Suryaa.co.in

Political News

సర్వేలను ఎవ్వరూ నమ్మొద్దు

-సర్వేల మాయాజాలం
-అడ్డంగా దొరికిపోయిన ఓ సర్వే సంస్థ
(అంకబాబు)

ఇప్పుడు సర్వేల కాలం నడుస్తోంది. ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా ఇస్తున్నారో.. ఏ అభ్యర్థికి అనుకూలంగా ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. గతంలో సర్వే ఫలితాలు.. సర్వే వివరాలు అంటే ఎంతో నమ్మకం ఉండేది. ఇప్పుడదంతా తూచ్‌ అనే పరిస్థితి వచ్చేసిందనే చెప్పాలి. సర్వే వివరాలు చెబితే చాలు.. ఆ ఫలానా వాడు సర్వే చేయించాడా..? అనే టాక్‌ ఎక్కువగా వస్తోంది.

దీంతో సర్వే సంస్థలు తమ విశ్వసనీయతను కాపాడుకోవడం చాలా కష్టంగా మారిందనే చెప్పాలి. ప్రజల్లో ఉన్న అభిప్రాయాలకు.. అంచనాలకు తగ్గట్టే కొన్ని సర్వే సంస్థలు కూడా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు ఇప్పటి నుంచి ప్రజలకు ఎలాంటి సర్వే వివరాలు ఇవ్వాలనే అంశాన్ని ముందుగానే ప్రిపేర్‌ చేసేసుకున్నాయట. ఓ ఐదు సర్వే సంస్థలు ఇప్పటికే ఏపీలోని ఓ పార్టీకి అమ్ముడుపోయాయనే చర్చ జరుగుతోంది. ఇటీవల కాలం వరకు ఓ పార్టీకి కచ్చితంగా గెలుస్తుందనే రీతిలో సర్వే వివరాలు ఇచ్చిన వాళ్లు.. ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా సర్వేలు ఇస్తున్నారని టాక్‌ నడుస్తోంది.

ఇలా అమ్ముడుపోయిన ఓ సర్వే సంస్థ ఇటీవల కాలంలో అడ్డంగా ఓ చోట బుక్‌ అయింది. ఓ పార్టీకి చెందిన అభ్యర్థి తన నియోజకవర్గంలో సర్వే చేయించారట.. ఓ వారం రోజుల పాటు సర్వే చేసిన సదురు సర్వే సంస్థ.. తమతో సర్వే చేయించుకున్న ఆ అభ్యర్థికి ఐదు శాతం ప్లస్‌లో ఉన్నారని.. కచ్చితంగా గెలుస్తారని చెప్పిందట. ఇక అదే సంస్థతో ఆ అభ్యర్థికి సంబంధించిన పార్టీ పెద్దలు సర్వే చేయించారట. ఆ అభ్యర్థికి చెందిన నియోజకవర్గం పైనే సర్వే చేయించారట.

అక్కడ సర్వే చేసిన అదే సర్వే సంస్థ పార్టీ పెద్దలకు మాత్రం అక్కడ తేడాగా ఉందని.. 5 శాతం మైనస్‌లో ఆ పార్టీ అభ్యర్థి ఉన్నారని నివేదిక ఇచ్చిందట. ఈ విషయంపై పార్టీ ఆరా తీయడంతో కిక్కురమనలేదట ఆ సంస్థ ప్రతినిధులు. ఎవరైనా అభ్యర్థి సర్వే చేయించుకుంటే ఆ అభ్యర్థికి అనుకూలంగా ఇవ్వడం రోటీన్‌. ఇక తన వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం పార్టీలు చేయించే సర్వేల్లో కొందరు పార్టీకి టైట్‌గా ఉంది.. కష్టం అనే రీతిలో నివేదికలు ఇస్తున్నారట.

ఇలా చేస్తే.. సదురు పార్టీల పెద్దలు కంగారుపడి మళ్లీ మరోసారి రాష్ట్రం మొత్తం సర్వే చేయిస్తే.. ఆ మేరకు సదురు సర్వే సంస్థలకు బిజినెస్‌ పెరుగుతుందట. దీంతో ఈ మార్గాన్ని కొన్ని సర్వే సంస్థలు తప్పుడు సర్వేలతో అటు పార్టీలను.. ఇటు ప్రజలను పక్క దారి పట్టిస్తున్నాయనే చెప్పాలి.

ఏతా వాతా చెప్పొచ్చేదేటంటే.. సర్వేలను ఎవ్వరూ నమ్మొద్దు.. సమాజానికి ఎవరు మంచి చేస్తారో ఎంచుకుని ఓటు వేయాలని సూచన. అందరూ ఆ తాను ముక్కలేనని ఫీలైతే.. ఎవరి వల్ల చెడు ఎక్కువగా ఉంటుందో బేరీజు వేసుకుని వారిని దూరంగా పెట్టమని విజ్ఞప్తి.

LEAVE A RESPONSE