అప్పుల సర్కారుకు మూడు రాజధానులు అవసరమా?

– తీర్పు వచ్చినా మూడు రాజధానుల పాటేనా
– రాజధానిపై జగన్ రెడ్డి మౌనం వీడాలి
-అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాజధానిపై ప్రకటన చేయాలి – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

అమరావతి : అప్పులతో పాలన కొనసాగిస్తున్న జగన్ రెడ్డి సర్కారుకు మూడు రాజధానులు అవసరమా ? అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాజధానిపై మౌనం వీడి స్పష్టమైన ప్రకటన చేయాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్ తన మూడు రాజధానుల ఆలోచనను మానుకుని ప్రజారాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ మేరకు శనివారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

తీర్పు వచ్చినా మూడు రాజధానుల పాటేనా?
రాజధాని అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయినా మంత్రులు 3రాజధానుల పాటే పాడుతున్నారు. జంబో సలహాదారుల మాటలు విని సుప్రీం కోర్టుకు వెళ్లకండి. ప్రజాధనం దుర్వినియోగం చేయకండి అని పీసీసీ చీఫ్‌ శైలజనాథ్‌ సలహా ఇచ్చారు. ఉత్తరాంధ్రలో మంత్రులు భూములు ఆక్రమించుకున్నారని, అందువల్లే కోర్టు తీర్పును సైతం వ్యతిరేకించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

జగన్ రెడ్డి ప్రభుత్వం గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 11 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్‌ బ్యాంకులో బాండ్ల వేలం ద్వారా రూ.43,000 కోట్ల రుణం సమీకరించిందని, ఇవి కాకుండా గత 11 నెలల్లో కేంద్రం నుంచి వచ్చిన రుణాలు, ఈఏపీ, నాబార్డు లోన్లు, ఉద్యోగుల జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ నిధులు దాదాపు రూ.15,000 కోట్ల వరకు ప్రభుత్వం వాడుకున్నా ఉద్యోగులకు సకాలంలో జీతాలు, పించన్లు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని ఆరోపించారు.

ప్రభుత్వం మారిన ప్రతీసారి రాజధాని మారిస్తే రాష్ట్రం అధోగతి పాలౌతుందని, మూడు రాజధానుల అంశాన్ని మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకించిందని, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని నాశనం చేసిందని మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేసిందని విమర్శించారు. వేల కోట్లతో నిర్మించిన భవనాలు అన్ని శిథిలావస్థకు చేరాయన్నారు. అమరావతి రాజధానికి తూట్లు పొడిచేలా వైసీపీ వ్యహరించిందన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ బయటకి వచ్చి ఏకైక రాజధానిగా అమరావతి అని ప్రకటించాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.

Leave a Reply