూడా పక్షాత్తాపం లేకుండా “కింద పడ్డా నాదే గెలుపంటూ” బడాయికొడుతూ మోడీ రాత్రి చేసిన ఊక దంపుడు ప్రసంగం విన్నప్పుడు ఆయనకు ఎంత అధికార దాహం ఉన్నదో ఆయన ముఖ కవళికలే తెలియజేశాయి.
నైతిక విలువలకు విలువిచ్చే వారైతే 2024 సాధారణ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు తన ప్రభుత్వం అనుసరించిన సామాజిక – ఆర్థిక – రాజకీయ విధానాలపై ఇచ్చిన తీర్పుగా భావించి, బాధ్యతల నుండి తప్పుకుంటున్నాని ప్రకటించే వారు. కానీ, ఆయన “చాయ్ వాలా” నరేంద్ర మోడీ కదా!
నిజమే ఒడిశాలో గెలిచారు. నవీన్ పట్నాయక్ గారు వృద్ధాప్యంలో ఉన్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడం సహజం. బిజెడి కుటుంబ పార్టీ. ఆయనకు వారసులు లేరు. తనకు విశ్వాసపాత్రుడైన, తమిళనాడుకు చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని స్వచ్ఛంద పదవీ విరమణ చేయించారు. ఆయనకు పార్టీ బాధ్యతలను అప్పగించే ఆలోచనల్లో నవీన్ పట్నాయక్ ఉన్నారన్న ఊహాగానాల మధ్య ఎన్నికలు జరిగాయి. 25 ఏళ్ళ పాటు పాలన చేశారు.
ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం సహజం. గతంలో అధికారాన్ని వెలగబెట్టిన కాంగ్రెస్ ప్రతిష్ట కోల్పోయింది. మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఎదగలేక పోయింది. ఈ పూర్వరంగంలో బిజెపి “డబుల్ ఇంజన్” నినాదంతో రంగ ప్రవేశం చేసింది. ఆ రాష్ట్రానికి చెందిన గిరిజన మహిళను అత్యున్నతమైన భారత రాష్ట్రపతిగా ఎంపిక చేశారు. భారత జాతి మహదానందం పడింది, గౌరవించింది. మీరు రాజకీయ లబ్ధి పొందారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విజయంలో మోడీ పాత్ర ఏమీ లేదు. అంతో ఇంతో ప్రతికూల ప్రభావమే పడింది. బీజేపీ ఆరు లోక్ సభ స్థానాల్లో పోటీ చేసి, మూడింటిలో ఓడిపోయింది. మోడీ ప్రభుత్వం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యతిరేకతకు ప్రబల నిదర్శనం.
తెలంగాణలో నాలుగు నుండి ఎనిమిదికి ఎగబాకారంట. అది నిజమే. తెలంగాణలో కేసీఆర్ పార్టీ అయిన బి.ఆర్.ఎస్. ఎత్తిపోయింది. పర్యవసానంగా బిజెపి కాస్తా పుంజుకొన్నది. అంతే!
కేరళలో అడుగు పెట్టారు. ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకే! మధ్యప్రదేశ్ లో పార్టీ ఫిరాయింపులతో కాంగ్రెస్ ను చావుదెబ్బకొట్టారు. శాసన సభ ఎన్నికల్లోను, తాజాగా లోక్ సభ ఎన్నికల్లో కూడా స్వీప్ చేశారు. డిల్లీ ముఖ్యమంత్రిని ఎన్నికల ముంగిట జైలుకు పంపి, బిజెపికి ఉన్న ఏడు లోక్ సభ స్థానాలను నిలబెట్టుకున్నారు.