Suryaa.co.in

Andhra Pradesh

ఎంపీ పదవి కోసం ఇంతగా దిగజారాలా నానీ?

– రెండుసార్లు ఎంపీగా గెలిపించిన టీడీపీని, రాజకీయంగా పైకి తీసుకొచ్చిన చంద్రబాబుని కాదని దుర్మార్గుడి పంచన చేరి దుర్భాషలాడతావా?
• తన ట్రావెల్స్ వ్యాపారం నానీ వదులుకోవడానికి కారణం నష్టాలు రావడం వల్లే. ఆ నష్టాలు భర్తీ చేసుకోవడానికే ఆస్తులు అమ్ముకున్నాడు
• చంద్రబాబు పడుతున్న కష్టం చూసి తామంతా పార్టీకోసం మౌనంగా అవమానాలు భరిస్తే, నానీ మాత్రం ప్రోటోకాల్ పిచ్చితో ఇష్టానుసారం ప్రవర్తించాడు
• లోకేశ్ పాదయాత్రలో యువతలో చైతన్యం వచ్చి నేడు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సభలకు యువత కదిలివస్తుంటే నానీకి కనిపించడం లేదా?
• ఓడిపోయినా దెబ్బతిన్న బెబ్బులిలా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలోనే తిరిగి, చివరకు కరకట్ట కమల్ హాసన్ ఓటమిభయంతో రాజీనామా చేసేలా చేశాడు
• నిన్నటివరకు దుర్మార్గుడిలా కనిపించిన జగన్ రెడ్డి.. ఇప్పుడు నానీకి సన్మార్గుడు అయ్యాడా?
• దుర్మార్గుడితో ఉండాలనుకుంటే అది నానీ ఇష్టం.. కానీ అమరావతి రైతుల్ని, అమ్మలాంటి పార్టీని కించపరచడం ఏమిటి?
• జగన్ రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం చంద్రబాబుని, లోకేశ్ ని దుర్భాషలాడటం ఏమిటి?
• 2019 ఎన్నికల్లో నానీ గెలుపుకోసం విజయవాడ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ అభ్యర్థులు, పార్టీ డబ్బు ఖర్చుపెట్టింది తప్ప, నానీ రూపాయి పెట్టలేదు
• టీడీపీ కార్యకర్తల స్వేదం.. రెక్కల కష్టం వల్లే నాకైనా..నానీ కైనా పదవులు దక్కాయి
• నానీ గానీ, నేనుగానీ మా చర్మం వలిచి చెప్పులు కుట్టించి టీడీపీకి ఇచ్చినా ఆ రుణం తీరదు
• పదవిలో ఉన్నానన్న అహంకారంతో నానీ మాట్లాడినా, చంద్రబాబుపై గౌరవంతో, పార్టీకోసం సర్దుకుపోయాం
• విజయవాడ నగరాభివృద్ధి, ఉమ్మడి కృష్ణాజిల్లా అభివృద్ధికోసం టీడీపీ హయాంలో చంద్రబాబు వందలకోట్లు కేటాయించారు
• 2019 నుంచి ఇప్పటివరకు నానీ విజయవాడ అభివృద్ధికోసం జగన్ రెడ్డితో మాట్లాడి ఒక్కరూపాయి కూడా ఎందుకు తీసుకురాలేదు?
• టీడీపీప్రభుత్వంలో ప్రారంభించిన అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనుల్ని జగన్ రెడ్డి హాయాంలో ఎందుకు పూర్తిచేయించలేకపోయాడు?
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

