Suryaa.co.in

Andhra Pradesh

కొత్త జిల్లా పేర్లలో “పింగళి వెంకయ్య” పేరును మరవొద్దు

అమరావతి: దేశ జాతీయ పతాక రూపశిల్పి “పింగళి వెంకయ్య” పేరు మీద దేశానికి మువ్వన్నెల పతాకాన్ని అందించి,స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా ఆయనతో సాన్నిహిత్యం ఉన్న కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు పింగళి వెంకయ్య జిల్లాగా (పి.వి.జిల్లా) ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరుతో నూతన జిల్లా పేరు ఏర్పాటు చేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ డిమాండ్ చేశారు.

ఆనాడు గాంధీజీ పిలువు మేరకు జాతీయపతకాన్ని మత సామరస్యానికి ప్రతీకగా రూపకల్పన చేసారని, దాన్ని ఆనాటి నాయకులందరూ ఆమోదించారని, అప్పటి నుండి ఎప్పటికి ఆ త్రివర్ణ పతాకాన్ని మాత్రమే ప్రపంచం మొత్తం గౌరవించడం జరుగుతుందని, దేశానికి అంతటి ఖ్యాతిని అందించిన అటువంటి మహోన్నత వ్యక్తి పేరుతో జిల్లాను ఏర్పాటు చేస్తే ఆయనకు ఆయన జన్మించిన ఈ రాష్ట్రం శాశ్వత నివాళులు అందజేస్తున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారని, గతంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి సేవలకు గుర్తుగా ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారని,అదే విధంగా “పింగళి వెంకయ్య” పేరుతో నూతన జిల్లా ఏర్పాటు చేస్తే భావితరాలకు ఆయన పేరు చిరస్థాయిగా గుర్తుండిపోతుందని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న దేశ స్వాతంత్ర్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగానే ఆయనను గౌరవిస్తూ ఆయన పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపారు.

ప్రధాని మోడీ కూడా ఆయన సేవల్ని కొనియాడారని,అలానే ముఖ్యమంత్రి వైస్. జగన్మోహన్ రెడ్డి “పింగళి వెంకయ్య జయంతి” రోజున మాచర్ల వెళ్లి మరీ వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేసారని, అలానే ఆయన పేరుతో జిల్లా కూడా ఏర్పాటు చేస్తే వెంకయ్యకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సముచిత గౌరవం ఇచ్చినట్లేనని, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించే 26 జిల్లాల్లో కచ్చితంగా ఏదో ఒక జిల్లాకు “పింగళి వెంకయ్య”(పి.వి.జిల్లా) పేరుతో కొత్తగా జిల్లాను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కి, రాష్ట్ర ప్రభుత్వంకు శ్రీధర్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE