-ఓ విద్యార్థిని వింత ప్రవర్తన
-సంచలన నిజాలు వెలుగులోకి
మైనర్లను సైతం మత్తుకు బానిసలుగా మార్చుతున్నాయి. మాయమాటలతో పిల్లలను డ్రగ్ రాకెట్లోకి లాగి, వారి చేత అసభ్యకరమైన పనులకు పాల్పడేలా పురిగొల్పుతున్నాయి. ఇలాంటి షాకింగ్ ఘటన తాజాగా జగిత్యాలలో వెలుగు చూసింది. ఓ తండ్రి చేసిన ఫిర్యాదుతో ఒళ్లు గగుర్పొడిచే ఈ డ్రగ్స్ బాగోతం బయటపడింది.
జగిత్యాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కొన్ని రోజుల నుంచి వింతవింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. మొదట్లో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అంతగా ఖాతరు చేయలేదు. అయితే.. ఈమధ్య అమ్మాయి మరింత విచిత్రంగా వ్యవహరిస్తుండటంతో తండ్రికి అనుమానం వచ్చింది. ఎందుకిలా ప్రవర్తిస్తోందని ఆరాతీయగా.. ఆమె గంజాయికి అలవాటు పడిందని తండ్రికి తెలిసింది.
దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శిశు సంరక్షణ కమిటీ.. వెంటనే దర్యాప్తు చేపట్టింది. ఈ విచారణలో భాగంగానే మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ అమ్మాయితో పాటు పదో తరగతి చదువుతున్న ఇతర విద్యార్థినులు సైతం మత్తుకు బానిసైనట్లు తేలింది. మొత్తం 10 మంది బాలికలు గంజాయికి బానిసైనట్లు తెలిసింది.
అసలు ఈ అమ్మాయిలకు ఎక్కడి నుంచి గంజాయి అందిందని మరింత లోతుగా విచారించగా.. దీని వెనుక ఓ సెక్స్ రాకెట్ ముఠా ఉన్నట్టు వెలుగులోకొచ్చింది. ఆ బాలికలను గంజాయికి బానిసలను చేయడమే కాదు.. వారిని హైదరాబాద్లోని రేవ్ పార్టీలకు కూడా తరలిస్తున్నట్టు వెల్లడైంది. అలా తరలించినందుకు గాను.. ప్రతి పార్టీకి రూ.30 వేలు ఆ ముఠాకు అందుతున్నట్టు తెలిసింది.
ఈ తరుణంలోనే నార్కొటిక్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగారు. సెక్స్ రాకెట్ ముఠాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సూత్రధారులు ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు. మరోవైపు.. మత్తుకు బానిసైన విద్యార్థినులను స్వధార్ హోంకు తరలించారు.