కేశినేనినాని వ్యాఖ్యలు ఆయన అవకాశవాద రాజకీయాలు, దిగజారుడుతనానికి ప్రతీకలని, విజయవాడ లోక్ సభ సభ్యుడిగా గెలిపిస్తేనే చంద్రబాబునాయుడు, లోకేశ్ లు ఆయనకు బంగారమా అని, కేవలం తనకు సీటు రాదన్న అభద్రతా భావంతోనే నాని పార్టీ మార్చాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ ప్రజలిచ్చిన అధికారంతో ల్యాండ్..శాండ్.. వైన్.. మైన్.. సెంటు పట్టాలు, ఇతర కుంభకోణాల్లో రూ.2.50లక్షల కోట్లు దోపిడీచేసిన ఒక అవినీతిపరుడి పక్కన చేరిన కేశినేని నాని… చంద్రబాబునాయుడు, లోకేశ్ లపై విమర్శలు చేయడం సిగ్గుచేటు.ఎంపీ పదవి కోసం ఇంతగా దిగజారాలా అని నానీని ప్రశ్నిస్తున్నా. నిన్నటి వరకు ఆహా..ఓహో అన్న నోటికి ఇప్పుడు మేం చెడ్డవాళ్లమైపోయామా? ఎంతమంది టీడీపీ కార్యకర్తల రెక్కల కష్టంతో తాను రెండుసార్లు ఎంపీగా గెలిచాడో నాని మర్చిపోయినా… మా పార్టీ మర్చిపోలేదు. గతంలో ప్రజారాజ్యం పార్టీని ఏ విధంగా నాని విమర్శించాడో తెలుసు. చంద్రబాబు గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు నానీ ఆయన్ని కలిశారు. అప్పుడు ఆయన నానీకి విజయవాడ ఎంపీగా అవకాశమిచ్చారు.

విజయవాడ మరియు ఉమ్మడి కృష్ణా జిల్లా అభివృద్ధికి చంద్రబాబు వందలకోట్లు కేటాయించారు
టీడీపీ ప్రభుత్వంలో విజయవాడ నగరం బ్రహ్మండంగా అభివృద్ధి చెందింది. కృష్ణా జిల్లా టీడీపీ నాయకత్వం సామూహికంగా విజయవాడ నగరాభివృద్ధికి కృషి చేసింది. జిల్లా అభివృద్ధికి పాటుపడింది. పుష్కరాల సమయంలో వందలకోట్లతో కృష్ణానది వెంబడి ఘాట్ లు నిర్మించి, రోడ్లు వేసింది టీడీపీప్రభుత్వం కాదా? టీడీపీప్రభుత్వంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఎస్సీల అభివృద్ధికి, ఎస్టీలు.. బీసీలు..మైనారిటీల అభివృద్ధికి ఎన్నికోట్లు ఖర్చుపెట్టారో నానీకి తెలుసా ? కేంద్రమంత్రి గడ్కరీతో మాట్లాడి కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మించింది చంద్రబాబు కాదా? గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి నాడు కేంద్రమంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు చొరవతీసుకుంది నిజం కాదా?

విజయవాడ నగరంతోపాటు, చుట్టు పక్కల పచ్చదనం-పరిశుభ్రత కోసం టీడీపీప్రభుత్వం ఎన్ని నిధులు ఖర్చు చేసిందో నానీకి తెలియదా? 2019 నుంచి ఇప్పటివరకు నానీ ఎప్పుడైనా విజయవాడ నగరాభివృద్ధికి నిధులు ఎందుకు ఇవ్వరని జగన్మోహన్ రెడ్డిని నిల దీశాడా? టీడీపీప్రభుత్వంలో ప్రారంభమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఆగిపోతే ఏనాడైనా నానీ, ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడాడా? ప్రోటోకాల్ పేరుతో నానీ టీడీపీ నాయకులపై పడి ఏడవడం తప్ప, ఎప్పుడూ విజయవాడ అభివృద్ధి కోసం అధికారపార్టీతో మాట్లాడిందే లేదు.

ఎంపీ టికెట్ కోసం నేడు విజయవాడలో.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ హాయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని నానీ చెప్పడం దిగజారుడుతనం కాక మరేమిటి? జగన్ రెడ్డి కళ్లల్లో ఆనందం చూడటానికి ఇంతగా దిగజారాలా అని నానీని ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు తన ఆలోచనల్ని అమలుచేయడంకోసం, అభివృద్ధి చేయడంకోసం తనకు నచ్చిన నాయకులతో ఆ పనులు చేయిస్తాడు. దానికే ఇతరులపై పడి నానీ ఏడిస్తే ఎలా?

