– ఈఓ, జేఈఓను నియమించేది ప్రభుత్వమే
– టీటీడీ బోర్డును నియమించేదీ ప్రభుత్వమే
– కేంద్రం నుంచి డెప్యుటేషన్లు తీసుకునేదీ సర్కారే
– ఉద్యోగుల అదనపు సౌకర్యాలకు అనుమతి ఇచ్చేదీ రాష్ట్ర ప్రభుత్వమే
– ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ప్రభుత్వ నియామకాలెందుకు?
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఆర్టీఐ అమలు
– సుప్రీంకోర్టు, రాష్ట్రపతిభవన్‌కూ ఆర్టీఐ వర్తింపు
– మరి టీటీడీకి ఎందుకు మినహాయింపు?
– భక్తుల విరాళాలతో నడిచే టీటీడీ ప్రత్యేకత ఏమిటి?
– భక్తులిచ్చే విరాళాలు, ఖర్చు చెప్పేందుకు భయమెందుకు?
– విరాళాల లెక్కలపై పారదర్శకత ఉండదా?
– శ్రీవాణి ట్రస్టు లెక్కలపై ఇంకా కొనసాగుతున్న విమర్శలు
– విరాళాలు, ఖర్చు, ఆదాయం తెలుసుకునే హక్కు భక్తులకు లేదా?
– వాటి సమాచారం ఇచ్చేందుకు భయమెందుకు?
– అందులో దేశరక్షణ రహస్యాలున్నాయా?
– ఆర్టీఐ పరిథిలోకి రాదంటున్న టీటీడీ అధికారులు
– ఆర్టీఐ అమలు కోసం సుప్రీంకోర్టుకెక్కనున్న భక్తులు
– ఇప్పటికే రిట్ అప్పీళ్లు పెండింగ్
– ఏళ్ల నుంచీ పెండింగ్ ఉండటంపై కారణమేమిటి?
– ఇక అది విచారణకు రావడం కష్టమేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర క్షేత్రం. దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తజనం.. స్వామివారికి పలికే జయజయధ్వానాలతో, ఆ కొండ ప్రతిధ్వనిస్తుంటుంది. ఆ స్వామిని దర్శిస్తే కోరిక కోర్కెలు నెరవేరతాయన్నది ఓ నమ్మకం. శతాబ్దాల నుంచీ భక్తజనాలకు అదే నమ్మకం. అందుకే తమకు ఉన్నంతలో కానుకలు సమర్పిస్తారు. మరికొందరు నిలువుదోపిడీ ఇస్తారు. పారిశ్రామికవేత్తలయితే లక్షలు, కోట్లు సమర్పిస్తారు. కారణం నమ్మకం. ఆ విరాళాలతో భక్తులకు సౌకర్యాలు సమకూరుతాయని, దేశవ్యాప్తంగా హిందూ ప్రచారానికి దేవాలయాలు నిర్మిస్తారని, వేదాలు పరిరక్షిస్తారన్న విశ్వాసం.
మరి తామిచ్చిన సొమ్ము సక్రమంగా వినియోగమవుతున్నాయా? లేవా? అని తెలుసుకునే హక్కు భక్తులకు ఉంటుంది కదా? ఆ డబ్బులతో ఏమేం ఖర్చు చేస్తున్నారని అడిగే హక్కు ఉంటుంది కదా? భక్తులు ఇచ్చిన విరాళాలు, దారి తప్పడం లేదన్న విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత అధికారులదే కదా?
కానీ.. అక్కడ మాత్రం అలా అడిగే హక్కు లేదట. ఆ సమాచారం ఇవ్వరట. అది అన్నింటికీ అతీతమట. అసలు సమాచారం ఇచ్చేందుకు ఆ దేవాలయం మినహాయింపట. వినడానికి విచ్రితంగా ఉన్నా, ఇది నిఖార్సయిన నిజం. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల తిరుమల దేవస్థానం అధికారుల వింత లీలలివి. తాము సమాచార హక్కు చట్టానికి మినహాయింపంటూ వాదిస్తున్న టీటీడీ ధోరణి ఇది.
దేశంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ సమాచార హక్కు చట్టం వర్తిస్తుంది. దేశ రక్షణ రహస్యాలకు సంబంధించిన అంశాలు తప్ప, మిగిలిన అన్ని శాఖల్లోనూ ఆర్టీఐ విజయవంతంగా అమలవుతోంది. చివరకు కోర్టులు కూడా ఆర్టీఐ పరిథిలోకి తీరుకురావడం విశేషం. ఇటీవల పార్లమెంటును కూడా, ఆర్టీఐ పరిథిలోకి తీసుకురావాలన్న డిమాండ్ వచ్చింది. కానీ రాష్ర్ట ప్రభుత్వ అజమాయిషీలో నడిచే, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అయిన టీటీడీ మాత్రం, ఆర్టీఐ పరిథిలోకి రాకపోవడమే ఆశ్చర్యం.
