– పంచాయితీ ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లపై రేవంత్ మొండి వైఖరి
– మునుగోడులో కళ్లకు గంతలు కట్టుకుని రోడ్డెక్కిన దివ్యాంగుల నిరసన
మునుగోడు: పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరును నిరసిస్తూ నల్గొండ జిల్లా మునుగోడులో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో, ముక్కు నేలకు రాసి వికలాంగుల వినూత్న నిరసన పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తమ పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు.
మునుగోడు లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రాకుండా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరును నిరసిస్తూ సంఘం నేతలతో కలిసి ముక్కు నేలకు రాసి వినూత్న నిరసన తెలిపిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. 78 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో సకలాంగుల పాలకుల చేత వంచించబడి అభివృద్ధికి నోచుకోని అట్టడుగున ఉన్న ఏకైక సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గమని పేర్కొన్నారు.
సకలాంగుల రాజకీయ నాయకులు వికలాంగులను కేవలం ఎన్నికల్లో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటూ అడుగడుగున వికలాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తూ వికలాంగుల సమస్యలపై చట్టసభల్లో మాట్లాడకపోవడంతో సకలాంగుల పాలకుల పాలనలో తమకు సంక్షేమం జరగదని గుర్తించే పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు వికలాంగుల జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని దేశంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలపై రాజీలేని పోరాటాలను కొనసాగించేందుకు సిద్ధమవుతున్నామని వెల్లడించారు.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని AICC ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి నేటికీ హామీనీ నెరవేర్చేందుకు ముందుకు రాకుండా తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండానే ఎన్నికలకు వెళ్లేందుకు కుట్రలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ముక్కు నేలకు రాసి మునుగోడులో తమ సంఘం నిరసన తెలిపిందని పేర్కొన్నారు.
ఈ నిరసనను చూసి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే పంచాయతీ ఎన్నికలు వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రావాలని లేకుంటే పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ సాధనకై రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై పెద్ద ఎత్తున తమ పోరాటాలను కొనసాగిస్తామని స్వష్టం చేశారు.
సంఘం మునుకోడు మండల అధ్యక్షులు తలారి సహదేవుడు అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చిన్నపాక మత్స్యగిరి రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి మునుగోడు మండలం ఉపాధ్యక్షులు ఒంటెపాక ముత్తయ్య సంగం చండూరు మండల అధ్యక్షులు ఆకారపు వెంకన్న రేణుక అలివేలు మంగమ్మ సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.