Home » హుండీలో పర్సంటేజ్ ఇవ్వరని తెలియదా స్వామీ?

హుండీలో పర్సంటేజ్ ఇవ్వరని తెలియదా స్వామీ?

ఒక ప్రతిష్థాత్మక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నత పదవులు పొందిన వారు విజ్ఞతతో ఆలోచించాలి. లేకపోతే సదరు వ్యక్తుల వల్ల ఆ ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, భక్తుల ముందు అజ్ఞానులుగా మిగిలే ప్రమాదం ఉంటుంది. చులకనయ్యే అవకాశం ఉంది. తాము తీసుకునే నిర్ణయాలు భక్తకోటి హర్షించే విధంగా ఉండాలి. భక్తనీరాజం పట్టే విధంగా ఉండాలి. టీడీపీ లాంటి విశ్వవ్యాప్త కీర్తి ప్రతిష్ఠలున్న బోర్డులోని సభ్యుల నుంచి భక్తకోటి ఆశించేది అదే.

కానీ నిబంధనలు సహకరించవని తెలిసికూడా, దేవుడి డబ్బుతో సొంత రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తే చివరకు భంగపాటు తప్పదు. ఇటీవలి టీడీపీ తిరుపతి పట్టణాభివృద్ధి విషయంలో తీసుకున్న నిర్ణయం అలాంటిదే. వెంకన్న సన్నిధిలో పెద్ద హోదాలో ఉన్నవారికి దేవుడిపై విశ్వాసం లేకపోవచ్చు. వారు ఒకప్పుడు నాస్తికులు కావచ్చు. కానీ వెంకన్నకు తనను తాను రక్షించుకోవడం తెలుసు. హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్న వారికి.. చివరకు ఎలాంటి దుర్గతి పట్టిందో, పెద్ద పదవుల్లో ఉన్న వారు గ్రహించి జాగ్రత్తపడటం మంచిది. ఇది రాజకీయాలకు అతీతంగా వ్యక్తమవుతున్న సూచన.

ఒక చిత్రమైన నిర్ణయం ప్రపంచ వ్యాప్తం గా శ్రీనివాసుని భక్తులు, ధార్మిక సంస్థల నిర్వాహకులను ఒకింత తుళ్లుపాటుకు గురి అవటానికి అయిన కారణం వేంకటేశ్వరుని వార్షిక ఆదాయం లో 1% తిరుపతి మున్సిపాలిటీకి ఇవ్వాలని పాలకమండలి తీర్మానించడం, వెను వెంటనే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగింది. దీని పూర్వ పరాలను గమనిస్తే ఒకింత గగుర్పాటు, ఆశ్చర్యం.

దేవ దేవుణ్ణి కొలిచే ఎవరికి అయినా కలగక మానదు. ఈ ప్రతిపాదన తెరపైకి రాక ముందే, స్వయం ప్రకటిత మేధావులు ఒక సమావేశం పెట్టడం, అందులో 1% కాదు, 5నుంచి 10% వరకు టీటీడీ దేవస్థానం తిరుపతి మున్సిపాలిటీకి ఇవ్వటం తప్పులేదు. ఇది చాలా గొప్ప ఆలోచన అని వక్తలందరు పోటీ పడి మరీ వ్యక్తపరచడం జరిగింది.

అసలు ఈ ఆలోచనకు కొలబద్ద ఏంటి అని చర్చించే ముందు, ఒకసారి గతాన్ని మననం చేసుకుందాం. ఒకప్పటి ఆచరణలో కొన్ని అర్చక కుటుంబాలు ,” మిరాశీ” వ్యవస్థ ఆచరణ లో , దేశ విదేశాలనుంచి భక్తులు హుండీలో వేసే ముడుపులు, కానుకలు, ధన, వస్థు ( బంగారు, వెండి, వగైరా) స్వామి ప్రసాదాల విక్రయం లో భాగం తో పాటుగా, హుండీలో కూడా కొంత భాగాన్ని(పర్సంటేజ్) మిరాశీ వ్యవస్థ లోని వారికి దక్కేది.

ఎన్. టి. రామారావు ముఖ్యమంత్రి అయిన తడవుగా , భక్తుల కానుకలను పంచడమేంటి, భక్తి తో భక్తులు శ్రీ వారికి సమర్పించిన ఏవైనా( కొన్ని ఆస్తులు కూడా) టీటీడీ కే చెందాలి. అవి సంస్థ ఆస్థి అని మిరాశీ వ్యవస్థను రద్దు చేయటం జరిగింది. ఇక వ్యవస్థలోని అర్చకులకు ఇవ్వవలసిన గౌరవ మర్యాదలను , వంశ పారంపర్య అర్చకత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. దీనిపై సుప్రీం కోర్టు దాకా మిరాశీ నిర్వహకులు వెళితే , కోర్టు కూడా భక్తితో భక్తుల సమర్పించే ఎలాంటి కానుకలలో భాగం ఇవ్వకూడదు అని అప్పట్లోనే కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది.