టీటీడీతో ప్రభుత్వానికి సంబంధం లేదని, అధికారులు చేసే విచిత్ర వాదన. కానీ టీటీడీ ఈఓ, జేఈఓలు, అడిషనల్ జేఈఓలను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది. కేంద్ర సర్వీసులో పనిచేసే అధికారులను, డెప్యుటేషన్‌పై టీటీడీకి తీసుకువచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. ఆ మేరకు వారిని రాష్ర్టానికి పంపించాలంటూ, డిఓపీటీకి స్వయంగా ప్రభుత్వమే లేఖ రాస్తుంది. ఇక టీటీడీ పాలకవర్గ సభ్యులను నియమించేది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. గతంలో జగన్ సర్కారు నియమించిన జంబో కమిటీకి హైకోర్టు బ్రేకులు వేసింది.
మరి ప్రత్యక్షంగా ప్రభుత్వ అధీనంలో ఉన్న టీటీడీ కి.. ఆర్టీఐ నుంచి మినహాయింపు ఇవ్వడం ఎందుకన్న ప్రశ్నలు కొన్నేళ్ల నుంచి వినిపిస్తున్నా, చర్యలు శూన్యం. కోర్టులు కూడా ఆర్టీఐ నుంచి మినహాయింపు కానప్పుడు, కేవలం టీటీడీకి మాత్రమే ఎందుకు మినహాయింపు ఇస్తున్నారన్న ప్రశ్నలకు, ఇప్పటిఇదాకా సమాధానం లేదు. ప్రభుత్వం నియమించే అధికారులకు.. టీటీడీ నుంచే జీతాలు ఇస్తున్నప్పుడు, ప్రభుత్వం అందులో ఆర్టీఐని ఎందుకు అమలుచేయదన్నది ప్రశ్న.
నిజానికి ప్రభుత్వం టీటీడీకి నయాపైసా ఇవ్వదు. ఇంకా కామన్‌గుడ్ ఫండ్ కింద ప్రభుత్వమే, టీటీడీ నుంచి నిధులు తీసుకుంటుంది. టీటీడీ వార్షిక బడ్జెట్ సుమారు 3 వేల కోట్లరూపాయలు. ప్రత్యక్షంగా-పరోక్షంగా దాదాపు 20 వేలమంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. అయితే భక్తులు ఇచ్చే విరాళాలకు, ఆదాయపపన్ను శాఖ మినహాయింపు ఇస్తుంది.
కేంద్రం నుంచి తమకు నచ్చిన అధికారులను ప్రభుత్వం డెప్యుటేషన్‌పై తీసుకువస్తుంది. టీటీడీ ఉద్యోగులకు అదనపు సౌకర్యాలు కావాలంటే ప్రభుత్వమే అనుమతి ఇవ్వాలి. అంటే ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఎక్కువగా ఉందని స్పష్టమవుతూనే ఉంది. కానీ అదే ప్రభుత్వం రూపొందించిన సమాచార హక్కు చట్టం మాత్రం, టీటీడీకి వర్తించకపోవడమే వింత.
టీటీడీ హుండీతో పాటు.. వివిధ పథకాలకు భక్తులు కోట్లాది రూపాయలు విరాళాలు ఇస్తుంటారు. వాటిలో నిత్యాన్నదాన పథకానికి ఎక్కువగా విరాళాలు వస్తుంటాయి. చాలామంది తమ ఆస్తులను సైతం టీటీడీకి రాస్తుంటారు. కూరగాయల నుంచి అలంకరణల వరకూ, దాతలే టీటీడీని పోషిస్తుంటారు. ఇక వివిధ బ్యాంకుల నుంచి నెలవారీ వడ్డీలే కోట్ల రూపాయల్లో ఉంటాయి.
ఆ ప్రకారంగా అన్నీ భక్తులే భరిస్తున్నందున, టీటీడీకి పెద్ద ఖర్చు ఉండదు. ఆ డబ్బుతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ వెంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తున్నారు. అవి కాకుండా, తీరప్రాంతాల్లో చిన్న దేవాలయాల నిర్మాణాలు, వేదపాఠశాలలు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలకు టీటీడీ నిధులు మంజూరు చేస్తుంది. ఇవన్నీ కేవలం భక్తులిచ్చిన విరాళాల నుంచే ఇస్తున్నారన్న విషయాన్ని విస్మరించకూడదు.
మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు విరాళాలు పోగయ్యే ఒక దేవాలయంలో, తామిచ్చిన విరాళాలు ఏమవుతున్నాయో.. తెలుసుకునే హక్కు భక్తులకు లేకపోవడమే విచిత్రం. గత కొన్నేళ్ల నుంచి టీటీడీ నిధులు, పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల శ్రీవాణి ట్రస్టు టిెక్కెట్ల ఖర్చులో అవకతవకలు జరిగాయంటూ టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపించాయి.
గతంలో స్వామి వారి పింక్ డైమండ్ మాయమైందని, అది చంద్రబాబు ఇంట్లో ఉందంటూ నాటి ప్రధానార్చకుడు రమణ దీక్షితులు, ఎంపి విజయసాయిరెడ్డి ఆరోపించారు. దానిపై అప్పటి టీటీడీ పావకవర్గం వారిపై పరువునష్టం దావా దాఖలైంది. దానికి సంబంధించి 2 కోట్ల రూపాయల ఫీజును టీడీపీ కోర్టుకు చెల్లించింది. ఇప్పుడు ఆ డబ్బు కోర్టులోనే డిపాజిట్ రూపంలో ఉంది.
ప్రభుత్వం మారి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇన్చార్జి జేఈఓ ధర్మారెడ్డి.. అసలు వెంకన్నకు పింక్ డైమండ్ లేదని, మీడియా సమక్షంలోనే వెల్లడించారు. అంటే వ్యక్తులు చేసిన ఆరోపణలకు, టీటీడీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందన్న మాట. మరి ఆ 2 కోట్ల రూపాయలు ఎవరి ఖాతా నుంచి వసూలు చేస్తారన్నది ప్రశ్న.
అయితే అదంతా భక్తుల డబ్బులే తప్ప, అధికారుల డబ్బు కాదు. ఇలా వృధా ఖర్చు ఎంత చేశారు? ఏ సేవాపథకాలకు ఎన్ని విరాళాలు వచ్చాయి? వాటిని ఏ పద్దు కింద చూపించి ఖర్చు చేశారు? రోజుకు ఎన్ని టిక్కెట్లు అమ్ముతున్నారు? వాటికి వచ్చేదంత? రోజుకు వీవీఐపీల దర్శనాలు ఎన్ని అనుమతిస్తున్నారు? అందులో జడ్జిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు ఎంతమంది? అన్న వివరాలను భక్తులకు ఇవ్వాల్సిన బాధ్యత టీటీడీ అధికారులదేనంటున్నారు. తమ డబ్బుకు లెక్క అడిగే హక్కు తమకుందన్నది భక్తుల వాదన.
ఇదిలాఉండగా జస్టిస్ కోదండరామ్ సింగిల్‌బెంచ్ జడ్జిగా ఉన్నప్పుడు.. 2018లో ప్రభుత్వ నిధులతో సంబంధం లేని దేవాలయాలను, ఆర్టీఐ నుంచి మినహాయింపు ఇస్తూ తీర్పు వెలువ డింది. అయితే, దానిపై అనేక రిట్ అప్పీళ్లు అప్పటినుంచీ ఇంకా పెండింగ్‌లోనే ఉండటం ప్రస్తావనార్హం. వాటిని ఇప్పటిదాకా విచారణ దశకు రాకుండా, కొన్ని అదృశ్య శక్తులు అడ్డుపడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవి విచారణ దశకు ఎన్ని దశాబ్దాలకు వస్తాయన్నది కూడా ఎవరికీ తెలియదు.
కాగా వివిధ వర్గాలకు చెందిన వీఐపీలతో పాటు.. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వారి బంధుమిత్రులు భారీ సంఖ్యలో తిరుమల దర్శనాలకు నిరంతరం వస్తుంటారు. రాష్ట్రంలో శ్రీశైలం, బెజవాడ కనకదుర్గమ్మ, సింహాచలం వంటి పెద్ద దేవాలయాలున్నప్పటికీ, తిరుమలకే వీవీవీఐపిల తాకిడి ఎక్కువ. వారందరికీ టీడీపీ అధికారులు దగ్గరుండి మరీ దర్శన-విడిదిఇ ఏర్పాట్లుచేస్తుంటారు.
దానితో టీటీడీ జేఈఓలకు సహజంగానే న్యాయమూర్తులతో వ్యక్తిగత సంబంధాలు ఏర్పడుతుంటాయి. వారిని స్వాగతించడానికి ప్రొటోకాల్ విభాగం ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు జేఈఓలే వారికి స్వాగతం పలికి, దగ్గురుండి మరీ సౌకర్యాలు పర్యవేక్షిస్తుంటారు. టీటీడీ జేఈఓలుగా పనిచేసిన వారికి మంత్రులు, ఎంపీలు, ఒక్కోసారి ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ పలుకుబడి ఉండటానికి ఈ సన్నిహిత సంబంధాలే కారణమన్నది బహిరంగమే.
కేంద్రమంత్రులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల చైర్మన్లతో జేఈఓలకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటాయన్నది తెలిసిందే. కేంద్రమంత్రులతోపాటు, కేంద్రానికి సన్నిహితంగా ఉండే ప్రముఖులకు తిరుమల లడ్డు, ప్రసాదాలు భారీ సంఖ్యలోనే ఢిల్లీకి చేరుతుంటాయన్నది బహిరంగ రహస్యం.
కాగా టీటీడీకి ఆర్టీఐ మినహాయింపు ఎందుకు ఇచ్చారన్న దానిపై ఆర్టీఐ కమిషనర్లకు వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అయితే జస్టిస్ కోదండరాం ఆధ్వర్యంలోని సింగిల్‌బెంచి దానిపై ఇప్పటికే తీర్పు ఇచ్చినందున, ఆ దరఖాస్తులను డిస్పోజ్ చేసినట్లు ఆర్టీఐ కమిషనర్ జనార్దన్ వెల్లడించారు.
అయితే భక్తులు-ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న టీటీడీని ఆర్టీఐ నుంచి మినహాయింపు ఇవ్వడం అసమంజసమని ఐఎన్‌టియుసి అధ్యక్షుడు, తిరుమల పరిరక్షణ సమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుంచి టీటీడీకి డెప్యుటేషన్ మీద తీసుకువస్తున్న ప్రభుత్వం, టీటీడీని ఆర్టీఐ పరిథిలోకి ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు.
‘‘సేవా టికెట్లు, వీఐపీ, ప్రొటోకాల్ దర్వనాలు, టీటీడీ చానెల్‌కు భక్తులిచ్చే విరాళాల్లో అవకవతకలు జరిగాయని నా దృష్టికి వచ్చింది. దానికి సంబంధించి టీటీడీకి ఆర్టీఐ కింద దరఖాస్తు చేశా. నేను అన్నదాన పథకానికి లక్ష రూపాయల విరాళమిచ్చా. గోవిందమాల వేసినప్పుడల్లా కానుకలు సమర్పిస్తా. నాతోపాటు లక్షలాది మంది ఇలాగే విరాళాలిస్తున్నారు. వాటి లెక్కల సమాచారం అడిగా. కానీ టీటీడీ ఆర్టీఐ పరిథిలోకి రాదని అధికారులు సమాధానం ఇచ్చారు. ప్రజల డబ్బు ఇమిడి ఉన్న సంస్థలను ఆర్టీఐ నుంచి ఎలా మినహాయింపు ఇస్తారు’’ అని ప్రశ్నించారు.
ఆర్టీఐ మినహాయింపు ఇవ్వడానికి టీటీడీ రక్షణ శాఖ కాదు. కొండపైన రక్షణ రహస్యాలేమీ ఉండవు. అన్ని ప్రభుత్వ శాఖలు ఆర్టీఐ పరిథిలోకి వస్తే టీటీడీని మాత్రమే ఎందుకు మినహాయిస్తారు? మరి సమాచారం ఇవ్వడానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్ధం కావడం లేదని నవీన్ వాపోయారు.
‘‘ తమ విరాళాలు ఏమవుతున్నాయో తెలుసుకునే హక్కు భక్తులకు ఉంది. నేను అవకతవకలు బయటపడకుండా చాలా పెద్ద స్థాయిలో, పెద్దల సహకారంతో ఆర్టీఐని చేర్చకుండా కుట్ర జరుగుతోంది. ఇన్నాళ్లూ ఈ అంశంపై రిట్ అప్పీళ్లు ఇప్పటిదాకా ఎందుకు విచారణకు నోచుకోవడం లేదో భక్తులకు తెలియాలి. ఇందుకు అడ్డుగా ఉన్న అంశాలేమిటో తెలుసుకునే హక్కు భక్తులకు ఉంది. దీనిపై నేను సుప్రీంకోర్టుకు వెళతా. టీటీడీని ఆర్టీఐ పరిథిలోకి తెచ్చేంతవరకూ న్యాయపోరాటం చేస్తా’’ అని నవీన్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.