Suryaa.co.in

Andhra Pradesh

ఓవర్ కాన్ఫిడెన్స్‌ వద్దు!

– జనసేన, బీజేపీ కమిటీల నేతలతో ముందుకు వెళ్ళంది
– గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి : ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను కూటమి అభ్యర్థులుగా బలపరిచాం. ఫిబ్రవరి మూడోతేదీన నోటిఫికేషన్ వస్తుంది. 27న ఎన్నికలు, కౌంటింగ్ మార్చి మూడోతేదీన జరుగుతాయి. ప్రతి గ్యాడ్యుయేట్‌ను కలిసి భారీ మెజారిటీ సాధించాలి. చదువుకున్న వాళ్లంతా కూటమితోనే ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

ఈ మేరకు సీఎం శుక్రవారం ఎన్డీయే కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ జరిపారు. ఇంకా, సీఎం ఏమన్నారంటే… ఎవరూ ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉండొద్దు. ఎన్డీయే పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పని చేయాలి. క్లస్టర్, యూనిట్, బూత్, ఇంచార్జ్‌లతో పాటు, జనసేన, బీజేపీ కమిటీల నేతలతో ముందుకెళ్లాలి. ఈ ఎన్నికలు ఏపక్షంగా జరగాలి. ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుంది.

ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుంది. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలి. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. ప్రభుత్వం ఏర్పాటైన ఏడు నెలల్లో ఇబ్బందులు అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది లేని పాలన సాగిస్తున్నాం.

రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోతాయని మనం చెప్పడం లేదు. గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నాం. కేంద్ర ప్రభుత్వ సాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌, రాజధాని అమరావతికి ఆర్ధిక సాయం, పోలవరానికి నిధులు, రైల్వే జోన్‌తో పాటు ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. జాబ్ ఫస్ట్ విధానంతో నూతన ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చాం. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ. ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఈ పెట్టుబడుల ద్వారా 4,10,125 ఉద్యోగాలు యువతకు వస్తాయి.

త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఇవన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది.

మూడు పార్టీల నేతలు సార్వత్రిక ఎన్నికలకు ముందు సమన్వయంతో పని చేసినట్లుగానే ఇప్పుడూ అదేవిధంగా పని చేయాలి. జరిగే ప్రతి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమికి యూటీఎఫ్ మినహా మిగతా ఉపాధ్యాయ సంఘాల మద్ధతు ఉందని ఈ సందర్భంగా అభ్యర్ధులు తెలిపారు.

LEAVE A RESPONSE