– ఉండి శాసన సభ్యుడు రఘురామకృష్ణం రాజు
ఉండి: కలిసిమెలిసి ఉంటున్న వర్గాల మధ్య చిచ్చు పెట్టాలనే ప్రయత్నాన్ని మానుకోవాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ కు ఏపీ శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసన సభ్యుడు రఘురామకృష్ణం రాజు హితవు పలికారు. పీవీ సునీల్ కుమార్ చాలా ఉన్నత, విశాల భావాలను కలిగిన మాల వర్గానికి చెందిన గొప్ప అధికారి, మహోన్నత వ్యక్తి అంటూ, నిన్న మొన్నటి వరకు జైలులో ఉండి బెయిల్ పై ఇటీవల విడుదలైన విజయ్ పాల్ మాదిగ వర్గానికి చెందిన గొప్ప మహానుభావుడు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ యూట్యూబ్ ఛానల్ లో చేసిన ప్రసంగంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
ఎవరు ఏ వర్గానికి చెందిన వారన్నది ఎవరికి అవసరం లేదని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష పడుతుంది. అంతే తప్పా … మాల, మాదిగ వర్గానికి చెందిన వారైతే ఒక ఎంపీ ని తీసుకువెళ్లి చితక బాద వచ్చునని ఏ చట్టంలో రాసి ఉందా? అని రేపల్లె శివ ప్రవీణ్ ను ఆయన సూటిగా ప్రశ్నించారు.
స్వేరో పేరిట ప్రవీణ్, ఎయిమ్స్ పేరిట సునీల్ కుమార్ ఆర్గనైజేషన్స్ స్టార్ట్
స్వేరో పేరిట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అంబేద్కర్స్ మిషన్ ఇండియా ( ఎయిమ్స్) పేరిట పీవీ సునీల్ కుమార్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లను స్థాపించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ గైడ్లైన్స్ ప్రకారం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అయినా కనీస అవగాహన లేకుండా బాధ్యతాయుతమైన ఒక ప్రభుత్వ పదవిలో కొనసాగుతూ, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ పెట్టకూడదనే కనీస జ్ఞానం లేకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పీవీ సునీల్ కుమార్ లు సొంత సంస్థలను స్థాపించుకున్నారన్నారు. ఇదే విషయమై అప్పట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థాపించిన స్వేరో సంస్థ గురించి కూడా తాను డీఓపీటీకి లేఖ రాసినట్టు తెలిపారు.
ప్రవీణ్ కుమార్ బుద్ధిజం తీసుకున్నారని, బుద్ధ భగవానుని పై నమ్మకం మంచిదే… కాదనడం లేదన్నారు. కానీ ఇతరుల మనోభావాలను దెబ్బతీసే, మీ ఉద్దేశం తప్పని గతంలోనే నేను పార్లమెంటులో ప్రసంగించానని గుర్తు చేశారు. అలాగే డీవోపీటీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. కారణాలు ఏదైనా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారని, అనతి కాలంలోనే మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారన్నారు. రెండు, మూడు ఎన్నికల్లో రెండు మూడు పార్టీల తరఫున పోటీ చేశారని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, పోటీ చేయడం తప్పు లేదని, అలాగే పార్టీ మారడాన్ని కూడా తాను తప్పు పట్టడం లేదన్నారు.
పార్టీ సిద్ధాంతాలు నచ్చనప్పుడు, తన ఆలోచనలను తారుమారు అయినప్పుడు పార్టీ మారారని పేర్కొన్న ఆయన, అది తప్పని తాను అనడం లేదన్నారు. నేను కూడా పార్టీ మారానని పేర్కొన్నారు. పార్టీలు మారినా ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారని, ఈ టాఫిక్ కు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడానికి సంబంధం లేదన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ లో మీరు ఏమి మాట్లాడారో ఒక్కసారి మననం చేసుకోండి..రేపల్లె శివ ప్రవీణ్ కుమార్. సుప్రీం కోర్టు కేసు కొట్టేసిందా?, పీవీ సునీల్ కుమార్, విజయ్ పాల్ నన్ను కొట్ట లేదా??, అలా డాక్టర్ రిపోర్ట్ ఇచ్చిందా??? అంటూ నిలదీశారు.
ఆ డాక్టర్, ఇతర వైద్యులను ఎలా ప్రలోభ పెట్టిందోనన్న స్టేట్మెంట్ ఇటీవల సుప్రీంకోర్టుకు విన్నవించాం. ఇటీవల ఆ వైద్యురాలికి సుప్రీం కోర్టు నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించినప్పటికీ, ఇతర డాక్టర్లపై ఎంత ఒత్తిడి తీసుకువచ్చి, తప్పుడు నివేదికను ఇచ్చిందో న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్ళినట్టు తెలిపారు. కస్టడీలో నన్ను ఎంత దారుణంగా హింసించారో, నా కాళ్ళను చూసి మెజిస్ట్రేట్ చలించి పోయారన్నారు. రెండు ఆసుపత్రులకు తీసుకువెళ్లి వైద్య పరీక్షలను చేయించాలని మేజిస్ట్రేట్ ఆదేశించినప్పటికీ, వీరు మేనేజ్ చేసిన ఒకే ఒక ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లారని తెలిపారు. కోర్టు ఇవ్వమన్న సమయానికి కనీసం నివేదిక కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. అటువంటి పీవీ సునీల్ కుమార్ మీ దృష్టిలో రాష్ట్రపతి మెడల్ అందుకున్న గొప్ప మహానుభావుడు అంటూ మండిపడ్డారు. పీవీ సునీల్ కుమార్ కు ఒక మెడల్, మీకు ఒక మెడల్ రావడం చూస్తే, ఆ మెడల్స్ మీదే డౌట్ వస్తుందని అన్నారు.
ఎకిమోసిస్ అంటే పశువుల వైద్యుడివైనా తెలియకపోవచ్చు
ఎకిమోసిస్ అంటే పశువుల వైద్యుడివైనా నీకు తెలియకపోవచ్చునని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఉద్దేశించి రఘురామ కృష్ణంరాజు అన్నారు. పశువుల కాళ్ళ మీద బలంగా కొడితే ఎకిమోసిస్ పెద్దగా ఉండకపోవచ్చునని, అందుకే, పశువుల వైద్యుడివైన నీకు తెలిసే అవకాశం లేదన్నారు. ఇంజురీస్ డ్యూ టు ఎక్స్టర్నల్ ప్రెషర్, ఎక్స్టర్నల్ ప్రెషర్ వల్ల రక్తం గడ్డ కట్టి, రక్తపు చారికలు వస్తే దాన్ని ఎకిమోసిస్ అంటారు ప్రవీణ్ కుమార్ అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. మిలటరీ ఆసుపత్రి ఇచ్చిన నివేదికలో ఎకిమోసిస్ గురించి స్పష్టంగా పేర్కొనట్టు తెలిపారు.
మిలటరీ ఆసుపత్రి నివేదికను నీకు పీవీ సునీల్ కుమార్ ఇచ్చి ఉండకపోవచ్చునని, ఒకవేళ తెలిసినా మీరు కొన్ని వర్గాలను రెచ్చగొట్టడానికి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉండవచ్చునని అన్నారు. ఒక్కసారి విచక్షణ జ్ఞానం ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పీవీ సునీల్ కుమార్, మీ సొంత ఛానల్లో మీరు మాట్లాడిన వీడియో కింద కామెంట్లు చూస్తే సిగ్గుతో తలదించుకోవలసి వస్తుందన్నారు.
వీడియో కింద ప్రజలు కామెంట్ల రూపంలో తిట్టిన తిట్టు తిట్టకుండా, మిమ్మల్ని తిట్టారని గుర్తు చేశారు. నాకు మాల, మాదిగ వర్గాలలో ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. మీరు ఎవరినైతే రెచ్చగొట్టాలని చూస్తున్నారో, తెల్లారి లేస్తే నా నియోజకవర్గంలో నేను వారితోనే కలిసి తిరుగుతాను. ప్రతి కులంలో పనికిమాలిన వాళ్ళు 10 శాతం మంది ఉంటారని, అది రాజుల్లోనూ, మాల, మాదిగ వర్గాలలోను ఉంటారని దానికి ఎవరు మినహాయింపు కాదని పేర్కొన్నారు. మీరు ఎవరినైతే రెచ్చగొట్టాలని చూశారో, అదే జనం పెట్టిన కామెంట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పటికైనా నోటికొచ్చినట్లు మాట్లాడడం మానివేయాలని ప్రవీణ్ కుమార్ కు రఘురామకృష్ణం రాజు హితవు పలికారు.
ఏదోరకంగా కులాలను విడదీసే ప్రయత్నం మానండి
ఏదోరకంగా కులాల మధ్య చిచ్చుపెట్టి విడదీసే ప్రయత్నం మానుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు రఘురామకృష్ణం రాజు హితవు పలికారు. పీవీ సునీల్ కుమార్, నువ్వు ప్రతిరోజు మాట్లాడుకుంటారా? అని ప్రశ్నించిన ఆయన, నన్ను కస్టడీలో చిత్రహింసలకు గురిచేయలేదని నీకు చెప్పాడా? అంటూ నిలదీశారు. చంద్రబాబు నాయుడు పై కులాల ప్రెషర్ పెడితే నేను బయట పడిపోతానని అంటూ చెప్పాడా? అంటూ నిలదీశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఏ మాత్రం ఇంటిగ్రిటీ ఉన్న నిజాలను మాట్లాడాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు నిజాలు తెలుసు
పీవీ సునీల్ కుమార్ గురించి నీకు ఏమి తెలుసు… ఎన్ని వందల కోట్ల రూపాయలు దోచుకున్నాడో తెలుసా? అంటూ సూటిగా ప్రశ్నించారు. పీవీ సునీల్ కుమార్ గురించి నేను చెప్పడం కాదు. పీవీ సునీల్ కుమార్ భార్య తెలంగాణ హైకోర్టులో గృహింస నేరం కింద కేసు దాఖలు చేసిందని గుర్తు చేశారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ పై అతడి భార్య గృహహింస నేరం కింద కేసు నమోదు చేసిందంటే, అంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. ఆ విషయం నీకు తెలియదా అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నిలదీశారు. పీవీ సునీల్ కుమార్ గురించి పిల్లను ఇచ్చిన మామ పెనమాక సుబ్బారావు తన అల్లుడు ఎంతో అవినీతిపరుడని, వందల కోట్లు దోచుకున్నాడని కేసు వేశారని గుర్తు చేశారు.
