-పీలేరు, పుంగనూరుకి నీళ్లొచ్చాయా?
-పెద్దిరెడ్డి ఆయన కొడుకు, తమ్ముడు బందిపోట్ల మాదిరి తయారయ్యారు
-తంబళపల్లెలో ఎక్కడ స్ధలం కనపడితే దాన్ని కబ్జా చేస్తున్నారు
-అప్పులు జగన్ కడతాడా? సాక్షి యాజమాన్యం కడుతుందా? భారతి సిమెంట్ కడుతుందా?
-రాష్ట్రానికి వైసీపీ అవసరమా?
-జగన్ ని ఓడించేందుకు జనం సిద్దం
-వచ్చే కురుక్షేత్ర సంగ్రామానికి టీడీపీ, జనసేన సిద్దం
-వైసీపీకి అభ్యర్దులు దొరకటం లేదు
-వై నాట్ 175 కాదు, వైనాట్ పులివెందుల
-వైసీపీ పాలనలో పేదల బ్రతుకులు ఛిద్రం
-నాడు అదే బడ్జెట్, నేడు అదే బడ్జెట్ అన్నావ్.. పన్నులు ఎందుకు వేశావ్, అప్పులు ఎందుకు చేశావ్
-చేసిన అప్పులు ఎవరు కడతారు? సాక్షి యాజమాన్యమా? భారతి సిమెంటా?
-టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
*పీలేరు : వైసీపీ పని అయిపోయిందని, ఆ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్దులు కూడా దొరకటం లేదని రేపు జరగబోయే కురుక్షేత్ర ధర్మ యుద్దంలో టీడీపీ, జనసేనదే గెలుపు అని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్లపాటు దోచుకున్న సొమ్ముతో ‘సిద్దం’ అంటూ జగన్ రెడ్డి ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. వైసీపీని ఓడించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు.
జగన్ రెడ్డికి ఇంటికి పంపేందుకు రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు సిద్దంగా ఉన్నారు. ఎన్నికలయ్యాక వైసీపీ జెండా పీకేయటం ఖాయం. రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ ప్రజలకు అవసరమా? యుద్దం ప్రారంభమైంది, దీనికి మేం సిద్దం మీరు సిద్దమా? వచ్చే కురుక్షేత్ర ధర్మ యుద్దంలో గెలుపు టీడీపీ, జనసేనదే. గత ఎన్నికల్లో జగన్ ముద్దులకు మురిసిపోయి ఓట్లేశారు.
ఈ ప్రాంతంలో జగన్ చేసిన అభివృద్ది ఏంటి? ఒక్క ప్రాజెక్టు కట్టాడా, ఒక్క పరిశ్రమ తెచ్చాడా? నేను రాయలసీమ బిడ్డనే నాలో ప్రవహించేది రాయలసీమ రక్తమే. టీడీపీ 5 ఏళ్ల పాలనలో రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 12,500 కోట్లు ఖర్చు చేశాం. ఈ 5 ఏళ్లలో జగన్ రెడ్డి ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా?
పీలేరు, పుంగనూరుకి నీళ్లొచ్చాయా? రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి. తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు నగరి అన్ని ప్రాజెక్టులు టీడీపీ హయాంలో ప్రారంభమైనవే. వాటిని పూర్తి చేసే బాధ్యత టీడీపీదే. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు శ్రీశైలం ద్వారా 120 టీఎంసీలు ఇచ్చిన ఘనత టీడీపీదే. టీడీపీ ఉంటే గోదావరి నీళ్లు బనకచర్లకు తీసుకొచ్చే వాళ్లం. ప్రతి సంవత్సరం 2 వేల టీంఎసీ గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. తవ్విన కాలువలు పూర్తి చేసి ఈ నీటిని తెస్తే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది.
రాయలసీమను పండ్ల తోటలకు హబ్ గా చేయాలని కృషి చేశా. దుర్మార్గులు అంతా నాశనం చేశారు. నాడు 90 శాతం సబ్సిడితో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 40 మంది చనిపోయారు. 450 ఇండ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు ఆ డ్యాం కట్టారా? బాధితులకు ఏం న్యాయం చేశారు? ప్రాజెక్టు గేట్లకు గ్రీసు వేయలేని సీఎం 3 రాజధానులు కడతారా? ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబానికి రూ. 1 లక్ష చొప్పున ఇచ్చాం.