ఇక వర్తమానానికి వస్తే మేధావుల ఉవాచ తిరుపతి లేనిదే తిరుమల లేదు. ఈ రెంటి కలయికనే టీటీడీ, తిరుమలకు వెళ్లే ప్రతి భక్తుడు, తిరుపతి మీదుగానే వెళ్ళాలి గనక తిరుపతి అభివృద్ధికి మునిసిపాలిటీ కి 1,% వేంకటేశ్వరుని ఆదాయం (హుండీలో ఇదే ప్రధాన వనరు గనక) లో కేటాయించాలి అని డిమాండ్ ,తదనుగుణం గానే నిర్ణయం,ఆపేయమని ప్రభుత్వం చెప్పటం చక చకా జరిగినా, ఇది అన్యాయం అని అఖిల పక్ష మీటింగ్ ద్వారా తీర్మానించారు.

కొనసాగింపుగా టీటీడీ ముఖ్య కార్యాలయం ముందు ధర్నాలు, దీక్షలు లకు పిలుపునివ్వడం జరుగుతున్నాయి. సున్నితమైన భక్తుల విశ్వాసాలను, సంస్థ సంప్రదాయాలను పక్కన పడేసి రాజకీయ చట్రం లోకి లాగటం ఎవరి కి లబ్ది ? అని భక్తుల గుసగుసలు. వాస్తవానికి తిరుపతి, తిరుమల వేరు కాదు అందుకే ” తిరుపతి తిరుమల దేవస్థానం” గా పిలవబడుతుంది. మరి లక్షలమంది నిరంతరం తిరుపతి లోకి ప్రవేశిస్తున్నప్పుడు వారికి కావలసిన అవసరాలు, వసతులు, హాస్పిటల్స్, తో పాటు ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధిలో దేశ పటం లో ముందంజలో పెట్టాల్సిన భాధ్యత టీటీడీ దే. ఇది ఎవ్వరూ కాదనకూడని కఠోర సత్యం.

మరి ఇన్నాళ్లు తిరుపతి లో జరిగిందేమిటి..నగరం లోని అన్ని ప్రధాన రహదారులు ఇప్పటి వారధి తో కలిపి ఇతోధిక ఆర్థిక సహకారం, ఎన్నో హాస్పిటల్స్, విద్యాసంస్థలు, పార్కులు, వసతి సముదాయాలు, ఆడిటోరియం లు, ఇలా ఎన్నో… అయినా నగరాభివృద్ధికి ఇంకా మెరుగైన , ఆధునీకరణకు కావాలి అనుకుంటే టీటీడీ ముందు ఆ ప్రాజెక్ట్స్ పెట్టి తుడ అధ్యకుడు టీటీడీ బోర్డు మెంబర్ కూడా, అలాగే స్థానిక శాసన సభ్యుడు, మునిసిపల్ కమిషనర్ కూడా తిరుపతి అభివృద్ధి కమిటీ లో టీటీడీ ఈవో తో పాటు వీరు కూడా సభ్యులే.

ప్రజావసరాల కోసం నిర్ధిష్టమైన ఏ ప్రతిపాదన అయిన అలవోకగా సాధించుకో కలిగినప్పుడు, హోల్ సేల్ గా వేంకటేశుని ఆదాయం లోనే 1% ఇవ్వాలని డిమాండ్ చేయడంలో వారి భక్తి, విశ్వాసాలు, చిత్తశుద్ధిని భక్తులు శంకిచే ప్రమాదం ఉంది. గతంలో రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఆర్థిక సహాయం కూడా, టీటీడీ తిరస్కరించిన సందర్భం మరువ కూడదు.

ఇటీవల కాలంలో లో శ్రీవారి నడక మార్గం లో.. ఇద్దరు చిన్న బిడ్డల విషయం లో చిరుత సృష్టించిన కల్లోలం భక్తులను కలవర పరిచిన సందర్భం లో , చేతి కర్రలు నడిచే వారందరికీ ఇవ్వాలని ప్రతి పాది0చినప్పుడు, విమర్శలువెల్లువెత్తాయి. ఆ నేపథ్యం లో , ఇప్పటికీ ఎవరికీ దాదాపు పదేళ్లు చైర్మన్ , సభ్యుడిగా పనిచేసినా దక్కని భాగ్యం ..ఇప్పటి టీటీడీ చైర్మన్ కి దక్కింది.

అంత అనుభవం , సంస్థ తో అంత అనుబంధం కలిగిన వ్యక్తి గా , విమర్శలకు బెదరను అన్నప్పుడు… ఇప్పటి 1% ప్రపోజల్ విషయం తో కలిపి, పరిణతి చెందిన ఆధ్యాత్మిక వేత్త గా ప్రబలుతున్న వారు, ఒక్కసారి ఆత్మ పరిశీలన ఆశించడం తప్పేమీ కాదు.

నడక మార్గం లో చనిపోయింది , గాయపడింది చిన్న పిల్లలు, పెద్దవారు కాదు, చిరుత గురి చిన్న పిల్లల పైనే. కర్రలేమో పెద్దవారికి. సరైన, సముచిత మార్గాన్ని దాదాపు మీ అంత అనుభవం, అనుబంధం కలిగిన ఇఓ గారితో కలిసి అన్వేషి0చ గలరు.

– డాక్టర్ ఓ.వి.రమణ
టీటీడీ మాజీ పాలకమండలి సభ్యులు,
తెలుగుదేశం పార్టీ నాయకులు

Leave a Reply