దేశంలోని అతికొద్ది మంది రాజకీయ నాయకుల్లో చంద్రబాబు ఒకడని పొగిడిన నానీకి, నేడు అదే చంద్రబాబు మోసగాడు అయ్యాడా?
“దేశంలో నిజాయితీ ఉన్న అతికొద్ది మంది నాయకుల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒకరు” అని కేశినేని నాని సెప్టెంబర్-8, 2023న అన్నారు. అదే చంద్రబాబు ఇప్పుడు పచ్చిమోసగాడు అయ్యాడా? అప్పటికీ ఇప్పటికీ ఇంతగా దిగజారాలా నానీ? ఇంతలో ఏమైందో సమాధానం చెప్పు.

వ్యాపారంలో నష్టాలొచ్చి.. ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికే నానీ తన ట్రావెల్స్ వ్యాపారం వదులుకున్నాడు తప్ప.. చంద్రబాబు చెప్పాడని కాదు
రవాణాశాఖ అధికారులతో గతంలో విజయవాడలో గొడవ జరిగినప్పుడు తన బస్సులు సీజ్ చేయబడి.. వ్యాపారంలో నష్టాలొచ్చి… ఆ నష్టాల నుంచి బయటపడేందుకు తనకు తాను వ్యాపారం వదులుకున్న నానీ, నేడు తన చర్యల్ని టీడీపీకి ఆపాదించడం…చంద్రబాబు చెబితేనే చేశానని చెప్పడం సరైందే నా? టీడీపీ నాయకులు తనను తిట్టారని, చంద్రబాబు తిట్టించారని చెప్పడం సరైందేనా? గతకొన్ని సంవత్సరాలుగా నానీ టీడీపీలో ఉంటూ సొంతపార్టీ నాయకుల్ని నోటికొచ్చినట్టు తిట్టింది నిజం కాదా? అన్నింటికంటే ముఖ్యంగా చంద్రబాబునాయుడు జైలు నుంచి వచ్చాక కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన సందర్భంలో, అహాంకారంతో నానీ మాట్లాడిన మాటలకు సాక్షాత్తూ ఆ తల్లి కనకదుర్గమ్మే నేడు ఆయన పతనానికి దారిచూపింది. దుర్గమ్మ సన్నిధిలో నానీ దుర్భాషలాడాడు.

దెబ్బతిన్న బెబ్బులిలా ఓడిపోయిన చోటే గెలవాలన్న పట్టుదలతో లోకేశ్ పనిచేశాడు కాబట్టే, కరకట్ట కమల్ హాసన్ వైసీపీకి రాజీనామా చేసి, నియోజకవర్గం వదిలి పారిపోయాడు
యువగళం పాదయాత్రతో లోకేశ్ యువతలో చైతన్యం తీసుకురావడమే గాకుం డా, తాడేపల్లి ప్యాలెస్ లోని వారి వెన్నులో వణుకు పుట్టించాడు. రాష్ట్రవ్యాప్తంగా 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన లోకేశ్ అన్నివర్గాల ప్రజల మన్ననలు పొందారు. యువగళం ప్రజాగళమై.. ప్రభంజనమై పెద్దఎత్తున యువతను చైతన్య పరిచారు. నేడు చంద్రబాబు ‘రా..కదలిరా’ సభలకు యువత కేరింతలు కొడుతోం ది అంటే కారణం లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రే. విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట.

అలాంటి చోట గెలిచిన నానీ, తన అహంకారంతో ఓడిపోయిన వారిని తిట్టినంత మాత్రాన మాకేమీ కాదు. కానీ తన అహంకారమే తనకు తీరని నష్టం చేకూరుస్తుందని నానీ గ్రహిస్తే మంచిది. తన వ్యాఖ్యలతో నానీ ఎంతోమంది టీడీపీ నాయకులు, కార్యకర్తల్ని అవమానించినా, రాష్ట్రంకోసం.. పార్టీ కోసం .. చంద్రబాబునాయుడిపై గౌరవంతో అవన్నీ భరిస్తున్నా రని నానీ తెలుసుకోవాలి. లోకేశ్ మంగళగిరిలో ఓడిపోయినా ఛాలెంజ్ గా తీసుకొ ని మరలా అక్కడే గెలవాలనే పట్టుదలతో దెబ్బతిన్న బెబ్బులిలా ప్రజల్లోనే తిరుగుతూ నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మార్చాడు. చేసేదిలేక, ఓటమి భయంతోనే కరకట్ట కమల్ హాసన్ వైసీపీకి రాజీనామాచేసి వెళ్లి పోయాడు.