రూ. 10 ఇచ్చి రూ. 100 లాగేయటం జలగన్న పాలసీ
జగన్ రెడ్డి అబద్దాలు చెప్పటంలో పీ.హెచ్ డీ చేశాడు. రూ. 10 ఇచ్చి రూ. 100 దోచుకుంటున్నాడు. అదే జలగన్న పాలసీ. బటన్ నొక్కుడు లో ఎంత దోచావో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. టీడీపీ ప్రభుత్వం ఉన్నపుడు లేని పన్నులు, అప్పులు ఇప్పుడు ఎందుకు వచ్చాయో ప్రజలు ఆలోచించాలి. కరెంట్ చార్జీలు 5 రెట్లు పెంచారు. మద్య నిషేదంపై మాట తప్పి మద్యం రేట్లు పెంచి నాసిరకం మద్యంతో పేదల రక్తం త్రాగుతున్నారు. మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకులేవు?
మద్యంపై నెలకు రూ. 6 వేల చొప్పున ఏడాదికి రూ. 72 వేల రూపాయలు ప్రజలు సొమ్మును మింగుతున్నారు. నాసిరకం మద్యంతో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నిత్యవసర ధరలన్నీ పెరిగి పేదల బతుకులు ఛిద్రమయ్యియి. నాడు ఉచిత ఇసుక నేడు బంగారమైంది. ఎక్కడ చూచినా ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. నాటి కంటే నేడు బడ్జెట్ పెరిగింది, కేంద్రం నిధులు పెరిగాయి, కానీ బాదుడే బాదుడు. నాడు పన్నుల మోత, అప్పుల బాధ లేదు. 100 కి పైగా సంక్షేమ పధకాలు అందించాం. నేడు అవన్నీ ఏమయ్యాయి? విధ్వంసకర, అసమర్ద పాలనతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత యువత తీసుకోవాలి. ప్రజల్ని చైతన్యం చేయాలి. విపరీతంగా అప్పులు పెరిగాయి. పెరిగిన అప్పులు జగన్ కడతాడా, సాక్షి యాజమాన్యం కడుతుందా? భారతి సిమెంట్ కడుతుందా? ప్రజలే కట్టాలి.
సైకో పాలనలో నష్టపోని వర్గం లేదు
వైనాట్ కుప్పం, 175 కి 175 సీట్లన్నారు. నేడు పీలేరు సాక్షిగా చెబుతున్నా వైనాట్ పులివెందుల. జగన్ 68 మంది ఇన్ ఛార్జులను మార్చారు, మీ ఊర్లో చెత్త వేరే ఊర్లో వేస్తే బంగారమవుతుందా? ప్రజలు కులం, మతం, ప్రాంతం చూసి ఓట్లేస్తే న్యాయం జరుగుతుందా? సుపరిపాలన ఇవ్వడం తెలిసిన పార్టీ టీడీపీ. ఎన్టీఆర్ ఆశించిన అభివృద్ధిని ముందుకు తీసుకుపోతాం. ఒక వ్యక్తి మానసికంగా సరిగా లేకపోతే ఎన్ని ఇబ్బందులకు గురి అవుతారో 5 ఏళ్లుగా చూస్తున్నాం. సైకో పాలనలో నష్టపోని, ఇబ్బందులకు గురి కాని వ్యక్తి ఎవరైనా ఉన్నారా?
అన్ని మతాలు, కులాలకు న్యాయం చేస్తాం. రాయలసీమకి న్యాయం చేసింది, చేయబోయేది టీడీపీ. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు భవిష్యత్ గ్యారెంటీతో ముందుకు వచ్చాం. ప్రతి ఆడబిడ్డకు రూ.1500, భవిష్యత్ లో తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలుంటే చదువు కోసం అందరికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ధరలు తగ్గించే బాధ్యత మాది. ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం. ప్రతి కార్యక్రమం యువత బాగా పాల్గొంటున్నారు. జాబు రావాలంటే బాబు రావాలి.
సంవత్సరానికి 4 లక్షల చొప్పున 5 ఏళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ. 3 వేల భృతి ఇస్తాం. నేను ఐటీ ఉద్యోగాలిస్తే జగన్ వాలెంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్, డీఎస్సీను ఇస్తాం. 74 రోజులు సైకిల్ ఎక్కి టీడీపీ, జనసేన జెండాలు పట్టుకొని యువత ఇంటింటికి వెళ్లాలి. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క బీసీకైనా న్యాయం జరిగిందా? ఒక్కరికైనా లోన్లు వచ్చాయా? టీడీపీకి కంచుకోట వెనుకబడిన వర్గాలు. అందుకే జయహో బీసీ పెట్టాం.
మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ టీడీపీ. షాదీతోఫా, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం, విదేశీ విద్యను అందించాం. కాని నేడు ఒక్క కార్యక్రమం లేదు. టీడీపీ అధికారంలోకి వస్తే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ను తెస్తాం. జగన్ రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నారు. కానీ మేం అలాకాదు.. ప్రజల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం. సంపద సృష్టి ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తాం. టమోటా రైతులు బాగుపడలేదు. గిట్టుబాటు ధరను ఇప్పించి రైతును రాజుగా చేస్తాం. కోల్డ్ స్టోరేజ్ లు పెడతాం. టమోటా రైతులను ఆదుకుంటాం. రాయలసీమలో హార్టీకల్చర్ ను అభివృద్ధి చేసి ప్రపంచానికి అందిస్తాం.
వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దోపిడికి అడ్డూ, అదుపు లేదు
వైసీపీలో ఒక్కరైనా విలువల గల మంత్రి ఉన్నారా? టూరిజం మంత్రిని చూస్తే వాళ్ల కార్యకర్తల దగ్గర నామినేటెడ్ పదవుల కోసం డబ్బులు తీసుకున్నారు. పాపాల పెద్దిరెడ్డి అన్నం తినడం లేదు, ఆయనకు టిఫిన్ ఇసుక, లంచ్ మైన్స్, డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. బకాసురుడిని మించిపోయాడు పెద్దిరెడ్డి. పుంగనూరులో ఈ సారి పెద్దిరెడ్డి గెలవడు. ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు అనవసరం. పుంగనూరులో టీడీపీ జెండా ఎగురుతుంది.
నా దయా దాక్షిణ్యాల వలన పెద్ది రెడ్డి గెలిచారు. కానీ ఇప్పుడు ఆయన ఎలా గెలుస్తారో చూస్తాను. వైసీపీ పాలనలో ప్రాజెక్టులపై నిర్లక్ష్యం, పెద్దిరెడ్డి దోపిడీని ఎక్స్ పోజ్ చేస్తే అంగళ్లులో మన మీద దాడి చేసి 600 మందిని జైల్లో పెట్టారు. పెద్దిరెడ్డి పోలీసులు లేకుండా ఇంట్లో నుంచి బయటకు రాలేదు. కాని రేపు నీ దగ్గర అధికారం ఉండదు అప్పుడు నిన్ను శిక్షించే బాధ్యత టీడీపీదే. పులివెందుల్లో కూడా మీ సైకో గెలవడని జగన్ కు చెప్పు పెద్దిరెడ్డి. బెరైటీస్ అంతా ఊడ్చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు. ఆవులపల్లి రిజర్వాయర్ కట్టి రూ. 600 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారు, ఈయన పాపాలకు ఎన్జీటీ రూ. 100 కోట్లు పైన్ చేసింది. శివశక్తి డైరీతో పాడి రైతుల్ని దోచుకుంటున్నారు.
పాపాల పెద్దిరెడ్డి రూ. 35 వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడి చేశారు. దోచిన డబ్బంతా కక్కిస్తాం. పెద్దిరెడ్డి ఆయన కొడుకు, తమ్ముడు బందిపోట్ల మాదిరి తయారయ్యారు. తంబళపల్లెలో ఎక్కడ స్ధలం కనపడితే దాన్ని కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారు. పీలేరు ఎమ్మెల్యే పీలేరును పీల్చి పిప్పి చేస్తున్నాడు. పీలేరు, కలిగిరి, గుర్రం కొండ మైనింగ్ లో ఈయనే భాగస్వామి. రూ. 400 కోట్ల విలువైన భూముల్ని, రూ. 500 కోట్ల విలువైన ఇసుకను దోచుకున్నారు. మదనపల్లె, రాజంపేట ఎమ్మేల్యేను మార్చారు. కానీ పాపాల పెద్దిరెడ్డిని ఎందుకు మార్చలేదు? రైల్వే కోడూరు ఎమ్మెల్యే మంగపేట ముగ్గుగనులు, ఎర్రచందనం దోచుకుంటున్నారు. రాయచోటి ఎమ్మెల్యే భూములు దోచుకుంటున్నాడు. ఇలాంటి వాల్లు మనకు అవసరమా? వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దులందరినీ చిత్తు చిత్తుగా ఓడించాలి.
టీడీపీ అధికారంలోకి వచ్చాక పీలేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తాం. హంద్రీ-నీవా కాలువ పనులు పూర్తి చేసి చెరువులకు నీళ్లిస్తాం. ఏపీఐఐసీ ద్వారా సేకరించిన 2500 ఎకరాల్లో పరిశ్రమలు తెస్తాం. మదనపల్లె, తిరుపతి రోడ్డును పూర్తి చేస్తాం. టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.