Suryaa.co.in

Andhra Pradesh

రాజకీయ లబ్ధి కోసమే పెన్షన్లపై దొంగ నాటకాలు

-రాజకీయ లబ్ధి కోసమే పెన్షన్లపై దొంగ నాటకాలు
-రక్తం తాగే జగన్‌ వంటి సైకోను ఎక్కడా చూడలేదు
-వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ధ్వజం
-18వ వార్డులో మక్కెనతో కలిసి ఎన్నికల ప్రచారం

అవ్వాతాతల పెన్షన్లు, చావులతో రాష్ట్రవ్యాప్తంగా శవ రాజకీయాలు చేస్తూ చావు తెలివి తేటలు ప్రదర్శిస్తూ వైసీపీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ధ్వజమెత్తారు. గురువారం వినుకొండ 18వ వార్డులో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్య, కోడికత్తి కేసులను రాజకీయంగా వాడుకున్న వైసీపీకి ఈసారి అలాంటివి దొరక్క అవ్వాతాతలపై పడిరదని నిప్పులు చెరిగారు. ఇంటివద్దకు పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ వేసవి ఎండల్లో వృద్ధులను ముప్పుతిప్పలు పెడుతూ ఈ పాపాలను ప్రతిపక్షాల పై నెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన స్వార్థం కోసం, ఓట్ల కోసం ఇంత దౌర్భాగ్యానికి ఒడిగడుతున్న జగన్‌ లాంటి సైకోను చరిత్రలో ఎక్కడా చూడలేదన్నారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ విషయంలో నెలకొన్న పరిణామాలు, వృద్ధుల సమస్య, వైసీపీ శవరాజకీయాలపై నిప్పులు చెరిగారు.

వాలంటీర్‌ వ్యవస్థకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, రాజకీయ కార్యకలాపాలకు వారిని దూరంగా ఉంచాలనే మొదటి నుంచి చెబుతున్నామన్నారు. వాలంటీర్‌ వ్యవస్థ లేని రాష్ట్రాల్లో ఎక్కడా పింఛన్లు పంపిణీ చేయడం లేదా అంటూ రాష్ట్ర హైకోర్టు కూడా ప్రశ్నలు సంధించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమ్మానాన్నల్ని చంపి అయ్యో అనాథని అయిపోయానే అని ఏడ్చే కిరాతక స్వభావం గల వ్యక్తి జగన్‌ అని తూర్పారాబట్టారు. తన వారు, బయట వారన్న బేధం లేకుండా ఎదుటివారి రక్తపు చారికలపై అధికార పీఠాన్ని నిర్మించుకున్న జగన్‌ లాంటి క్రిమినల్‌ ఇంతకంటే మంచి రాజకీయం చేస్తారని కూడా అనుకోవడం లేదని దుయ్యబట్టారు.

ఏం చేసినా ఓటమి తప్పదని తెలిసిపోయిన తర్వాత ఎన్నికల్లో లబ్ధి కోసం అవ్వాతాతలను ఏడిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పింఛనుదారుల డబ్బు మళ్లించింది కాక దొంగ నాటకాలు ఎందుకని నిలదీశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఇంటికే నెలకు రూ.4 వేల పింఛను అందిస్తామని పునరుద్ఘాటించారు. తప్పుడు ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజీపే నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE