ప్రభుత్వ బ్రోకర్ల మాటలు నమ్మొద్దు

-అమరావతి సభను అడ్డుకుంటే రాష్ట్ర సమైక్యతకు భంగం
– మూడు ప్రాంతాల సమైక్యత కోసమే మధ్యస్థ రాజధాని
– అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య
శ్రీకాళహస్తి: ప్రజా రాజధాని అమరావతి పాదయాత్ర చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చేరుకుందని,మరో కొద్ది రోజుల్లో తిరుపతి దేవస్థానం చేసుకోబోతున్నట్లు అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య తెలిపారు. శ్రీకాళహస్తిలో జరుగుతున్న పాదయాత్ర నుండి పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుపతిలో మహాపాదయాత్ర బహిరంగ సభకు అనుమతి ఇవ్వొద్దని కొద్దిమంది రాయలసీమ మేధావులుగా చెప్పుకుంటున్న ప్రభుత్వ మద్దతుదారులు ఫిర్యాదులు చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
కర్నూల్లో న్యాయస్థానం ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లకు తిరుపతిలో పర్మిషన్ ఎలా ఇస్తారని వాళ్లు అడుగుతున్నారని, అమరావతి సభ పెడితే రాష్ట్రంలో ప్రాంతీయ భావోద్వేగాలు పెరుగుతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు బాలకోటయ్య పేర్కొన్నారు. నిజానికి 13 జిల్లాల మధ్య ప్రాంతమైన అమరావతికి

అన్యాయం జరిగితే,రాష్ట్రంలో ఏర్పాటు వాదానికి బీజం పడుతుందని, మూడు ప్రాంతాల ప్రజల మధ్య విభజన రేఖలు మొలకెత్తుతాయి ఆయన చెప్పారు. అతి చిన్న 13 జిల్లాల రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకే 34 వేలఎకరాలు కావాలని, విజయవాడ సమీపంలో రాజధాని ఉండాలని ప్రతిపక్ష పార్టీ హోదాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అమరావతి పాదయాత్ర రాయలసీమకో, ఉత్తరాంధ్రకో వ్యతిరేకం కాదని, రాజధాని రక్షణ కోసమేనని అన్నారు.వికేంద్రీకరణ అంటే రాజధానిని విభజించటం కాదని ఆయన తెలిపారు. అభివృద్ధి పేరిట మూడు రాజధానుల మాట చెప్పి ప్రభుత్వమే విభజన రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని, కొద్దిమంది ప్రభుత్వ కోవర్టులను, ముసుగు మేథావులను అమరావతి పాదయాత్రపై విషం చిమ్మే బాద్యతలు అప్పచెప్పినట్టు ఆయన ఆరోపించారు. రాజధాని ఉద్యమం ప్రారంభం నుండి అమరావతి ఉద్యమకారులపై జరుగుతున్న అసత్య ప్రచారాలలో ప్రభుత్వ భజన పరుల భావోద్వేగాల ప్రచారం కూడా అలాంటిదే అని బాలకోటయ్య స్పష్టం చేశారు.

Leave a Reply