వైసీపీ గూండాలు చంద్రబాబు ఇంటిపై.. టీడీపీ కార్యాలయంపై దాడిచేసినప్పుడు నానీ ఎక్కడున్నాడు? టీడీపీ పండుగైన మహానాడు జరిగేటప్పుడే ఢిల్లీ ఎందుకు వెళ్లాడు?
వైసీపీ గూండాలు గతంలో చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చినప్పుడు, మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు నానీ బయటకు రాలేదు. మాట మాత్రంగా కూడా స్పందించలేదు. ఒంగోలు మహానాడుకి లక్షలాదిగా పార్టీ కార్యకర్తలు తరలివస్తే, నానీఢిల్లీ వెళ్లిపోయాడు. రాజమహేంద్రవరంలో మహానాడు జరిగినప్పుడు కూడా ఢిల్లీలో కూర్చున్నాడు. ఈనాడు ఎంపీ హోదా లో నానీ అనుభవిస్తున్న ప్రొటోకాల్, ఇతర భోగాలన్నీ టీడీపీ కార్యకర్తల శ్వేదం వల్ల వచ్చినవేనని నానీ గుర్తించాలి. నేను నాలుగుసార్లు గెలిచినా అది కార్యకర్తల వల్లే. చంద్రబాబు ఇచ్చిన బీఫామ్, ఆయన నాయకత్వం వల్లే మనం నాయ కులం అయ్యాం. మన చర్మం వలిచి చెప్పులు కుట్టించి ఇచ్చినా, తెలుగుదేశం పార్టీ రుణం తీర్చుకోలేము. చంద్రబాబు నాకు 5 సార్లు అవకాశమిస్తే, నానీకి 2 సార్లు అవకాశమిచ్చారు. గెలిచానన్న అహంకారంతో అలాంటి వారిని దుర్భాష లాడితే ఎలా నానీ?

కొబ్బరి చిప్పల మంత్రి..అవినీతిపరుడని చెప్పిన నానీ, నేడు అదే వ్యక్తి కారులో తాడేపల్లి కొంపకు వెళ్లాడు
2019లో జరిగిన ఎన్నికల్లో నానీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో లాలూచీ పడి, టీడీపీకి అన్యాయం చేశాడు. నందిగామలో వసూల్ బ్రదర్స్, వెయ్యికోట్లు దోపిడీచేసిన వసంత కృష్ణప్రసాద్ నానీకి మంచివాళ్లా? వన్ టౌన్ లో కొబ్బరి చిప్పల మంత్రి అవినీతిపరుడని చెప్పిన నానీ, నేడు అదే వ్యక్తి కారులో తాడేపల్లి కొంపకు పోయి, బయటకు వచ్చి చిలుకపలుకులు పలికాడు. అమరావతి ఉద్యమంలో దాదాపు 200 మంది చనిపోయారు. రాజధాని రైతులపై 2వేలకు పైగా అక్రమ కేసులు పెట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. రైతులకు కౌలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నా డు. అలాంటి దుర్మార్గుడు నానీకి సన్మార్గుడు అయ్యాడా? టీడీపీ ప్రభుత్వంలో విజయవాడ సహా అమరావతి వైభవం ఎలా ఉంది.. ఇప్పడెలా ఉంది నానీ?

జగన్మోహన్ రెడ్డి పాలనలో నరకయాతన అనుభవిస్తున్న ప్రజలు నానీకి కనిపించడంలేదా?
నానీకి జగన్మోహన్ రెడ్డి పాలనలో కనిపించిన గొప్పతనం ఏమిటి? జీతాలు పెంచమని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రోడ్డెక్కిన అంగన్ వాడీ సిబ్బంది నానీకి కనిపించలేదు. పోలీసులతో దెబ్బలు తిన్న సర్వశిక్షా అభియాన్ సిబ్బంది కనిపించలేదు. జీతాలు అందడంలేదు మొర్రో అంటున్న 108-104 అంబులెన్సుల సిబ్బంది కనిపించడంలేదు. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పడుతున్న నరకయాతన కనిపించలేదు. వైసీపీ బీ ఫామ్ మాత్రమే నానీకి కనిపించింది.