ఈ కేసు ఇంకా ఏపీ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నదని పేర్కొన్నారు. కేసు బెంచ్ పైకి రాకుండా సునీల్ కుమార్ మేనేజ్ చేస్తున్నారని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు, ఎలా మేనేజ్ చేస్తున్నాడో అతనికే తెలియాలని, ఎందుకు ఇప్పటివరకు కేసు బెంచ్ పైకి రావడం లేదో నాకైతే తెలియదన్నారు. వయసులో పెద్దవాడైనప్పటికీ సుబ్బారావు, పీవీ సునీల్ కుమార్ వేధింపులు భరించలేక చనిపోయారన్నారు.
పీవీ సునీల్ కుమార్ తో ఇద్దరు పిల్లలను కన్న భార్యనే అతడిపై గృహహింస కేసు దాఖలు చేసిన తరువాత, నా అల్లుడు అంత లంచగొండి, దుర్మార్గుడు లేడని పిల్లనిచ్చిన మామే కోర్టులో కేసు దాఖలు చేశాక, ఇప్పుడు ఎవరిని మోసం చేయడానికి ప్రవీణ్ కుమార్, అతడిని వెనుకేసుకొస్తున్నారో చెప్పాలని నిలదీశారు.
హైకోర్టుకు వెళ్ళమని సుప్రీం సూచిస్తే వెళ్లాను
కస్టోడియల్ టార్చర్ కేసు పై సుప్రీం కోర్టు సూచనల మేరకు రెండేళ్ల న్యాయపోరాటం అనంతరం, హైకోర్టు కు వెళ్ళమని సుప్రీం కోర్టు సూచిస్తేనే వెళ్లానని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు . సుప్రీం కోర్టు కేసు కొట్టి వేసిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కేసులో సిబిఐ ఎంక్వయిరీ గురించి అడిగాను.. ఇంకా ఆ పిటిషన్ పెండింగ్ లోనే ఉంది. అయినా రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి ముఖ్యమంత్రి తానా అంటే పీవీ సునీల్ కుమార్ తందానా అన్నాడు. విజయ్ పాల్ అనే పనికిమాలిన అధికారికి, నన్ను కస్టోడియల్ టార్చర్ చేసిన అనంతరం, మరుసటి నెలలోనే పదవీ కాలాన్ని పొడిగించారు.
విజయ్ పాల్ ని క్యాడర్ ఎస్పీ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. అతడు కేవలం అడిషనల్ ఎస్పీ మాత్రమేనని అన్నారు. కస్టోడియల్ టార్చర్ జరిగిందన్న ఆధారాలతోనే సుప్రీం కోర్టు నాకు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాతే నేను కేసు రిజిస్టర్ చేశాను. కంప్లైంట్ లో చాలా స్పష్టంగా పీవీ సునీల్ కుమార్ పాత్ర గురించి చెప్పాను. అయితే కంప్లైంట్ చదువుకోకుండానే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పీవీ సునీల్ కుమార్ గురించి కంప్లైంట్ లో ఏమి చెప్పలేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
నిజమైన దళితులు మీ ట్రాప్ లో పడరు
నిజమైన దళితులు ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పీవీ సునీల్ కుమార్ ట్రాప్ లో పడరని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. ఏదో నలుగురు పివి సునీల్ కుమార్ కిరాయి ఇచ్చి పోషించేవారు, రోడెక్కితే ఎక్కవచ్చునని, అంతేకానీ నిజమైన దళితులు ఎవరు ఈ అక్రమాన్ని సహించరని పేర్కొన్నారు.
నేను మాట్లాడిన వీడియో లక్షల్లో చూస్తారు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ ఛానల్లో మాట్లాడింది చూసేవారు తక్కువేనని, ఆ ఛానల్ సబ్ స్క్రైబర్లు వేలల్లోనే ఉన్నారని, నేను మాట్లాడే వీడియో లక్షలమంది చూస్తారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆ ఛానెల్ లో ప్రవీణ్ కుమార్ మాట్లాడిన వీడియో కొంతమంది స్నేహితులు నాకు పంపించారని, ఆ వీడియో చూసిన తర్వాత సమాధానం చెప్పడం నా బాధ్యతగా భావించి, మాట్లాడుతున్నట్టు తెలిపారు.