Suryaa.co.in

Andhra Pradesh

వైజాగ్‌లో డ్రగ్స్ కలకలం

-25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనం
-50 వేల కోట్ల ఖరీదైన డ్రగ్స్ పట్టివేత
-ఇంటర్‌పోల్ హెచ్చరికలతో సీబీఐ అలెర్ట్
-మెరుపుదాడితో డ్రగ్స్ స్వాధీనం
-కంటైనర్ బుక్ చేసిన కన్సిగ్నీ కంపెనీ
-ఎవరిదా కంపెనీ? ఏమా కధ?
( అన్వేష్)

విశాఖపట్టణం: ఏపీ డ్రగ్స్ హబ్‌గా మారుతోందన్న ఆవేదనకు ఇది పరాకాష్ట. విశాఖ వేదికగా డ్రగ్స్, గంజాయి దేశవ్యాప్తంగా పంపిణీ అవుతున్న నేపథ్యంలో, తాజాగా పట్టుబడ్డ 25 వేల కిలోల డ్రగ్స్ దేశాన్ని ఉలికిపడేలా చేసింది. విశాఖ డ్రగ్స్‌కు హబ్‌గా మారిందంటూ ఇటీవలే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు లోకేష్ ఆరోపణలు నిజం చేస్తూ, 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుపడటం కలకలం సృష్టిస్తోంది.

బ్రెజిల్ నుంచి కన్సిగ్నీ అనే కంపెనీ బుక్ చేసిన కంటైనర్‌లో రవాణా చేస్తున్న 25 వేల కిలోల డ్రగ్స్‌ను ఇంటర్‌పోల్ పసిగట్టింది. వెంటనే సీబీఐని అప్రమత్తం చేసింది. దానితో హుటాహుటిన రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు, పోర్టును చుట్టుముట్టారు. పట్టుబడ్డ డ్రగ్స్ 50 వేల కోట్ల రూపాయల వరకూ ఉండవచ్చన్నది సీబీఐ అంచనా. ఇంతకూ కంటైనర్‌ను బుక్ చేసిన కన్సిగ్నీ కంపెనీ ఎవరిదన్న ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటివరకూ అధికార పార్టీ నేతలే గంజాయి రవాణా చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో, ఇప్పుడు ఏకంగా 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడటం సంచలనం సృష్టించింది. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు ఇప్పటివరకూ కాకినాడ పోర్టు వేదికగా బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నారని, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలకు రవాణా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ఈనేపథ్యంలో 50 వేల కోట్ల రూపాయల ఖరీదయ్యే డ్రగ్స్, విశాఖలోనే పట్టుపడటం కలవరం కలిగించింది. ఇంతకూ కన్సిగ్నీ కంపెనీ ఉందా? లేక ఆ పేరుతో ఎవరైనా రవాణా చేశారా? అన్నది చ ర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ దందా వివరాలివి.

విశాఖపట్టణం షిప్పింగ్ యార్డ్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 25 వేల కిలోల డ్రగ్స్‌ను కస్టమ్స్, సీబీఐ అధికారులు కలిసి సీజ్ చేశారు. వెయ్యి బ్యాగులను సీజ్ చేశారు. ఒక్కో బ్యాగుల్లో 25 కిలోల డ్రగ్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ విలువ రూ.50 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

బ్రెజిల్ నుంచి విశాఖపట్టణం పోర్టుకు డ్రగ్స్ వస్తున్నాయని ఇంటర్ పోల్ సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చింది. కస్టమ్స్ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ గరుడ పేరుతో ఆపరేషన్ చేపట్టారు. ఓ ప్రైవేట్ సంస్థ డ్రగ్స్ దిగుమతి చేసిందని అధికారులు ప్రాథమికంగా తెలిపారు.

బ్రెజిల్‌లో గల శాంటోస్ పోర్టు నుంచి నుంచి కన్‌సైన్‌మెంట్ వస్తుందని ఇంటర్ పోల్ నుంచి సీబీఐ అధికారులకు సమాచారం అందింది. విశాఖపట్టణం కస్టమ్స్ విభాగాన్ని సమన్వయం చేసుకొని ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో దాడులు నిర్వహించారు.

విశాఖపట్టణానికి చెందిన కన్సిగ్నీ అనే ప్రైవేట్ కంపెనీ కన్‌సైన్‌మెంట్ బుక్ చేసిందని సీబీఐ అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఇతర పదార్థాలతో డ్రగ్స్ కలిపి అంతర్జాతీయ ముఠా దిగుమతి చేస్తుంటారు. ఇక్కడ కూడా అదేవిధంగా డ్రగ్స్ దిగుమతి చేశారు. ఇదివరకు కూడా ఇంటర్ పోల్ సమాచారంతో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించి డ్రగ్స్‌ను సీజ్ చేశారు.

LEAVE A RESPONSE