తిరువూరు టీడీపీ ఇన్ ఛార్జ్ ను తిట్టి…. అక్కడి నాయకులు, కార్యకర్తలు జైళ్ల పాలు అయ్యేలా చేసింది నానీ అహంకారం కాదా?
తిరువూరు టీడీపీ ఇన్ ఛార్జ్ శావల దేవదత్ ను నానీ తిట్టిన తిట్లు… ఆయనపై నానీ తన మనుషులతో చేయించిన దాడి…. వేయించిన కుర్చీలు అన్నీ గుర్తు న్నాయి. ఎస్సీ నాయకుడు అని కూడా చూడకుండా నానీ దేవదత్ పై ప్రవర్తించిన తీరు ఎవరూ హర్షించరు. నానీ అహంకారంతో చేసిన చర్యలవల్ల 34 మంది టీడీపీ కార్యకర్త లు నేటికీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. 10 మంది టీడీపీ కార్యకర్తలు నూజివీడు జైల్లో ఉన్నారు. ఇదేనా నానీ..నీకు అండగా నిలిచిన టీడీపీ కార్యకర్తల పట్ల నీకున్న గౌరవం? బూతుల మంత్రిగా పేరు పొందిన కొడాలినానీ, పోలీస్ కమిషనర్ తో మాట్లాడి, తనవెంట ఉండే కొద్ది మంది నాయకుల పేర్లు కేసుల్లో లేకుండా తీయించిన నానీ, మిగతా నాయకులు, కార్య కర్తలపై ఎందుకు కేసులు పెట్టించాడు?

నానీ చేసిన పనికి నేటికీ టీడీపీ కుటుం బాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. జైల్లో ఉన్న టీడీపీ కార్యకర్తల కుటుంబాల్ని నానీ ఎందుకు పరామర్శించలేదు? చంద్రబాబుపడుతున్న కష్టం చూసి, ఆయనకు, రాష్ట్రానికి అండగా నిలవాల్సిన సమయంలో నానీ ఇలా చేయడం సరికాదు. చంద్రబాబుని, ఆయన కుటుంబసభ్యుల్ని దారుణంగా తిట్టిస్తున్నవ్యక్తి పంచనచేరి, తనస్వార్థం చూసుకున్న నానీకి ప్రజలే తగిన బుద్ధిచెబుతారు.

అమరావతిని నాశనంచేసి, భూములిచ్చిన రైతుల్ని వేధించిన జగన్ రెడ్డి .. నానీకి మంచివాడా?
టీడీపీ-జనసేన ప్రభుత్వం గెలవడం… అమరావతి నిర్మాణం పూర్తి కావడం తథ్యం. అమరావతి నగరం ఇటు విజయవాడ..అటు గుంటూరు నగరాల్లో కలిసిపోయి దేశంలోనే గొప్ప మహానగరంగా నిలవడాన్ని నానీ కూడా చూస్తాడు. ప్రజారాజధాని అమరావతిని నాశనంచేసి, రాజధాని రైతుల్ని రోడ్లపాలు చేసి, వారిపై తప్పుడు కేసులు పెట్టి హింసించిన జగన్ రెడ్డి, నానీకి మంచివాడు కావడం నిజంగా బాధాకరం. ఎన్నికలలో గెలుపోటములు సహజం.

గెలుపువల్ల వచ్చిన అహం కారం బలుపుతో నోటికి అడ్డూఅదుపు లేకుండా మాట్లాడటం నానీకి మంచిది కాదు. నిజంగా నానీ చెప్పాలనుకుంటే తాను విజయవాడకు చేసింది ఏమైనా ఉంటే చెప్పుకోవాలి. కానీ ఇలా బరితెగించి మాట్లాడితే చూస్తూ ఊరుకోం. టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఒక్కరు కూడా నానీ వెంట వెళ్లరు.” అని దేవినేని ఉమా తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE