Suryaa.co.in

Editorial

షర్మిల అంతా నిజమే చెప్పిందా?

– ఆ ఇంటర్వ్యూలో ఆర్కే ఫెయిలయ్యారా?
– షర్మిలను ప్రమోట్ చేయడమే ఆర్కే లక్ష్యమా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
నాకు అబద్ధం చెప్పడం అలవాటు లేదన్న షర్మిలక్కయ్య ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో అంతా నిజమే చెప్పిందా?
రెండురోజుల నుంచి వరసగా ‘సమరసింహారెడ్డి’ ట్రైలర్ చూపిన ఆర్కే, చివరాఖరున ‘సీమశాస్త్రి’ సినిమా చూపించారా?
తనకూ, తోడబుట్టిన జగనన్నయ్యకూ విబేధాలు లేవన్న షర్మిలక్కయ్య మాట బైబిల్ సాక్షిగా నిజమేనా?
లేక ఆమెనే చెప్పినట్లు.. అన్నాచెల్లి బంధం ఇంకా ‘ఫెవికాల్’ మాదిరిగా బలంగానే ఉందా?
సహజంగా అందరికీ యక్ష ప్రశ్నలు వేసే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు..‘‘ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే -షర్మిల ఏపిసోడ్ ’’ చూసిన ప్రేక్షకుల ప్రశ్నలివి!
తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్న షర్మిలక్కయ్యతో ఏబీఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూ అంటే ఎవరికయినా ఉత్కంఠ సహజం. పైగా ఏపీతో జగనన్నతో యుద్ధం చేస్తూ, తెలంగాణలో ఆయన చెల్లెలు షర్మిలక్కకు ప్రచారం ఇస్తున్న ఆర్కే అన్నయ్య.. తన శత్రువు చెల్లెలు నుంచి ఏం నిజాలు రాబడతారన్న ఉత్కంఠ ఎవరికయినా ఉంటుంది. ఆ ప్రకారంగా… జగనన్నయ్య తనను ఎలా అవమానించారు? ఏపీలో తనకు ఎలా స్థానం లేకుండా చేశారు? అసలు కుటుంబ కలహాల సంగతేమిటి? ఈసారి జగనన్నయ్యకు తానెందుకు రాఖీ కట్టలేదు? ఏపీలో రాజన్న రాజ్యమే నడుస్తుందా? లేదా? పెద్దాయన మృతి వెనుక రిలయన్స్ హస్తం ఉందని సకుటుంబ సపరివార సమేతంగా ఆరోపించి, తాజాగా అదే కంపెనీకి చెందిన నత్వానీకి రాజ్యసభ సీటిచ్చినప్పుడు.. షర్మిల-విజయమ్మ విబేధించారా? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలు షర్మిలక్కను అడుగుతారని, మెడపై తల ఉన్న ఎవరైనా ఊహించి తీరతారు. కానీ అవేమీ వినిపించకపోవడమే ‘అనుమానాలతో కూడిన ఆశ్చర్యానికి’ కారణం!
సహజంగా రాధాకృష్ణ కూడా అదే టైపు కాబట్టి, ఆయన నుంచి అలాంటి ప్రశ్నలే ఆశిస్తారు. కానీ అవేమీ లేకుండా.. బాలకృష్ణ సమరసింహారెడ్డి ట్రైలర్ చూపి, లైవ్‌లో మాత్రం అల్లరి నరేష్ ‘సీమశాస్త్రి’ సినిమా చూపించడం ఎవరికయినా నిరాశ కలిగించేదే. ప్రధానంగా.. ఏబీఎన్ ఆర్కే అన్నయ్య ఇంటర్వ్యూలు ఆసక్తిగా చూసే వారికి.. ఆయన తాజా షర్మిల ముఖాముఖి మాత్రం ఉప్పు లేని పప్పు, మసాలా లేని మాంసం కూర పెట్టినట్లుగానే కనిపించింది. సినిమాలో శుభం కార్డు పడిన తర్వాత, బయటకొచ్చే ప్రేక్షకుల కామెంటు మాదిరిగానే.. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ లేటెస్టు ఎపిసోడ్‌పైనా ఇలాంటి పేలవమైన కామెంట్లే కనిపించాయి. మరి అది షర్మిలక్క విజయమా? ఆర్కే అన్నయ్య వైఫల్యమా అన్నది తర్వాత సంగతి!
షర్మిలక్కయ్య మాత్రం ఆర్కే ప్రశ్నలకు సూటి సమాధానాలు ఇవ్వకుండా, చాకచక్యంగా తప్పించుకోవడం ఆమె రాజకీయ పరిణతికి నిదర్శనం. నిజానికి షర్మిల ఆ స్థాయిలో జవాబులిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఈ ఇంటర్వ్యూలో ఆర్కే, ఆమె నుంచి ఇంచి సమాచారం కూడా రాబట్టలేకపోవడమే ఆశ్చర్యం. అమాయకమైన ముఖం, ఆచితూచి మాట్లాడిన మాటల్లో కచ్చితత్వం, నేర్పుగా తప్పించుకునే లౌక్యం, జగనన్నయ్యను నొప్పించని చాకచక్యం, కుటుంబం కలిసే ఉందన్న సంకేతాలు ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఈ ముఖాముఖిలో ఏబీఎన్ రేటింగ్ పెరిగిందో లేదో తెలియదు కానీ, ఒక నాయకురాలిగా షర్మిల ఇమేజ్ మాత్రం అమాంతం పెరిగిందన్నది నిస్సందేహం. ఆమెకు రాజకీయాల్లో గొప్ప భవిష్యత్తు ఉందన్న ముందస్తు సంకేతాలకు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఒక వేదికయిందన్నది నిష్ఠుర నిజం.
అయితే తండ్రి మృతి వెనుక అంబానీల హస్తం ఉందని గతంలో ఆరోపించి, దర్యాప్తు కోరిన కుటుంబానికి చెందిన ఆమె… ఈ ఇంటర్వ్యూలో మాత్రం అసలు అంబానీ ఎవరో తెలియనట్లు, ఆ ప్రస్తావననే విజయవంతంగా దాటవేయడమే విచిత్రం. పెద్దాయన మృతిపై మరోసారి విచారణకు డిమాండ్ చేయడం ద్వారా, అన్నయ్యను ఇరుకున పెడతారేమోనని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. అటు నిఖార్సయిన జర్నలిస్టయిన రాధాకృష్ణ కూడా, ఆ అంశాన్ని విజయవంతంగా విస్మరించడం మరో వైచిత్రి.
తెలంగాణలో కేసీఆర్ సర్కారుపై ధైర్యంగా విరుచుకుపడుతున్న షర్మిలక్కకు, సొంత మీడియా ‘సాక్షి’లో ఎందుకు కవరేజీ ఇవ్వడం లేదన్న ప్రశ్నను, సీనియర్ జర్నలిస్టు అయిన రాధాకృష్ణ విస్మరించడమే వింత. ఏపీలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు, మహిళలపై హత్యాచారాలు, మితిమీరిన అప్పుల గురించి రాధాకృష్ణ ప్రశ్నించలేదు. అటు ఆమె కూడా జవాబివ్వకపోవడం చూస్తే… తొలిసారి ముఖాముఖికి వచ్చిన షర్మిలక్కయ్యను, ఇప్పుడే ఇబ్బందిపెట్టడం ఎందుకునే ఆర్కే అన్నయ్య మొహమాటం స్పష్టంగా కనిపించింది. షర్మిల స్థానంలో ఎవరైనా ఉంటే, ప్రశ్నల వర్షం కురిపించే ఆర్కే.. ఇలాంటి కీలకమైన ప్రశ్నలను సంధించకపోవడమే ఆశ్చర్యం.
వైఎస్‌కు ఆంధ్రా-తెలంగాణ ప్రాంతాలు రెండు కళ్లుగా భావించేవారని చెప్పిన షర్మిలక్కయ్య.. మరి ఒక కన్నయిన ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాల గురించి, ప్రస్తావించేందుకు ఇష్టపడలేదంటే జగనన్నతో ‘ ఫ్యామిలీ ఫెవికాల్ ’ మొహమాటం ఉందని, చెప్పకనే చెప్పినట్లు లెక్క. కోవిడ్ నిర్వహణలో కేసీఆర్ విఫలమయ్యారని ధైర్యంగా చెప్పిన షర్మిలక్క.. మరి అదే కోవిడ్ నిర్వహణలో ఏపీ సర్కారు కూడా విఫలమయిందని, అంతే ధైర్యంగా చెప్పకపోవడం కూడా ‘ఫ్యామిలీ ఫెవికాల్’ బంధమే కారణమన్నది మెడ మీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. షర్మిల బీజేపీని ఎందుకు విమర్శించడం లేదన్న కేటీఆర్ ప్రశ్నను, ఆర్కే కూడా షర్మిల వద్ద ప్రస్తావించకపోవడం ఆశ్చర్యమే.
సరే.. తండ్రి మృతి వెనుక అంబానీలున్నారన్న ‘పాత’ ఆరోపణలు, మొహమాటం కోసం ‘కొత్త’గా ప్రస్తావించలేదనుకుందాం. మరి గత ఎన్నికల ముందు చిన్నాయన వివేకానందరెడ్డి హత్యపై కూడా షర్మిలక్క పెదవి విప్పకపోవడమే వింత. బాబాయ్ హత్యపై కోర్టుకెళ్లి, సీబీఐ విచారణ కోరిన అన్నయ్య.. ఆ తర్వాత మడమ తిప్పిన వైనం గురించి కూడా ప్రస్తావించి ఉంటే, ఆమె మరికొందరు అభిమానులను సంపాదించుకుని ఉండేది. ఆర్కే కూడా ఆ ప్రశ్న వేయకుండా.. కేవలం ‘బాబాయ్ కుటుంబానికి మద్దతునిచ్చారట’ కదా అని ప్రశ్నించి, షర్మిలక్క ఇమేజీని ఇతోథికంగా పెంచే ప్రయత్నం చేసినట్లే కనిపించింది.
సహజంగా రాధాకృష్ణ గురించి బయట ఎంత ప్రచారం ఉన్నా… ఆయన అజెండా ఏమిటన్నది బహిరంగమే అయినా.. ఒక జర్నలిస్టుగా ఆయనలోని ప్రొఫెషనిస్టుని మాత్రం ఎవరూ వేలెత్తిచూపలేరు. తెలుగు రాష్ట్రాల్లోని పత్రికాధిపతుల్లో దమ్ము-ధైర్యం ఉన్న ఒకే ఒక్కడు మగాడిగా ఆయనకున్న కీర్తిని ఎవరూ కాదనరు. అందుకే ఆయన ఆధ్వర్యంలో నడిచే మీడియా సంస్థలు, ఇంకా జనక్షేత్రంలో మనుగడ సాగిస్తున్నాయి. కానీ షర్మిలక్కతో ఇంటర్వ్యూ సందర్భంలో బ్రహ్మాండం బద్దలవుతుందని ఎవరూ ఊహించకపోయినా.. ఆమెకు అన్నతో విబేధాలు, ఇంటిగుట్టునయినా బయటపెడతారన్న అంచనా మాత్రం చాలామందికి ఉంది. కానీ తస్సాదియ్యా తుస్సుమంది అన్నట్లు.. షర్మిలక్కయ్య చేత ఒక్క ముక్క కూడా రాబట్టలేక, తెచ్చిపెట్టుకున్న నవ్వులతో తన వైఫల్యాన్ని ఆర్కే అన్నయ్య దాచేసినట్లు కనిపించింది.
ఇప్పటికే ఆయన మీడియా సంస్థలు తెలంగాణలో, షర్మిల పార్టీని ఇతోథికంగా పెంచుతున్నాయి. ఆమెను జనంలోకి తీసుకువెళ్లిన ఈ ఇంటర్వ్యూ కూడా ఆ ప్రమోషన్‌లో భాగమే అన్న అనుమానాలు పెంచింది. జగనన్నతో షర్మిలకు సత్సంబంధాలున్నాయని, అంతా భ్రమపడుతున్నట్లు ఇద్దరి బంధం ఏమీ చెడిపోలేదని తేలింది. అన్నా చెల్లెళ్లు ఒక అండర్‌స్టాండింగ్ ప్రకారమే రెండు రాష్ట్రాలనూ పంచుకున్నారనీ అర్ధమయింది. ఇద్దరి మధ్య ఆస్తుల పంచాయతీ కూడా పెద్దగా ఏమీ లేవని తెలిసిపోయింది. మొత్తంగా.. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఇంటర్వ్యూలో రాధాకృష్ణ ప్రేక్షకులకు కొత్తగా చెప్పిందేమిటంటే.. షర్మిలను కుటుంబసభ్యులను ‘షమ్మీ’ అని పిలుస్తారని! అదొక్కటే ఆయన ఇంటర్వ్యూలో కొత్తగా తేలిన పాత విషయం!

LEAVE A RESPONSE